Friday, April 26, 2024

ఎంసెట్‌లో అబ్బాయిలదే హవా

- Advertisement -
- Advertisement -

ఇంజినీరింగ్ టాప్ టెన్‌లో 8, అగ్రికల్చర్ టాప్ టెన్‌లో
7 ర్యాంకులు వారికే ఇంజినీరింగ్‌లో 80.41%
అగ్రికల్చర్‌లో 88.34% ఉత్తీర్ణత ఎంసెట్ ఫలితాలు
విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
21 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 23-30
ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్ 6న ఇంజినీరింగ్
మొదటి విడత కౌన్సెలింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్‌లో అబ్బాయిలు ర్యాంకుల పంట పండించారు. ఇంజనీరింగ్‌లో టాప్-10 ర్యాంకుల్లో 10కి 8 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. అగ్రికల్చర్ ఎంసెట్‌లో టాప్ టెన్ ర్యాంకుల్లో 7 అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ టాప్ 2,4 ర్యాంకులను, అగ్రికల్చర్‌లో టాప్ 1,6,7 ర్యాంకులు అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం జెఎన్‌టియుహెచ్‌లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహ్మారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సారి ఇంజనీరింగ్‌లో 80.41 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్ ఎంసెట్‌లో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 18,19,20 తేదీలలో ఆరు షిఫ్టులుగా నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షకు 1,72,238 మంది దరఖాస్తు చేసుకోగా, 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,26,140 మంది విద్యార్థులు (80.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

అలాగే గత నెల 30,31 తేదీలలో జరిగిన అగ్రికల్చర్ ఎంసెట్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది హాజరయ్యారు. అందులో 71,180 మంది(88.34 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో ఎంసెట్‌లో హైటెక్ సిటీకి చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, ఎపి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్క సాయి దీపిక రెండో ర్యాంకు సాధించారు. ఎపి తెనాలికి చెందిన పాలిశెట్టి కార్తికేయ మూడో ర్యాంకు, శ్రీకాకుళంకు చెందిన పల్లి జలజాక్షి నాలుగో ర్యాంకు, మెండ హిమ వంశీ ఐదవ ర్యాంకు సాధించారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో ఎపి గుంటూరు జిల్లాకు చెందిన జుటూరి నేహ మొదటి ర్యాంకు పొందగా, విశాఖపట్నంకు చెందిన వంటకు రోహిత్‌కు రెండో ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన కల్లం తరుణ్‌కుమార్ మూడో ర్యాంకు, కూకట్‌పల్లికి చెందిన కొట్టపల్లి మహీత్ అంజన్‌కు నాలుగో ర్యాంకు, గుంటూరుకు చెందిన గుంటుపల్లి శ్రీరాంకు ఐదవ ర్యాంకు లభించింది.

ఎంసెట్ కౌన్సెలింగ్ ఏర్పాటు : మంత్రి సబిత

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సెంటర్‌లో కళాశాలలు, కోర్సుల వివరాలు అందుబాటులో ఉంచుతామని అన్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికలో ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టా క్లిష్టమైన పరిస్థితుల్లో విజయవంతంగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించిన యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎంసెట్ నిర్వహణకు పగడ్బంధీగా ఏర్పాట్లు చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిర్వహించారని అన్నారు. సజావుగా ఎంసెట్ నిర్వహణకు సహకరించిన వివిధ శాఖలకు మంత్రి కృతజతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, ఉత్తీర్ణులైన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకర్లు

1. పోలు లక్ష్మిసాయి లోహిత్ హైదరాబాద్

2. నక్క సాయి దీపిక శ్రీకాకుళం(ఎపి)

3. పొలిశెట్టి కార్తికేయ తెనాలి(ఎపి)

4. పల్లి జలజాక్షి శ్రీకాకుళం(ఎపి)

5. మెండ హిమ వంశీ శ్రీకాకుళం(ఎపి)

6. గండు హరిదీప్ తూర్పుగోదావరి

7. దయ్యాల జాన్ జోసెఫ్ విశాఖపట్నం

8. పెనికలపాటి రవికిశోర్ గుంటూరు(ఎపి)

9. గవినికాడి అరవింద్ నాగర్‌కర్నూల్

10. నందన్ మంజునాథ్ కూకట్‌పల్లి(టిఎస్)

అగ్రికల్చర్ ఎంసెట్ టాప్ 10 ర్యాంకర్లు

1.జుటూరి నేహా గుంటూరు(ఎపి)

2. వంటకు రోహిత్ విశాఖపట్నం

3. కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు(ఎపి)

4. కొత్తపల్లి మహీత్ అంజన్ హైదరాబాద్

5. గుంటుపల్లి శ్రీరాం గుంటూరు(ఎపి)

6. మువ్వ నివేదిక విజయవాడ(ఎపి)

7.మిట్నాల శివ తేజస్విని కర్నూల్(ఎపి)

8. విఎస్‌వి శ్రీ శశాంక్ హైదరాబాద్

9. ప్రణీత్ గంజి హైదరాబాద్

10. వజ్రాల దినేష్ కార్తీక్ రెడ్డి గుంటూరు(ఎపి)

ఇసెట్‌లో 90.69 శాతం ఉత్తీర్ణత

పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బి.టెక్, బి.పార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఇసెట్ పరీక్షలో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఇసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల ఒకటవ తేదీన నిర్వహించిన ఇసెట్ పరీక్షకు 24,055 మంది దరఖాస్తు చేసుకోగా, 22,001 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 19,954 మంది(90.69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఇసెట్ కన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News