Tuesday, April 30, 2024

టీవీ చర్చలే మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

TV Debates Creating More Pollution Says Supreme Court

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పంట వ్యర్ధాలు దహనం చేయడంపై తాము రైతులకు శిక్షలు విధించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. వాటిని దహనం చేయకుండా రైతులను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించామని వెల్లడించింది. అలాగే ఈ విషయంపై టీవీల్లో జరుగుతోన్న చర్చలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాలను దహనం చేయడంపై రైతుల్ని శిక్షించడం మాకు ఇష్టం లేదు. కనీసం ఒక వారం రోజుల పాటు వాటిని తగులబెట్ట వద్దని రైతులలి కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. వీటన్నింటి కంటే టీవీల్లో చర్చా కార్యక్రమాలే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఈ సమస్యపై ఒక పరిష్కారం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ వాయుకాలుష్యంపై సీరియస్‌గా స్పందించారు. పంట వ్యర్ధాల దహనంపై కేంద్రం , ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన మీదట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్ హోటళ్లలో కూర్చొని కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారు. వారి వల్లే కాలుష్యం జరుగుతుందంటూ లెక్కలు వేస్తున్నారు. గణాంకాలు చెప్పి, పార్టీలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి తప్ప ఉపయోగం లేదు. మేం కాలుష్యాన్ని తగ్గించడం గురించే ఆలోచిస్తున్నాం.

మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. మీ మనస్సాక్షి సరిగ్గా ఉంటే అవేం పెద్ద సమస్య కాదు. అని ప్రభుత్వాల వైఖరిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోమ్, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. కేంద్రం మాత్రం ప్రభుత్వోద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ విధించడంపై విముఖత చూపింది. ఇప్పటికే కరోనా కారణంగా పనులు వాయిదా పడి ఇబ్బంది పడుతున్నట్టు కోర్టుకు వెల్లడించింది. కాగా, దీనిపై తదుపరి విచారణ నవంబర్ 23 కు వాయిదా పడింది. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, యుపిల్లో ఏటా పంట చేతికొచ్చిన తరువాత రైతులు మిగిలిన వ్యర్ధాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా వాయుకాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కాలుష్య కట్టడికి మంగళవారం రాత్రి ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తక్షణమే అమలు లోకి వచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News