Friday, May 10, 2024

దాదా జ్ఞాపకార్థం మ్యూజియంగా సొంత ఇల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ జాంగీపూర్‌లోని తమ స్వగృహంలో మొదటి అంతస్తును తన తండ్రి స్మారకార్థం మ్యూజియంతో పాటు గ్రంథాలయంగా మారుస్తానని మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపి అభిజిత్ వెల్లడించారు. తన తండ్రి గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తీవ్ర అస్వస్థతతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీ గత కొద్ది రోజులుగా కోమాలో ఉండి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అభిజిత్ తన తండ్రితో తన అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. జాంగీపూర్‌లో తన తండ్రి నిర్మించిన ఇంటిలోని మొదటి అంతస్తును మ్యూజియం-లైబ్రరీగా మార్చాలని యోచిస్తున్నట్లు మంగళవారం అభిజిత్ తెలిపారు. తన తండ్రికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులను, ఆయన సేకరించిన పుస్తకాలను, ఆయనకు లభించిన జ్ఞాపికలను అందులో పదిలపరుస్తానని అభిజిత్ చెప్పారు.

అయితే తన తండ్రి ఎక్కువ కాలం ఆయన నిర్మించుకున్న ఇంటిలో నివసించేలేకపోవడం పట్ల అభిజిత్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ ఇల్లు నిర్మించే నాటికి తన తండ్రి అంతకన్నా చాలా పెద్ద ఇల్లు-రాష్ట్రపతి భవన్‌కు తరలివెళ్లారని ఆయన చెప్పారు. జాంగీపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రంలో కాసిన పనసపండును ఆగస్టు 4వ తేదీన తన తండ్రి కోసం తానే స్వయంగా తీసుకెళ్లిన విషయాన్ని అభిజిత్ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో కూడా పనసపండు లభిస్తుందని, అయితే తమ పొలంలోని చెట్లో కాసిన పసనపండును తన తండ్రికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంతో ప్రయాసకోర్చి రైలులో తానే ఢిల్లీకి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. తన తండ్రి ఎంతో ప్రీతితో పనసతొనలు తిన్నారని, అదృష్టవశాత్తు ఆయన సుగర్ స్థాయి పెరగలేదని మాజీ ఎంపి తలెఇపారు. తన తండ్రి కోరికను తీర్చే అదృష్టం లభించనందుకు సంతోషిస్తున్నానని ఆయన చెప్పారు.

రాజకీయాల్లో కాని, ఇతరత్రా కాని ప్రతీకార ధోరణితో ఉండకూడదని తన తండ్రి తనకు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఇచ్చిన సందేశం చాలా విస్పష్టమైనదని, దాన్ని తన జీవితాంతం పాటిస్తానని అభిజిత్ తెలిపారు. తన తండ్రిని బతికించేందుకు చివరి వరకు పోరాడిన వైద్యులకు అభిజిత్ ధన్యవాదాలు తెలిపారు. వారు ఎంతో ప్రయత్నించారని, అయితే ఈ ప్రపంచంలో తన పాత్ర ముగిసిందని తన తండ్రి భావించి ఉంటారని అభిజిత్ పేర్కొన్నారు. ఒక సామాన్య వ్యక్తి కోరుకున్నవన్నీ తన తండ్రికి దక్కాయని, జీవితంలో ఎన్నో సాధించిన తన తండ్రి సరైన సమయంలో ఈ లోకం నుంచి నిష్క్రమించారని అభిజిత్ అన్నారు.

Will Convert our home as museum: Abhijit Mukherjee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News