Tuesday, April 30, 2024

ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు…?

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు…?
సిబిఎస్‌ఇ పరీక్షల కంటే ముందే నిర్వహణ
విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఉండేలా ప్రశ్నాపత్రం
70 శాతం సిలబస్‌కే పరీక్షలు..మిగతా 30 శాతానికి అసైన్‌మెంట్లు

TS Inter Board
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు సిబిఎస్‌ఇ పరీక్షల కంటే ముందుగానే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలను నిర్వహించే అంశాన్ని ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సిబిఎస్‌ఇ వార్షిక పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సిబిఎస్‌ఇ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. సిబిఎస్‌ఇ పరీక్షలు మే 4న ప్రారంభమై జూన్ 10 వరకు జరుగనున్న నేపథ్యంలో ఆ లోపే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంసెట్, జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏటా మార్చిలో ప్రారంభమయ్యే పరీక్షలు ఈ విద్యాసంవత్సరం ఈసారి ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత వస్తే రెండు మూడు రోజుల్లో పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే దాదాపుగా సగానికిపైగా విద్యాసంవత్సరం కేవలం ఆన్‌లైన్ తరగతులకే పరిమితమైన నేపథ్యంలో పరీక్షల విధానంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల్లో ఇప్పటివరకు ఉన్న దాని కంటే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి, ఎక్కువ ఛాయిస్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు భౌతిక తరగతులు ప్రారంభంకాని నేపథ్యంలో ప్రశ్నలు వ్యాసరూప విధానంలో సమాధానాలు రాసే ప్రశ్నలకు తగ్గించి, సంక్షిప్త సమాధానం రాసే ప్రశ్నలకు ఎక్కువగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రాక్టికల్స్‌లో కూడా విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఇవ్వనున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ వివిధ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తరువాతే పరీక్షల తేదీలు, పరీక్షల విధానాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు
కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతున్న నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. మిగతా 30 శాతం సిలబస్‌ను కేవలం అసైన్‌మెంట్లకే పరిమితం చేయనున్నారు. విద్యార్థులు మొత్తం సిలబస్ చదివినా అందులో 70 శాతం సిలబస్ నుంచే వార్షిక పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వార్షిక పరీక్షలకు 30 శాతం సిలబస్‌ను తగ్గించనున్నారు.
18 నుంచి కళాశాలలు ప్రారంభం…?
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని అనుకున్నా చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానిని వాయిదా వేశారు. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా విద్యాసంస్థలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించాల్సి ఉన్న నేపథ్యంలో షిఫ్ట్ విధానంలో కళాశాలలు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం లేదా ఉదయం సైన్స్ గ్రూపుల విద్యార్థులకు, మధ్యాహ్నం ఆర్ట్ గ్రూపుల విద్యార్థులకు తరగతులు నిర్వహించ నున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగా ఆన్‌లైన్ తరగతులలోని సందేహాలు నివృత్తి చేయడంతో పాటు అర్థంకాని పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

TS Inter Exams 2021 likely to be conducted in April?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News