Tuesday, April 30, 2024

ఎడియూరప్పకు త్వరలోనే పదవీచ్యుతి

- Advertisement -
- Advertisement -

Basanagouda sensational comments on Yediyurappa

 

బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వ్యాఖ్యలు

బెంగళూరు: ముఖ్యమంత్రిగా బిఎస్ ఎడియూరప్ప ఎంతోకాలం కొనసాగబోరని, ఆయన వారసుడిగా ఉత్తర కర్నాటక ప్రాంతానికి చెందిన వ్యక్తిని బిజెపి అధిష్టానం ఖరారుచేసిందని బిజెపి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటకలో ముఖ్యమంత్రి ఎడియూరప్పపై తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనపడుతోంది.

తన సొంత నియోజకవర్గం విజయపురాలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎడియూరప్ప తన సొంత జిల్లా శివమొగ్గలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారని, ఇతర ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను కూడా వాపసు తీసుకుంటున్నారని ఆరోపించారు.

నా నియోజకవర్గానికి కేటాయించిన రూ. 125 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వాపసు తీసుకున్నారు. దాంతో నాకు, ఆయనకు మధ్య ఘర్షణ మొదలైంది. మా నిధులన్నీ ఆయన(ఎడియూరప్ప) తన సొంత నియోజకవర్గం శివమొగ్గకు తీసుకువెళుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో కాలం ఉండరు. ఆయన టైమ్ అయిపోయింది అంటూ పాటిల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎడియూరప్పను బిజెపి అధిష్టానం ఎంతోకాలం భరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎడియూరప్ప శివమొగ్గకు ముఖ్యమంత్రా లేక మొత్తం కర్నాటక రాష్ట్రానికా అన్న సందేహాన్ని మరో బిజెపి ఎమ్మెల్యే ఉమేశ్ కట్టి కూడా వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. తనకు చెందిన రూ. 125 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వాపసు తీసుకోకుంటే తన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయించేవాడినని ఆయన చెప్పారు. అయితే తాను అంత తేలికగా వదిలిపెట్టనని, ఆ నిధులను తీసుకువచ్చి తీరతానని ఆయన స్పష్టం చేశారు.

77 ఏళ్ల ఎడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ ఇటీవల కొంత కాలంగా ఊహాగానాలు విస్తృతంగా సాగుతున్నాయి. అయితే ఎడియూరప్పను తప్పించే ప్రసక్తి లేదని రాష్ట్ర బిజెపి స్పష్టం చేసింది. కాగా..ఉత్తర కర్నాటక ప్రజల మద్దతుతోనే ఎడియూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారని పాటిల్ స్పష్టం చేశారు. మాండ్య, చామరాజనగర్ లేదా కోలార్ వంటి దక్షిణ జిల్లాలకు చెందిన వోటర్లు వీరికి వోటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంతానికి చెందిన ప్రజలు వోటు వేస్తేనే మీరు అధికారంలోకి రాగలిగారని ఉత్తర కర్నాటకకు చెందిన పాటిల్ తెలిపారు.

ఇలా ఉండగా పాటిల్ వ్యాఖ్యలను పగటి కలలుగా మరో బిజెపి ఎమ్మెల్యే రేణుకాచార్య కొట్టివేశారు. ఉత్తర కర్నాటకతో సహా బిజెపి ఎమ్మెల్యేలందరూ ఎడియూరప్ప వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కూడా అయిన రేణుకాచార్య స్పష్టం చేశారు. కర్నాకటలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతుతోనే బిజెపి అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఉత్తర కర్నాటక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలో నిర్ణయించాల్సింది పార్టీ అధిష్టానమని, ముఖ్యమంత్రిగా ఎడియూరప్ప సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News