Friday, May 3, 2024

వన్డే ప్రపంచకప్ నుంచి వెస్టిండీస్ ఔట్..

- Advertisement -
- Advertisement -

స్కాట్లాండ్ పెను సంచలనం
వెస్టిండీస్ ప్రపంచకప్ ఆశలు గల్లంతు
హరారే: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ టీమ్ విఫలమైంది. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీ సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో విండీస్ అవమానకర ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో వెస్టిండీస్ వరల్డ్‌కప్‌కు దూరమైంది. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్ ప్రస్తుతం విశ్వకప్‌కు అర్హత సాధించడంలో కూడా విఫలం కావడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో విండీస్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఇంతకుముందు జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతుల్లోనూ విండీస్‌కు పరాజయం ఎదురైంది. ఇక శనివారం జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్ బ్రయిడ్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన బ్రాండెన్ మెక్‌ముల్లెన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ క్రాస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మెక్‌ముల్లెన్ 8 ఫోర్లు, సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన వికెట్ కీపర్ క్రాస్ 7 ఫోర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, మున్సె18 పరుగులు చేయగా, కెప్టెన్ రిచి బెర్రింగ్టన్ 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

ఆరంభంలోనే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. బ్రాండన్ మెక్‌ముల్లెన్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతని ధాటికి ఓపెనర్ చార్లెస్ (0), వన్‌డౌన్‌లో వచ్చిన షమర్ బ్రూక్స్ (0) ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (22)ను కూడా మెక్‌ముల్లెన్ ఔట్ చేశాడు. ఇక జట్టుకు ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ షాయ్ హోప్ (13), కేల్ మేయర్స్ (5) కూడా నిరాశ పరిచారు. మరోవైపు నికోలస్ పూరన్ (21) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. అయితే జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. షెఫర్డ్ 5 బౌండరీలతో 36 పరుగులు సాధించాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో విండీస్ ఇన్నింగ్స్ 181 పరుగుల వద్దే ముగిసింది. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్‌ముల్లెన్ మూడు, క్రిస్ సోల్, మార్క్ వాట్, గ్రీవ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Also Read:  ద్రవిడ్‌కు అండగా సెహ్వాగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News