Monday, May 6, 2024

ఆరోజు సిఎం కెసిఆర్‌ను అడ్డుకున్నదెవరు?

- Advertisement -
- Advertisement -

Vinod Kumar questioned Union Minister Smriti irani

మోడీ భారత్ బయోటెక్ సందర్శన
సమయంలో ఆహ్వానానికి ముఖ్యమంత్రిని రావొద్దన్నది ప్రధానమంత్రి కార్యాలయమే
కెసిఆర్‌పై విమర్శలు చేసే హక్కు
స్మృతి ఇరానీకి లేదు: వినోద్ ఘాటు లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వినోద్‌కుమార్ ఘాటుగా లేఖ రాశారు. స్మృతి ఇరానీకి సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలు క్షమార్హం కాదని, కెసిఆర్‌పై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వినోద్‌కుమార్ హితవు పలికారు. స్మృతి ఇరానీ.. సంస్కారం గురించి మాట్లాడే హక్కు మీ బిజెపి నాయకులకు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. విపక్ష పార్టీల నాయకులను కించపరచడం బిజెపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ ను తయారు చేసిందని, ఈ సంస్థను సందర్శించేందుకు 2020 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారని, ఆ సందర్భంలో ప్రధాని మోడీని ఎయిర్ పోర్ట్ లో సగౌరవంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమవగా.. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు నో.. నో… సిఎం కెసిఆర్ మీరు రావద్దు. మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పంపండి అని ఆదేశించారని వినోద్‌కుమార్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గుర్తుచేశారు. ప్రధాని మోడీకి ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టుకు రాకుండా సిఎం కెసిఆర్‌ను అడ్డుకున్నది ఎవరూ..? అన్నది ఇప్పటి వరకూ ఎవరో ఇప్పటి వరకు ఎవరూ చెప్పడం లేదని వినోద్‌కుమార్ అన్నారు.రాజ్యాంగాన్ని, సంస్కృతిని, మతసామరస్యాన్ని గౌరవించడం, అమలు చేయడం సిఎం కెసిఆర్‌కు తెలిసినంతగా దేశంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియదని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణది.. గంగా జమున తెహజీబ్ సంస్కృతి..

తాను పార్లమెంట్ సభ్యుడిగా 2004 – 2009, 2014 – 2019 ఉన్న కాలంలో కెసిఆర్‌తో కలిసి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను, ఇతర ప్రముఖులను కలిసిన సందర్భంలో తెలంగాణలోని ప్రఖ్యాత పోచంపల్లి హ్యాండ్లూమ్స్ శాలువాలతో వారిని సత్కరించి అపార గౌరవ అభిమానాన్ని చాటిన ఘనత కెసిఆర్ ది అని, ఈ విషయాన్ని తాను దగ్గర ఉండి చూసిన విషయాన్ని వినోద్‌కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానమంత్రి హోదాలో వచ్చే ఏ వ్యక్తికి అయినా ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానం పలకడం కనీస బాధ్యత అనే విషయం కెసిఆర్‌కు తెలిసినంత మరెవరికి తెలియదని, కానీ ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు మాత్రం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ పర్యటన సందర్భంగా ఆహ్వానించడానికి రావద్దు అని అధికారికంగా కెసిఆర్‌ను రాకుండా అడ్డుకున్నారని, ఇదేనా ప్రధాని మోడీ, బిజెపి నాయకుల సంస్కారం అని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వాస్తవాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెలియకపోవడం దారుణం అని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వినోద్‌కుమార్ ఆమెకు హితవు చెప్పారు. ప్రపంచస్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుగొన్నది తెలంగాణ రాజధాని హైదరాబాద్ సంస్థ అన్న విషయాన్ని మరువద్దు అని, కానీ ఈ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫోటో వాడడం ఎంత వరకు సమంజసం అని వినోద్ కుమార్ కేంద్రమంత్రి స్మృతి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీకి మించిన మాస్టర్ సేల్స్ మెన్ మరెవ్వరూ లేరని, సొంత డబ్బా కొట్టుకోవడంలో నరేంద్ర మోడీకి మించిన వ్యక్తి మరొకరు లేరని వినోద్‌కుమార్ అన్నారు. దుష్ట ప్రచారం, విష ప్రచారం మానుకోవాలని, వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలని వినోద్ కుమార్ కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News