Sunday, April 28, 2024

చావుకు దూరం కావాలంటే 4000 అడుగులు నడవాల్సిందే…

- Advertisement -
- Advertisement -

రోజూ కేవలం 4000 అడుగులు నడిస్తే ఏ కారణం వల్లనైనా చనిపోయే రిస్కు అంతగా ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. 4000 అడుగుల కన్నా ఇంకా ఎక్కువ నడిస్తే మరీ మంచిదని అధ్యయనం పేర్కొంది. ఆధునిక స్తబ్దత లేని జీవన విధానానికి అనారోగ్యానికి సంబంధం ఉందని స్పష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నడక ప్రాధాన్యాం గురించి అధ్యయనం మరోసారి వివరించింది. ఈ మేరకు పరిశీలించడానికి పోలండ్ లోని మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ లోడ్జ్ కు చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ మెసీజ్ బనాక్ నేతృత్వంలో పరిశోధకులు 2,26,889 మందికి చెందిన ఇదివరకటి 17 అధ్యయనాలను పరిశీలించారు. రోజువారీ ఎవరు ఎన్ని అడుగులు నడుస్తున్నారో ఆ ప్రభావం ఆరోగ్యంపై ఎంతవరకు ఉంటుందో పరిగణించడానికి ఏడేళ్ల పాటు అధ్యయనాన్ని కొనసాగించారు.

ఈ అధ్యయనం యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో వెలువడింది. రోజూ కనీసం 3967 అడుగులు నడిస్తే ఎలాంటి కారణం వల్లనైనా చనిపోయే రిస్కు చాలా వరకు తగ్గుతుందని తెలుసుకున్నారు. అలాగే రోజూ 2337 అడుగుల వరకు నడిస్తే గుండెజబ్బుల నుంచి చనిపోయే రిస్కు తగ్గుతుందని అంచనా వేశారు. ఈ పరిమితులకు మించి రోజూ 1000 అడుగులు వంతున పెంచుకుంటూ వెళితే ఎలాంటి కారణాల వల్లనైనా చనిపోయే రిస్కు 15 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేశారు. రోజూ 500 అడుగుల వంతున పెంచుకుంటే గుండెజబ్బుల నుంచి చనిపోయే రిస్కు 7 శాతం వరకు తగ్గుతుందని అంచనా . తమ అధ్యయనం ఎక్కువగా నడిస్తే చాలా మంచిదని చెబుతోంది.

వయసుతో ,నివసించే ప్రదేశంతో , వాతావరణంతో నిమిత్తం లేకుండా స్త్రీపురుషులు ఎవరైనా రోజూ నడవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయన నిర్వాహకులు బనాక్ వెల్లడించారు. 60 ఏళ్ల లోపు వారు రోజూ 6000 నుంచి 10000 అడుగుల వరకు , యువకులు రోజూ 7000 నుంచి 13000 అడుగుల మేరకు నడవడం వల్ల ఆరోగ్యంలో కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. రోజూ 20,000 అడుగుల వరకు నడిస్తే అంటే సరాసరిన 9 నుంచి 10 మైళ్ల వరకు నడవడంతో సమానం ఆరోగ్యప్రయోజనాలు కొనసాగుతుంటాయని పరిశోధక బృందం గమనించింది. ప్రపంచం మొత్తం మీద ఏటా సంభవిస్తున్న 3.2 మిలియన్ మరణాలకు దారితీసే ప్రధాన కారణాల్లో నాలుగో కారణం రోజూ శారీరానికి కావలసిన శ్రమ, వ్యాయామం లేక పోవడం వల్లనే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News