Saturday, April 27, 2024

కోరలు చాస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

5149 corona cases

 

24 గంటలు… 773 కొత్త కేసులు
వైరస్‌తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్‌తో కట్టడి

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో ఏకంగా 773 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 32 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకూ కరోనా వ్యాధి తీవ్రత వివరాలను మంత్రిత్వశాఖ తరఫున సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ రోజువారి మీడియా సమావేశంలో వివరించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య మొత్తం మీద 5149 అయింది. ఇక కరోనా తీవ్రతతో మృతుల సంఖ్య 149గా నిలిచింది. పలు రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి క్రమాన్ని పరిగణనలోకి తీసుకుని తగు విధంగా నివారణ చర్యలతో సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం రాష్ట్రాలు తగు ప్రాధాన్యతక్రమాల వారిగా చర్యలు చేపట్టిందని తెలిపారు. కరోనా రోగులు ఆసుపత్రులలో చేరడం వల్ల, అక్కడ చికిత్సకు తగు చర్యలు తీసుకుంటూనే, వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తారు. కోవిడ్ 19తో వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా తు జాగ్రత్తలు తీసుకుంటారు.

రాష్ట్రాలు తగినన్ని ఆసుపత్రుల ఏర్పాటు, పర్యవేక్షణ, వైరస్ సోకిన వారిని పసికట్టడం, వారిని ఆసుపత్రులకు తరలించడం వంటివాటిపై రాష్ట్రాలతో మాట్లాడినట్లు, ఆయా రాష్ట్రాలు ఈ దిశలో చర్యలకు సూచించినట్లు తెలిపారు. దేశంలో సరిపోయ్యే స్థాయిలో హైడ్రోక్సిక్లోరోక్విన్ నిల్వలు ఉన్నాయనిచెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్ 19 వైరస్‌కు సంబంధించి 1,21,271 పరీక్షలు నిర్వహించినట్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఐసిఎంఆర్ అధికారి ఒకరు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య తక్కువే అని, అయితే ఉదాసీనతకు తావు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలవారిగా చూస్తే మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇక్కడ 1135 కేసులు నమోదు అయ్యాయి. ముంబయ్‌లో ఒకే రోజు 106 కొత్త కేసులు, తరువాత తమిళనాడులో 709, న్యూఢిల్లీలో 597 కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా సోకి చికిత్స తరువాత ఇప్పుడు డిశ్చార్జి అయిన వారు 401 మంది వరకూ ఉన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగడం, సామాజిక సంక్రమణల పరిణామాల సంకేతాలతో కేంద్రం స్పందిస్తోంది. మహారాష్ట్ర ఇతర చోట్ల శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈ వారాన్ని అత్యంత కీలకమైన పరీక్షా సమయంగా నిర్థారించుకున్నట్లు వెల్లడైంది. వైరస్ దశను రాబోయే రెండు మూడు రోజులు స్పష్టం చేస్తాయని నిపుణులు తేల్చిచెపుతున్నారు. అటో ఇటో తేల్చే ఈ క్లిష్ట దశను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టాయి.

యుపిలో 15 జిల్లాల సముదాయాలకు సీల్
కరోనా వ్యాప్తి నివారణ దిశలో యుపి ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ సామూహిక సంక్రమణ నిరోధానికి 15 జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధిస్తూ ఉత్వర్వులు వెలువరించారు. ఆయా ప్రాంతాలు వైరస్ హాట్‌స్పాట్లుగా నిర్థారణ కావడంతో అక్కడి నుంచి స్థానికుల రాకపోకలను నిలిపివేస్తారు. వైరస్ సోకిన వారికి ఈ ప్రాంతంలోనే క్వారంటైన్‌లుగా ఉంచుతారు. సిఎం ఆదిత్యానాథ్ సమక్షంలో ఉన్నతాధికారుల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరల్ వ్యాప్తి ఉన్న 15 జిల్లాలను తప్పనిసరిగా సీల్ చేయాల్సి వస్తోందని యుపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌కె తివారీ తెలిపారు. ఈ నిర్ణయం మేరకు లక్నో, నోయిడా, గజియాబాద్, సీతాపూర్, కాన్పూర్, ఆగ్రా, బరేలీ, ఫిరోజాబాద్, మీరట్, సహారాన్‌పూర్, బులంధ్‌షెహర్, వారణాసి, మహారాజ్ గంజ్, బస్తీ జిల్లాలోని నిర్ణీత ప్రాంతాల సరిహద్దులను మూసివేస్తారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్లు వదిలిబయటకు రాకూడదు. ఆయా ప్రాంతాలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడం, సామూహిక వ్యాప్తికి ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉండటంతో వీటి సీల్‌కు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మృతులు 149 కాదు 162?
దేశంలో కరోనా మృతుల సంఖ్య ఇప్పుడు మొత్తం మీద 162కు చేరింది. ఈ విషయాన్ని వివిధ రాష్ట్రాల అధికారిక గణాంకాలను క్రోడీకరించుకుని పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. దేశంలో కరోనా మృతుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం బుధవారం 149గా పేర్కొంది. మంగళవారం ఉదయానికి తమకు అందిన పూర్తి గణాంకాలతో పోలిస్తే మృతుల సంఖ్య 162గా నిర్థారణ అయిందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.

నిర్మాతకు కరోనా
బాలీవుడ్ నిర్మాత కరీం మోరానికి కరోనా సోకింది. దీనితో ఆయనను ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుళ్లు జోవా, షాజాలకు వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంకు కూడా వైరస్ వచ్చిన విషయాన్ని సోదరుడు మెహమెద్ నిర్థారించారు. మార్చి మొదటి వారంలో కూతురు షాజా శ్రీలంక నుంచి వచ్చింది.వెంటనే ఆసుపత్రిలో చేరింది. మార్చి మధ్యలో రాజస్థాన్ నుంచి వచ్చిన మరో కూతురు జోవా కూడా నానావతి ఆసుపత్రిలో పరీక్షలకు వెళ్లగా ఇద్దరికీ కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది.

కరోనా బాధితుడైన ట్రాఫిక్ పోలీసు
ట్రాఫిక్ విధుల్లో ఉంటూ వచ్చిన స్థానిక ట్రాఫిక్ పోలీసుకు కరోనా సోకింది. బుధవారం ఆయనను సఫ్థర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. 49 ఏళ్ల ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ ఎస్‌ఐ స్థానిక హౌజ్ ఖాస్ సర్కిల్‌లో డ్యూటీ చేస్తున్నారు. ఈ నెల 1 వ తేదీన అనారోగ్య లక్షణాలతో ఎయిమ్స్‌లో చేరారు. అయితే 14 రోజుల పాటు ఇంటిలోనే క్వారంటైన్ కావాలని అక్కడ డాక్టర్లు సూచించారు. అయితే మంగళవారం జరిపిన పరీక్షలలో కరోనా వచ్చినట్లు తేలింది. దీనితో తదుపరి చికిత్సకు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా రావడంతో ఆయనతో పాటు విధులలో పనిచేయాల్సి వచ్చిన ట్రాఫిక్ వారిని కూడా క్వారంటైన్‌కు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

5149 corona cases in country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News