Saturday, April 27, 2024

కేంద్ర విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం: మారెడ్డి

- Advertisement -
- Advertisement -

అండగా ఉండాల్సిన కేంద్రం అన్యాయం చేస్తోంది
అవసరమైన గన్నీ సంచులు, గోదాములు ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Mareddy Srinivas reddy comments on Modi govt

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నాయని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో గడిచిన ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ధాన్యం దిగుబడులతో పాటు కొనుగోళ్లు కనీవినీ ఎరుగని రీతితో పెరిగాయని ప్రశంసించారు. ఈ పరిస్థితిలో తెలంగాణకు అండగా నిల్వవాల్సిన కేంద్రం రైతు వ్యతిరేకవిధానాలను అవలభించడం వల్ల దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అధికంగా పడుతోందని చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

రవాణా ఛార్జీలు, గోదాముల నిల్వ ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు… ఇలా ధాన్య సేకరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా చెల్లిస్తుందని బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని, ఇది పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. బిజెపి నాయకులు ధర్నాలు, పర్యటనలు, ప్రకటనలు చేయడం మాని రాష్ట్రానికి అవసరమైన గన్నీసంచులు, బియ్యం, ధాన్యం నిల్వలకు అవసరమైన స్టోరేజ్ స్పేస్ కల్పించాలని అడిగారు. ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా సిఎంఆర్ గడువు పొడిగించడం, హమాలీ ఛార్జీలు పెంచడం, రాష్ట్రంపై వడ్డీ భారం పడకుండా తదితర అంశాలపై దృష్టి సారించి కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యలను పరష్కరించాలని బిజెపి వాళ్లకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రానికి భారంగా మారుతున్నాయని. దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని మారెడ్డి వివరించారు. ఒకవైపు అవసరమైన గన్నీసంచులు, డిమాండ్ కు మేరకు బియ్యం, ధాన్యం నిల్వలకు స్టోరేజ్ స్పేస్ కల్పించడం, వ్యాగన్ మూమెంట్ జాప్యం, ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా సిఎంఆర్ గడువును కుదించడం, హమాలీ ఛార్జీలు భారంగా మారయన్నారు. రాష్ట్రాలపై అదనంగా పడుతుండటం మరోవైపు ముందుగా రాష్ట్రాలే ధాన్యం కొనుగోళ్లకు నిధులు సమకూర్చుకోవాల్సిరావడంతో ధాన్యం కొనగోళ్లు రాష్ట్రాలకు భారంగా మారిందన్నారు. దీంతో దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలేదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రం సహకరించక పోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పై అధికంగా ఆర్థిక భారం పడుతోందన్నారు.

గన్నీ సంచుల భారం…

ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను కూడా కేంద్రం సమకూర్చడంలేదు. ధాన్యం కొనుగోలుకు ఒక సీజన్లో 54 శాతం కొత్త గన్నీ సంచులు, 46శాతం పాత గన్నీ సంచులను వాడుకోవాలి. అవసరమైన కొత్త గన్నీ సంచులను కేంద్రం ఇవ్వలేకపోయింది. ఈ ఏడాది (2021-22) ధాన్యం కొనుగోళ్లకు 14 కోట్ల గన్నీ సంచులను అడిగితే కేవలం 6.4 కోట్ల సంచులను మాత్రమే సరఫరా చేసింది. పాత గన్నీ సంచులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో గన్నీ సంచికి రూ. 7.32 మాత్రమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒక్కో గన్నీ సంచిని రూ.30.25కు కొనుగోలు చేసింది. 2014లో కొత్త గన్నీ సంచి ధర రూ. 45.08 ఉన్నప్పుడు పాత గన్నీ సంచి ధరను రూ.7.32 గా నిర్ణయించారు. ఇప్పుడు కొత్త గన్నీ సంచి ధర అక్టోబర్ నెలలో రూ. 70.96కు చేరుకుంది.

2020-21 సంవత్సరంలో వానాకాలంలో 3.66 కోట్లు, యాసంగిలో 8.21కోట్లు మొత్తం రెండు సీజన్లలో 11.87 కోట్ల పాత గన్నీ సంచులను వినియోగించడం జరిగింది. దీని వల్ల రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. పాత గన్నీ సంచి ధరలను పెంచాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేదు.

వడ్డీ భారం…

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ముందుగా(అడ్వాన్స్) నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన తర్వాతే చెల్లిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని నిల్వచేసి రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసిన తర్వాతే చెల్లిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఏడు నెలల సమయం పడుతోంది. ఈ ఏడు నెలల వడ్డీ భారాన్ని రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. మొత్తంగా ఏడాదిలో కేంద్రం కేవలం రెండు నెలలకు మాత్రమే వడ్డీ చెల్లిస్తోంది, రాష్ట్రం దాదాపు 10 నెలల వడ్డీని రాష్ట్రం భరిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల భారాన్ని భరించలేక కొన్ని రాష్ట్రాల పౌరసరఫరా సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఒరిస్సా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు మేము చేయలేమని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

గోదాముల నిల్వ ఛార్జీలు..

డిమాండ్ తగ్గట్టు స్టోరేజ్ స్పేస్ కూడా చూపించడంలేదు. వ్యాగన్ మూమెంట్ కూడా సరిగా చేయడం లేదు. గోదాములను కొత్తగా అద్దెకు తీసుకోవడం లేదు. కేవలం వ్యాగన్ మూమెంట్ చేయమని చెప్పుతోంది. డిమాండకు అనుగుణంగా వ్యాగన్ మూమెంట్ జరగడం లేదు. దీని వల్ల సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరిగి రాష్ట్ర ప్రభుత్వంపై వడ్డీ భారం పెరుగుతోంది.

బియ్యం స్టోరేజ్ ఛార్జీలు…

ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 8 నెల స్టోరేజ్ ఛార్జీలను భరిస్తే అందులో కేంద్రం కేవలం 2 నెలలకు మాత్రమే చెల్లిస్తోంది.

ధాన్యం నిల్వలు…

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి పెరిగింది. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయ్యాయి. ధాన్యాన్ని గోదాముల్లో స్టోర్ చేయడానికి కేంద్రం గోదాములను సమకూర్చడంలేదు. అసలు ఇందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రొవిజనల్ కాస్ట్ షీట్లో ఈ అంశాన్ని పొందుపరచలేదు.

హమాలీ ఛార్జీలు…

తెలంగాణకు హమాలీ ఛార్జీలు ఒక్క క్వింటాళ్ కు కేంద్రం రూ. 5.65 మాత్రమే చెల్లిస్తుంది. అదే పంజాబ్, హర్యాణాలో ఒక్క క్వింటాళ్ కు రూ. 24.25 చెల్లిస్తుంది.

సిఎంఆర్ గడువు కుదింపు …

ధాన్యం దిగుబడులకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పెంచాల్సిన కేద్రం దాన్ని కుదించడం వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతోంది. 2018-19లో రాష్ట్రంలో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కేంద్రం సీఎంఆర్కు 13 నెలల గడువు ఇచ్చింది. 2019-20లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు మాత్రం 12 నెలల గడువు మాత్రమే ఇచ్చింది. 73 శాతం ధాన్యం కొనుగోళ్లు పెరగడం, కరోనా, లా డౌన్, హమాలీల కొరత వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురుకావడం, తనిఖీ పేరుతో జనవరిలో 23 రోజులు సీఎంఆర్ను తీసుకోకపోవడం వంటి కారణాలతో గడువు పొడుగించాల్సిన సమయంలో గడువు తగ్గించింది. దీని వల్ల రాష్ట్రంపై వందల కోట్ల అర్థికభారం పడింది. అని ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News