Friday, April 26, 2024

మహిళా దినోత్సవం రోజున దారుణం.. మహిళపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

Woman injured after Acid Attack in Medak

మన తెలంగాణ/అల్లాదుర్గం: మహిళా దినోత్సవం నాడే ఒక మహిళపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు, అది కూడా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా ఓ గిరిజన మహిళపై ఈ పాశవిక దాడి జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఒక్క సారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. మండలం అంతాయిపల్లి(మల్కాపూర్) గిరిజన తండాకు చెందిన చక్రిబాయి అనే మహిళ తన భర్త మృతి చెందడంతో తల్లిదండ్రుల వద్దనే నివాసం ఉంటున్నది. అయితే ఆమె గడిపెద్దాపూర్ గ్రామంలో గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద అపస్మారక స్థితిలో తీవ్రంగా గాయపడి ఉండడాన్ని గ్రామస్థులు చూశారు. ఆమెను గుర్తించి బాధితురాలి కుటుంబీకులకు,108కు సమాచారం అందించారు. వెంటనే 108 వాహనంలో ఆమెను సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలపడంతో హైద్రాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉంటే గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేయడం వల్ల ఆ మహిళ ఆర్తనాదం చేసిందని, తీవ్రగాయాలతో గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లి అరిచిందని, వారు ఆమెకు చీరను అందించారని తెలుస్తోంది. దీంతో ఆమె ఆ దుస్తులతో పరుగులు తీసి, జాతిపిత, రాజ్యాంగ నిర్మాత విగ్రహాల వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. మండలం అంతాయిపల్లి గిరిజన తండా నుంచి దాదాపుగా 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గడిపెద్దాపూర్‌కు ఈ మహిళ ఎందుకొచ్చిందో అంతు పట్టకుంటా ఉంది. బాధితురాలి కాళ్లకున్న వెండి కడియాలను లాక్కునే ప్రయత్నంలో ఓ కాలు కడియం రాకపోవడంతో దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారా? లేకుంటే ఇతర కారణాలు ఏమయినా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మహిళా దినోత్సవం నాడు రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటన త్వరితగతిన చేధించేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిఐ జార్జి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డిలు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పలువురిని విచారించారు. క్లూస్ టీంను రప్పించారు. ఘటనతో సంబందమున్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇంతకుమందెప్పుడూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగకపోవడంతో ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు.

Woman injured after Acid Attack in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News