Sunday, April 28, 2024

మరణ శిక్ష జాబితాలో 561 మంది ఖైదీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో మరణ శిక్ష అమలు కావలసిన ఖైదీల సంఖ్య 561గా ఉందని, రెండు దశాబ్దాలలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అదే అత్యధికమని ఒక నివేదిక వెల్లడించింది. 2015 నుంచి అటువంటి ఖైడీల సంఖ్య 45.71 శాతం పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ఢిల్లీలోని జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ 39 ప్రచురించిన‘భారత్‌లో మరణ శిక్ష: వార్షిక గణాంకాల నివేదిక’ ఎనిమిదవ ఎడిషన్ ప్రకారం, 2023లో ట్రయల్ కోర్టులు 120 మరణ శిక్షలు విధించాయి. అయితే, 2000 దరిమిలా అప్పిలేట్ కోర్టుల మరణ శిక్ష నిర్ధారణల రేటు 2023లోనే అత్యల్పంగా ఉన్నది. సుప్రీం కోర్టు మరణ శిక్షను నిర్ధారించకపోవడం 2021 తరువాత అది రెండవ క్యాలెండర్ సంవత్సరం. ‘సుప్రీం కోర్టు 2023లో ఏ మరణ శిక్షనూ నిర్ధారించలేదు.

హైకోర్టులలో కర్నాటక హైకోర్టు ఒక హత్య కేసులో ఒకే ఒక మరణ శిక్షను ధ్రువీకరించింది. అలా చేయడంలో 2000 నుంచి అప్పిలేట్ న్యాయస్థానాలలో మరణ శిక్షల నిర్ధారణల రేటు 2023లోనే అత్యల్పంగా ఉన్నది’ అని ఆ నివేదిక వివరించింది. ఆ నివేదిక ప్రకారం, 2008 నాటి ఒక మైనర్ కిడ్నాపింగ్, అత్యాచారం, హత్యకేసులో ఒక క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి నిరుడు మార్చిలో తిరస్కరించారు. కాగా, 488 మంది మరణ శిక్ష ఖైదీలు హైకోర్టుల నుంచి తీర్పు కోసం నిరీక్షిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. మూడు మరణ శిక్ష అప్పీళ్లలో నలుగురు ఖైదీలను సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసిందని, రెండు మరణ శిక్ష కేసులను ట్రయల్ కోర్టుకు, హైకోర్టుకు తిరిగి పంపిందని, క్రిమినల్ అప్పీళ్లలో ముగ్గురు మరణ శిక్ష ఖైదీల శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిందని ఆ నివేదిక తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News