Saturday, April 27, 2024

మెడికల్ కాలేజీల్లో 3897 పోస్టులు

- Advertisement -
- Advertisement -

9 కొత్త మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు
వివిధ కేటగిరీల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
తెలంగాణ ఏర్పాటు తర్వాత మెడికల్ కాలేజీల్లో మొత్తం 15,476 పోస్టుల మంజూరు
ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుడగు: ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో 9 మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీకి వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయ శంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ మెడికల్ కాలేజీలకు, వీటి అనుబంధ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం పోస్టులు ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన 12 మెడికల్ కాలేజీలు సహా కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీల కోసం ఇప్పటివరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 15,476 పోస్టులు మంజూరు చేసింది.

ప్రారంభమైన 8 కొత్త మెడికల్ కాలేజీలు
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్‌లోని ప్రభుత్వం మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించింది. ఎనిమిదేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 5 నుంచి 17కు పెంచింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కెసిఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో అదనంగా 1,150 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850గా ఉన్న ఎంబిబిఎస్ సీట్లు, ఈ ఏడాది నాటికి 2,790కి పెరిగాయి. అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో భాగంగా, వచ్చే ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా 3,897 పోస్టులు మంజూరు చేస్తూ గురువారం ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

ఆరోగ్య రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు: మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను అందించే లక్ష్యంలో ఇదొక ముందడుగు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల ఒకవైపు నాణ్యమైన వైద్యం, మరో వైపు మెడికల్ విద్య రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నదని చెప్పారు. నాడు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటం వల్ల గ్రామీణ ప్రజలకు చేరువైందని తెలిపారు. తద్వారా పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండటంతో పాటు వైద్యం కోసం చేసే ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు. మరోవైపు డాక్టర్ కావాలని కలలుకనే విద్యార్థులకు, స్థానికంగా ఉంటూనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు.

TS Finance Dept declares 3897 posts in 9 medical colleges

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News