Saturday, April 27, 2024

నాన్సీ పెలోసికి చైనా హెచ్చరిక!

- Advertisement -
- Advertisement -

 

అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్ లో అడుగు పెడతారా? హెచ్చరికల ను ఖాతరు చేయకుండా ఆమె మొండిగా వస్తే చైనా చూస్తూ ఊరుకుంటుందా? తైవాన్ను నిషేధిత గగనతలంగా ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ నాన్సీ పెలోసీ విమానం గనుక తైవాన్ ప్రాంతానికి వస్తే చైనా విమానం లేదా విమానాలు దాన్ని వెంబడిస్తాయని, తైవాన్ గడ్డపై దిగకుండా చూస్తాయని అనధికార వార్తలు. ఒకవేళ అమెరికా విమాన వాహక యుద్ధనౌకలు గనుక తైవాన్‌జలసంధిలోకి ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.

ఇప్పుడు అమెరికా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోంది? ఉక్రెయిన్ వివాదంలో ఆశించినట్లుగా రష్యాను దెబ్బతీయలేకపోతున్నందున ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పథకం వేసిందా? పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో గెలుపుకోసం బైడెన్ పడుతున్న పాట్లా? లేక నిజంగానే చైనాతో లడాయి పెట్టుకొనేందుకు బైడెన్ యంత్రాంగం సిద్ధపడుతోందా? అమెరికాకు అంత సత్తా ఉందా? చైనాను రెచ్చగొట్టి దాని స్పందన చూడండి అంటూ ప్రచారదాడిలో భాగంగా అమెరికా పథకం వేసిందా? చివరికి టీ కప్పులో తుపానులా ముగుస్తుందా?ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతోంది.పెలోసీ పర్యటన నేపధ్యం లేదా తైవాన్ వేర్పాటువాదులకు హెచ్చరికలో భాగం కావచ్చు తైవాన్ జలాల్లోకి ప్రవేశించే అమెరికా విమాన వాహక నౌకలను లక్ష్యంగా చేసుకొని ఆధునిక క్షిపణులతో విన్యాసాలు నిర్వహించాలని మిలిటరీని చైనా ఆదేశించింది.

 

ప్రధాన భూభాగానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ర్టం అన్న సంగతి తెలిసిందే. 1949 నుంచి అది వివిధ కారణాలతో విడిగా ఉంది. 1971 వరకు చైనా అంటే ఐరాస, భద్రతా మండలిలో దాన్నే గుర్తించారు, వీటో అధికారం కూడా ఉంది. 1971 నవంబరు 15 నుంచి చైనా అంటే తైవానుతో సహా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోని ప్రభుత్వమే అసలైన ప్రతినిధిగా ఉంది. తరువాత అమెరికా కూడా విధిలేక తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించింది. అయినప్పటికీ తైవాన్ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ అమెరికా, దాని అనుకూల దేశాలు తైవాన్‌లోని విలీన వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి ఆయుధాలు అందిస్తున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలు చేయిస్తున్నాయి. దీనిలో భాగంగానే నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన.

అమెరికా అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ ఉంటారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనల మేరకు చైనా అనుమతి లేకుండా వీరిలో ఎవరు తైవాన్‌లో అడుగుపెట్టినా అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుంది. నిబంధనలను పాటించాలని ఇతర దేశాలకు ఉద్బోధించే అమెరికాకు అది వర్తించదా !

చైనా తీవ్ర హెచ్చరికల నేపధ్యంలో అమెరికాలో ఇప్పుడు పెద్ద నాటకం నడుస్తోంది. ప్రభుత్వ సహకారం లేకుండా నాన్సీ పెలోసి పర్యటన జరగదు. ఆమె నిజంగా పర్యటిస్తారో లేదో అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ పర్యవసానాల గురించి బహిరంగ చర్చ జరుగుతోంది. తైవాన్ వెళితే తలెత్తే ముప్పు గురించి పెలోసికి నచ్చచెప్పేందుకు బైడెన్ యంత్రాంగం తెరవెనుక మంతనాలు జరుపుతోందని సిఎన్‌ఎన్ పేర్కొన్నది. ఏమైనా సరే వెళ్లాల్సిందేనని డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల్లోని చైనా వ్యతిరేకులు రెచ్చగొడుతున్నారు. జపాన్, ఇతర ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్ కూడా ఆగస్టు తొలివారంలో వెళ్లవచ్చని అనధికార వార్తలు. ఆమె పర్యటనను రద్దు చేయాలని చైనా జాతీయ రక్షణ శాఖ బహిరంగంగా ప్రకటించింది.తమ సార్వభౌత్వాన్ని రక్షించుకొనేందుకు గట్టి కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ముందుకుపోతే మిలిటరీ చేతులు ముడుచుకు కూర్చోదని పేర్కొన్నది.

పెలోసీ పర్యటనను మిలిటరీ వ్యతిరేకించినట్లు గతవారంలో జో బైడెన్ స్వయంగా చెప్పాడు. బైడెన్ చెప్పిందానికి అర్ధం ఏమిటో తనకు తెలియదని బహుశా తాను ప్రయాణించే విమానాన్ని కూల్చివేయటం లేదా అలాంటిదే ఏమైనా జరగవచ్చునని మిలిటరీ భయపడుతోందేమో నాకు తెలియదని పెలోసీ కూడా గతవారం లో విలేకర్లతో అన్నారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. స్పీకర్‌కు మేం చెప్పాల్సింది చెప్పాం, ఒకే చైనా అన్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని, వెళ్లదలచుకుంటే ప్రభుత్వం నివారించలేదని ఒక అధికారి చెప్పాడు. ‘నాన్సీ నేను మీతో వస్తాను, నా మీద చైనాలో నిషేధం ఉండవచ్చుగానీ స్వేచ్ఛను కోరుకొనే తైవాన్‌లో లేదు కదా, అక్కడ మిమ్మల్ని చూస్తాను’ అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో రెచ్చగొట్టాడు. పెలోసి గనుక వెళ్లకపోతే చైనా వత్తిడికి అమెరికా లొంగినట్లే అని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన రిపబ్లికన్లు, మితవాదులు రెచ్చగొడుతున్నారు.

అక్టోబరులో జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలో మరోసారి పార్టీ, అధికార పగ్గాలు చేపడతారని భావిస్తున్న చైనా అధినేత జీ జింపింగ్ నాయకత్వాన్ని అవమానించటం, రెచ్చగొట్టటం కూడా అమెరికా ఎత్తుగడలో భాగం అని చెబుతున్నారు. తైవాన్ను నిషేధిత గగనతలంగా ప్రకటించి పెలోసి విమానాన్ని చైనా గనుక వెంబడిస్తే అది ఆమె పర్యటన నిరోధం కంటే ఆ ప్రాంతం తమదే అని ప్రపంచానికి మరోసారి స్పష్టం చేయటం, అమెరికాకు పెద్ద హెచ్చరిక దాని వెనుక దాగుందని భావిస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి అమెరికా చేతిలో ఉందని చెబుతున్నారు. పెలోసి గనుక సంయమనం పాటించి వెనక్కు తగ్గకపోతే తరువాత పర్యవసానాలను ప్రభుత్వ యంత్రాం గం, మిలిటరీ ఎదుర్కోవలసి ఉంటుంది. గతంలో తైవాన్ తిరుగుబాటు నేత లీ టెంగ్ హుయి 1996లో అమెరికా పర్యటన జరిపినపుడు తైవాన్ దీవి చుట్టూ చైనా క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పుడు పెలోసీ రాక దాని కంటే తీవ్రమైనది కనుక తీవ్రంగా పరిగణిస్తున్నది.

ఒకవేళ నాన్సీ పెలోసి మొండిగా ప్రవేశిస్తే 2001లో చైనాలోని హైనాన్ దీవిలో జరిగిన అమెరికా చైనా విమానాల ఢీ కంటే తీవ్రపరిణామాలు జరగవచ్చని కొందరు గుర్తు చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని పార్సెల్ దీవులు తమవేనని చైనా వాదిస్తున్నది. అమెరికా దాన్ని అంగీకరించటం లేదు. అంతర్జాతీయ జలా ల్లో తిరిగే స్వేచ్ఛ తమకు ఉందంటూ జపాన్‌లోని తమ సైనిక కేంద్రం నుంచి నిఘా విమానాలు, ఓడలను తిప్పుతున్నది. దానిలో భాగంగా 2001 ఏప్రిల్ ఒకటవ తేదీన ఒక నిఘా విమానం చైనా సైనిక స్థావరం ఉన్న హైనాన్ దీవులకు దగ్గరగా వచ్చింది. దాన్ని అడ్డుకొనేందుకు చైనా మిలిటరీవిమానం కూడా ఎగిరింది. రెండూ దీవుల వద్ద ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చైనా పైలట్ మరణించగా దెబ్బతిన్న అమెరికా విమానం హైనాన్ దీవిలో దిగింది. దాని సిబ్బంది 24 మందిని చైనా అరెస్టు చేసి, విమానాన్ని స్వాధీనం చేసుకుంది.అయితే అనూహ్య పరిణామంతో దిక్కుతోచని సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కంప్యూటర్లపై కాఫీ, నీళ్లను పోశారు. తరువాత అమెరికా ప్రభుత్వం చైనాకు క్షమాపణలు చెబుతూ లేఖలు రాసి ఖర్చులను చెల్లించి తమ సిబ్బంది, విమానాన్ని విడిపించుకుంది.

తరువాత జరిగిందానికి చింతిస్తున్నట్లు, విచారపడుతున్నట్లు లేఖల్లో పేర్కొన్నాం తప్ప క్షమాపణ కాదని అమెరికా చెప్పింది. హైనాన్ దీవుల్లో ప్రస్తుతం చైనా జలాంతర్గాముల కేంద్రం ఉంది. అక్కడి నుంచి జలాంతర్గాముల ద్వారా ఖండాంతర అణుక్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే తరువాత కూడా చీటికి మాటికి దాని సమీపంలోకి అమెరికా నిఘా విమానాలు, ఓడలను పంపుతున్నారు. చైనా కూడా దానికి దీటుగా విమానాలతో సమాధానం చెబుతున్నది. రెండు మూడు సార్లు రెండు దేశాల విమానాలు సమీపానికి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే చైనా మిలిటరీ సామర్ధ్యం ఎంతో పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో తైవాన్ వేర్పాటు వాదులు అమెరికా సాయంతో స్వాతంత్య్రం సంపాదించుకుంటామని పదే పదే చెప్పటం, చైనా గనుక విలీనానికి బలాన్ని వినియోగిస్తే తాము మిలిటరీ జోక్యం చేసుకుంటామని జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నూటయాభై ఆరు సంవత్సరాల పాటు బ్రిటీష్ పాలనలో ఉన్న హాంకాంగ్ 1997 జూలై ఒకటిన చైనాలో విలీనమైంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉన్నందున తమ ప్రత్యేక పాలన ప్రాంతంగా పరిగణించి 50 సంవత్సరాల పాటు అక్కడి వ్యవస్థలను కొనసాగిస్తామని చైనా సర్కార్ అంగీకరించింది. అదే విధంగా పోర్చుగీసు ఏలుబడిలో అంతర్జాతీయ జూద కేంద్రంగా మార్చిన మకావూ దీవులను కూడా అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నది.

ఆ గడువు 2048 వరకు ఉంది. విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన హామీల మాదిరే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడులకూ అదే వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. తైవాన్నుంచి పెట్టుబడులే కాదు, ఎవరైనా వచ్చి ఉపాధి కూడా పొందవచ్చని అవకాశం ఇచ్చింది. అందువలన తైవాన్‌న్ను కూడా అప్పటి వరకు వాటి మాదిరిగానే కొనసాగనిస్తుందని, తరువాత పూర్తిగా విలీనం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

ఆ గడువు దగ్గర పడుతున్నకొద్దీ విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు చైనా చూస్తుండగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం పేరుతో చిచ్చుపెట్టేందుకు అమెరికా, జపాన్ తదితర దేశాలు చూస్తున్నాయి. తైవాన్, హాంకాంగ్, టిబెట్, షింజియాంగ్ రాష్ర్టంలో మానవ హక్కుల గురించి అమెరికా సంధిస్తున్న అస్త్రాలేవీ పని చేసేవి కాదు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ ప్రయోజనాలకు హాని కలిగే వాటిని వేటినీ సహించేది లేదని చైనా పదే పదే స్పష్టం చేస్తోంది. హాంకాంగ్, మకావు దీవుల విలీన సమయంలో 50 సంవత్సరాల పాటు(2048 వరకు) అక్కడి యథాతథ స్థితిని కొనసాగనిస్తామని ఒకే దేశం రెండు వ్యవస్థలన్న తన వైఖరిని చైనా ఎప్పుడో స్పష్టం చేసింది. వాటి మాదిరే అదుపులో ఉన్నంత వరకు తైవాన్ అంశంలో కూడా చైనా అప్పటి వరకు తొందరపడే ధోరణిలో లేదు. ఈలోగా అమెరికా కూటమి దేశాలు దుస్సాహసానికి పాల్పడి తెగే దాకా లాగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. విచక్షణను ఉపయోగించి వెనక్కు తగ్గితే పెలోసీ పర్యటన వివాదం టీకప్పులో తుపానులా ముగుస్తుంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News