Tuesday, May 7, 2024

లైసెన్స్ లేని ఫైనాన్స్ సంస్థలపై నజర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా గల చిట్టీ కంపెనీలపై ఆరా

TS Police to Probe on Finance and Chit Fund firms

మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్‌లైన్ దా‘రుణాల’పై విచారణ చేపడుతున్న పోలీసులు మరోవైపు రాష్ట్రంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీలపై విచారణ సాగిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ ఆ పై వారికి వేధిస్తున్న ఘటనలపై స్పందించిన పోలీసు బాసులు అనధికారికంగా చిట్టీలు, ఫైనాన్స్ సంస్థలపై వారిపై నిఘా సారించాలని ఆ దేశాలిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఏలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్ కంపెనీ, చిట్టీలు నిర్వహిస్తున్న ప్రజలు నష్టపోకముందే భోగస్ సంస్థలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరాల కోసం అప్పులు చేసిన వారి నుంచి వడ్డీ డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్న వడ్డీ వ్యాపారులను కట్టడి చేయాలని, నిరుపేదల అవసరాలను అవకాశంగా చేసుకుని వేధిస్తున్న వడ్డీ వ్యాపారులను కట్టడి చేయాలని పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నిరుపేదల నిస్సహాయత వడ్డీవ్యాపారులకు ఆదాయంగా మారిందని, ముఖ్యంగా మధ్య తరగతి వారి అవసరాలే వారికి పెట్టుబడులుగా మారారని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధిక వడ్డీలను వసూలు చేసే సంస్థలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సికిందరాబాద్, హైదరాబాద్ నగరం, ఆపై శివారు ప్రాంతాలలో రమారమి 250కి పైగా అనధికారిక వడ్డీ వ్యాపార సంస్థలున్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కాగా పూట వడ్డీలు, వారం, నెలల వారీగా వడ్డీలు నడుపుతూ సామాన్యులను వేధిస్తున్న వారిపై అనతికాలంలో చర్యలు చేపట్టనున్నారు. అవసరానికి అప్పులు చేసిన వారు సకాలంలో వడ్డీలు చెల్లంచని పక్షంలో దౌర్జన్యాలకు పాల్పడుతూ దందా సాగిస్తున్న వైనంపై నగరంలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా గతంలో సామాన్యులకు శాపంగా మారిన మైక్రో ఫైనాన్స్ మరో రూపందాల్చి నిరుపేదలను నిలువునా దహిస్తోన్న విషయం విదితమే. తాజాగా మైక్రో ఫైనాన్స్ మారు రూపంలో నగర శివారుల్లోకి మురికివాడల్లో విస్తరించి నిరుపేదలను గ్రూపులుగా తయారు చేస్తూ అధిక వడ్డీల దందా యధేశ్చగా సాగుతోంది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున వడ్డీలను వసూలుచేస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పుదారుల నుంచి ప్రామిసరీ నోట్లు, బాండ్లు. ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. గ్రూపుల వారీగా ఫైనాన్స్ ఇవ్వడం వల్ల ఎవరు మొత్తాలు ఎగరేసినా ఆయా మొత్తాలు మిగిలిన సభ్యుల నుంచి ముక్కు పిండి వసూలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటారు. సైబరాబాద్, రాచకొండ పరిధిలో వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి కొందరు చిట్టీల మాటున అనధికారికంగా వడ్డీ వ్యాపారాలు సైతం సాగిస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ సడలించడంతో చిరు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని వడ్డీ వ్యాపారులు రోజూవారీగా అధికవడ్డీలను వసూలు చేస్తున్నారు. ఉదయం 900 అప్పుగా తీసుకుంటే సాయంత్రానికి రూ.1000 చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తూ తమ వ్యాపారాలను మరింత పెంచుకుంటున్నారు.
మరికొన్ని ప్రాంతాలలో నెలకు నూటికి రూ.30 ప్రకారం వసూళ-్ల చేస్తున్న వారు లేకపోలేదు. సకాలంలో అప్పలు, వడ్దీలు చెల్లించని వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వసూళ్ల కోసం రౌడీ గ్యాంగ్‌లను పెంచి పోషిస్తూ ఎంచక్కా ఆయా ప్రాంతాలలో తమ దందాలను సాగిస్తున్నారు. కాగా కుషాయిగూడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లాక్‌డౌన్ సమయంలో పాడి పరిశ్రమ కోసం అప్పులు చేశాడు. సదరు అప్పుదారుడు సకాలంలో వడ్డీ చెల్లించని కారణంగా గేదలను వడ్డీ కింద జమకట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో రాచకొండ పోలీసులు లింగోజిగూడాలో చట్టవిరుద్దంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న తండ్రి కొడుకులను అరెస్ట్ చేసిన విషయం విదితమే. అలాగే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తామని కరక్కాయ, మునక్కాయ, శనక్కాయ సంస్థల బాధితులు ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరానికి అప్పులు ఇస్తామని ఆశ చూపుతూ మురికి వాడను కేంద్రంగా చేసుకుని వడ్డీ కాసురులు తమ దందాలను సాగిస్తున్నారు. లాక్‌డౌన్ సమయాన్ని మియాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్,వనస్థలిపురం, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం అదేవిధంగా నగరంలోని ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక ప్రాంతాలను వడ్డీ వ్యాపారులు తమకు ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు ఆదిశగా చర్యలు చేపడుతున్నారు. పేద, మధ్య తరగతి వారి అవసరాలను అవకాశంగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వడ్డీవ్యాపారులు తమ ఆగడాలను రెట్టింపు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈక్రమంలో బాధితులు జంట నగరాల్లోని ఠాణాల వారీగా అనధికారికంగా వడ్డీ,చిట్టీల వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై మూకుమ్మడి దాడులు నిర్వహించాలని బాధితులు వేడుకుంటున్నారు. అధికవడ్డీల వసూలు చేస్తున్న అనధికారిక ఫైనాన్స్ సంస్థలు, చిట్‌ఫండ్‌ల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దింపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

TS Police to Inquary on Finance and Chit Fund firms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News