Monday, May 6, 2024

ఇల్లలికినా పండుగ ఆలస్యమే.. మహిళా బిల్లు అమలు అప్పుడే?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎట్టకేలకు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు రానైతే వచ్చింది. అయితే మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం సీట్ల కేటాయింపునకు ఉద్ధేశించిన బిల్లు ఫలాలు నిజానికి మహిళలకు చేరాలంటే 2029 వరకూ ఆగాల్సిందే. పలు అడ్డంకులు రాజ్యాంగయుతంగా అధిగమించాల్సిన ప్రక్రియలు అనేకం కోటా వాస్తవికతకు ముందు జరగాల్సి ఉంది. ముందస్తు జనాభాలెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన , ఇందుకు రాష్ట్రాల అసెంబ్లీల నుంచి ఆమోద ప్రక్రియ వంటి పలు దశలు ఇమిడి ఉన్నాయి.

ప్రత్యేకించి అన్ని రాజకీపార్టీల నుంచి మద్దతు అవసరం. రాజ్యాంగంలోని 128వ సవరణ బిల్లు నిర్ధేశిత నిబంధనల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన లేదా డిలిమిటేషన్ తరువాతనే బిల్లు అమలుకు వీలుంటుంది. దీనికి ప్రాతిపదికగా జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. డిలిమిటేషన్ , దీనికి ముందు సెన్సస్ అంశాలు చేపట్టాల్సి ఉంది. కాగా పార్లమెంట్ ఉభయసభలు బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత ఇది చట్టరూపం దాల్చేందుకు ఖచ్చితంగా కనీసం 50 శాతం అంటే సగానికి సగం వరకూ అయినా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం దక్కాల్సి ఉంటుందని రాజ్యాంగ విశ్లేషకులు తెలిపారు. రాష్ట్రాల హక్కులు కీలకమైన అంశం అయినందున వీటి నుంచి అనుమతి అత్యవసరం.

ఈ రెండింటికి కనీసం కులగణన, నియోజకవర్గాల పునర్విభజన వంటి పలు కీలక సంక్లిష్ట ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది చివరిలో , వచ్చే ఏడాది చివరిలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. సాంకేతిక కీలక కారణాలతో ఈ ఎన్నికలు మహిళా కోటా లేకుండానే జరిగిపోతాయి. బిల్లు ఆమోదానికి ఏకాభిప్రాయ సాధన దిశలో దాదాపుగా ప్రధాన పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీలు ఈ బిల్లు ఘనత తమదే అని తెలిపాయి.

అయితే ప్రతిపక్షంలోని బిసి ప్రాతిపదిక బలమున్న కొన్ని రాజకీయ పార్టీలు బిసిల కోటా అమలు జరగాల్సి ఉందని, పైగా మహిళా కోటాలో బిసిల వాటా అత్యవసరం అని ఇది లేకపోతే సామాజిక న్యాయం ఏముంటుందని బిసిల పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తమకు మహిళా బిల్లు పట్ల వ్యతిరేకత లేదని, అయితే సమాజంలో వెనుకబడి ఉన్న బిసిలకు జరగాల్సిన న్యాయం సంగతి ఏమిటని ఈ పార్టీలు ప్రశ్నిన్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ, సమాజ్‌వాది పార్టీ, మహారాష్ట్రకు చెందిన కొన్ని పార్టీలు ఇప్పటికి తెరవెనుక మహిళా బిల్లుకు వ్యతిరేక మంతనాలు సాగించకపోయినా, తమ బిసి కార్డులను బలీయంగా తెలియచేస్తూ బిసి ప్రయోజనాలను కూడా ఈ బిల్లులో జోడించాలని పట్టుపడుతున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన కీలకం
పార్లమెంట్ ఉభయ సభలలో మహిళా బిల్లు ఆమోదం పొంది, కోటా చట్టం రూపుదిద్దుకున్న తరువాత కోటా అమలు ప్రక్రియ ఉంటుంది. ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన లేదా డిలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. మహిళలకు చట్టంలోని నిబంధనల మేరకు ఎక్కడెక్కడ సీట్లు కల్పించాలి. ఈ విధంగా 33 శాతం కోటా భర్తీ చేయాల్సి ఉంటుందనేది కీలకం అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే ముందు జనగణన (సెన్సస్) జరగాల్సి ఉంది. సెన్సస్ 2027లో జరగాల్సి ఉంది. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం ఆ తరువాత దీనికి 2002లో జరిగిన సవరణలో డిలిమిటేషన్ ప్రక్రియ కేవలం జనాభా లెక్కల తరువాతనే జరగాల్సి ఉంది.

అప్పటి అంచనాల మేరకు సెన్సస్ 2026లో ముగియాల్సి ఉంది. సెన్సస్ దేశంలో 2021లో జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ల కారణాలతో ఇది వాయిదా పడింది. నియోజకవర్గాల పునర్విభజనకు ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 సవరణ జరగాల్సి ఉంది. తక్షణ రీతిలో డిలిమిటేషన్లను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మహిళా కోటా బిల్లు అమలు నాటి నుంచి 15 సంవత్సరాలు ఉనికిలో ఉంటుంది. అయితే పరిస్థితులను బట్టి దీనిని పొడిగించేందుకు వీలుంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు అంటే నేరుగా జనం ఓట్లేసి అభ్యర్థులను గెలిపించే సీట్లకే ఈ మహిళా కోటా వర్తిస్తుందని ఆరు పేజీల ఈ మహిళా బిల్లులో తెలిపారు.

ఈ విధంగా చూస్తే రాజ్యసభ లేదా రాష్ట్రాల శాసనమండలిల స్థానాలకు ఈ కోటా వర్తింపు ఉండదు. కాగా ఈ కోటాలో ఎస్‌సి, ఎస్‌టిలకు మూడో వంతు కోటా ఉంటుంది. మహిళా కోటాలో ఒబిసిలకు ఉప కోటా వర్తించదు. ఇది ఉండాల్సిందేనని ఎస్‌పి, ఆర్జేడీలు పట్టుపడుతున్నాయి. మహిళా బిల్లును ఈ కోణంలో ప్రతిఘటిస్తున్నాయి. మహిళా కోటాకు బిల్లు ఈ దిశలో కీలకమైన ముందడుగే అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి వేరుగా డిలిమిటేషన్ యాక్ట్ కోసం మరో బిల్లు, నోటిఫికేషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

భర్త పెత్తనం ఉంటే చట్టం వృధానే
చట్టసభలలో ఏదో విధంగా మహిళకు సరైన కోటా దక్కినా తెరవెనుక భర్తలు లేదా వారి బంధువులలో పురుషులు పెత్తనం సాగిస్తే ఈ కోటా ఉద్ధేశం నెరవేరకుండా పోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు పంచాయతీ స్థాయిలో మహిళా కోటాలో పదవుల్లో మొక్కుబడిగా మహిళలు ఉన్నప్పటికీ తెరవెనుక అధికారిక హకుంలకు దిగేది భర్తలే అని నిరసన వ్యక్తం అవుతోంది.

రాజకీయ కుటుంబాల వారికి కోటా నిష్ప్రయోజనం
రాజకీయాలలో ఆధిపత్యం ప్రదర్శించే మగవారికి చెందిన కుటుంబాల్లోని మహిళకు కోటా పరిధిలో సీట్లు దక్కితే దీని వల్ల మహిళా అభ్యున్నతి నిరర్థకం అవుతుందని ప్రముఖ న్యాయవాది శిల్పి జైన్ చెప్పారు. రాజకీయ పూర్వచరిత్రలేని మహిళకు సీట్లు కల్పించాల్సి ఉంటుంది. రాజకీయాలలో పాతుకుపోయిన కుటుంబాల మహిళలకు సీట్లు దక్కితే ఇక సామాజిక న్యాయం ఏముంటుందని ప్రశ్నించారు. బిల్లు సక్రమరీతిలో ముందుకు వస్తే మహిళలు తమ సామర్థం నిరూపించుకుంటారని వామపక్ష అనుకూల ఎన్‌జిఒ అన్హద్‌కు చెందిన మహిళా నేత షబ్నమ్ హాష్మీ తెలిపారు. ఏది ఏమైనా మహిళలు ఎక్కువగా ఎంపిలు, ఎమ్మెల్యేలు అయితే వారు సొంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తోటి మహిళకు , సమాజ అభ్యున్నతికి పాటుపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారిపై కుటుంబాల లేదా భర్తల ప్రభావం లేకుండా చూసుకోవల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News