Friday, April 26, 2024

నిష్పాక్షికత, ఐక్యత లోపం

- Advertisement -
- Advertisement -

corona

 

కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం తిన్ననైన, సవ్యమైన దృష్టి అవుతుంది. అలా కాకుండా చిరకాలంగా తాము పెంచుకున్న రాజకీయాల అద్దంలోంచి చూసినప్పుడు అది వక్ర దృష్టి అవుతుంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిఘీ మసీదు ఘటన దేశ వ్యాప్తంగా కరోనా కేసులను, మృతుల సంఖ్యను పెంచిన మాట వాస్తవం. గత నెల 13-15 తేదీలలో తబ్లిఘీ మసీదులో జరిగిన జమాత్ సదస్సుకు వందలాది మంది విశ్వాసులు హాజరయ్యారు. వారిలో టూరిస్టు వీసాలపై వచ్చిన ఇండోనేషియన్లు కూడా ఉన్నారు. ఆ సామూహిక సన్నివేశానికి హాజరై దేశంలోని పలు ప్రాంతాల్లో గల తమ ఊళ్లకు తిరిగి వచ్చిన వారి వల్ల వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది. అలా బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు 1023 అని, అందులో 58 తీవ్రమైనవని వెల్లడయింది.

తబ్లిఘీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో ఆరుగురు ఒకే రోజు మరణించిన సంగతి తెలిసిందే. తబ్లిఘీ సందర్శకుల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా ఆరాతీస్తూనే ఉన్నారు. ఈ ఘటనను ఆధారం చేసుకొని ఆ మతం వారు దేశంపై కరోనా జిహాద్‌ను ప్రకటించారంటూ హిందుత్వ శక్తులు చేసిన ప్రచారం తీవ్రంగా ఖండించదగినదే. అలా ఖండిస్తున్న సెక్యులర్ వాదులు, ముస్లిం పెద్దలు తబ్లిఘీలో జమాత్ నిర్వాహకులు వహించిన వల్లమాలిన నిర్లక్షాన్ని, కరోనా వ్యతిరేక నియమాలను ఉల్లంఘించి వ్యవహరించిన బాధ్యత లేని తీరును కూడా అదే స్థాయిలో ఖండించి ఉండవలసింది. కాని వారు అలా చేయలేదు, వారిది పక్షపాత బుద్ధి, రాజకీయ దురుద్దేశం అనే విమర్శ బయలుదేరింది. ఇది ఎంత మాత్రం ఆక్షేపించదగినది కాదు. తబ్లిఘీలో జరిగిన దానిని కరోనా జిహాద్ అంటూ దానిని మొత్తం ఆ మతస్థులందరికీ పూయడం చెప్పనలవికాని అపరాధం. దేశంలోని శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించే విద్రోహం.

కాని ఈ విషయాన్ని ఇలా విమర్శిస్తున్నవారు తబ్లిఘీ నిర్వాహకుల నిర్వాకాన్ని చీల్చి చెండాడి ఉండవలసిందనడమూ సబబే మౌఢ్యం, ఉన్మాదం అనేవి ఏ మతంలో ఉన్నా సమానంగా విమర్శించవలసిందే. అప్పుడే దేశంలో అన్ని మతాలకు మతతత్వాలకు సమాన దూరంలో ఉండే అసలైన లౌకిక గుణం వేళ్లూనుకుంటుంది. సెక్యులర్ వాదులం, లౌకిక వాదులం అని చెప్పుకునేవారు దీనిని గమనించి తమను తాము దిద్దుకోవలసి ఉంది. తరచి చూస్తే కరోనాపై యుద్ధంలో ఇలాంటి బలహీనతలు కనిపిస్తాయి. మరో బాధాకరం, ఆవేదనాభరితమైన అంశం ఏమిటంటే కరోనాతో సాగిస్తున్న దీక్షాయుతమైన పోరాటంలో సరిహద్దుల్లోని సైనికుల మాదిరిగా ముందుండి ప్రతిఘటిస్తున్న డాక్లర్లు, వైద్య సిబ్బంది మీద, సామాజిక కార్యకర్తలు, పోలీసులపైనా మూక దాడులు జరగడం.

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వల్ల మరణించిన ఒక వ్యక్తి బంధువులు వైద్యులే కారణమంటూ డ్యూటీ డాక్టర్ మీద, ఇతర సిబ్బంది పైనా దాడి చేసిన ఉదంతం రక్షకులనే భక్షించే దారుణాన్ని తలపించింది. బీహార్‌లో ముంగేర్ పట్టణంలో కరోనా అనుమానితుల రక్తం మున్నగు నమూనాల కోసం వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసుల మీద మూక దాడి జరిగింది. అలాగే హజరత్ గంజ్‌లో వైద్యులు, పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు జీపు ధ్వంసమైంది. తబ్లిఘీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించే విధి నిర్వహణలోని మహిళా కార్యకర్తలపై ముంబైలో, బెంగళూరులో తీవ్రమైన దాడులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని హెగ్డే నగర్‌లో కరోనా సర్వే జరుపుతున్న ఆశా వర్కర్లను స్థానికులు ఘెరావ్ చేసి సెల్‌ఫోన్‌లు లాక్కొని వారిపట్ల అమర్యాదకరంగా వ్యవహరించారు. తబ్లిఘీకి వెళ్లి వచ్చిన ఏడుగురు గురించి గ్రామాధికారికి సమాచారమిచ్చాడన్న కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఒక వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు.

ఇలా యుపిలోనూ పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక గ్రామంలో కోల్‌కతా వెళ్లివచ్చారంటూ తమ పేర్లు చెప్పినందుకు శైలేంద్ర అనే వ్యక్తి కాల్పులకు తెగబడగా ఒక మహిళ మరణించింది. ఇలాంటి దారుణాలు మరెన్నో జరిగాయి, జరిగిపోతున్నాయి. ఇలా దేశంలో కరోనాపై సాగుతున్న ప్రతి చర్యలో ప్రజల మధ్య ఐక్యత లోపం, మేధావులలో నిష్పాక్షితక కరవు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విరుచుకుపడిన ఈ వైరస్ కనిపించకుండానే, ఆచూకీ తెలియకుండానే మత ప్రాంతాలకు, కులాలు, తెగలకు, వయస్సులకు అతీతంగా అందరినీ కబళిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇంత వరకు 58,787 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. 10,95,917 మందిని పీడిస్తున్నది. భారతదేశంలో 68 మందిని కబళించింది, 2902 మందికి సోకింది. ఈ మహమ్మారిని అన్ని భేదాలు మరచిపోయి సమైక్యంగా, సంఘటితంగా ఎదిరించి పారద్రోలాలి.

 

Unity deficiency in war on corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News