Monday, May 6, 2024

షిండే గ్రూపులో చేరిన 66 మంది శివసేన కార్పొరేటర్లు

- Advertisement -
- Advertisement -

66 Shiv Sena corporators who joined Shinde camp

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరోపెద్ద షాక్ తగిలింది. థాణే మున్సిపల్ కార్పొరేషన్ (టిఎంసి)కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు ముఖ్యమంత్రి షిండే గ్రూపులో చేరారు. ఈమేరకు మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్‌లోని ఆయన అధికారిక నివాసంలో బుధవారం రాత్రి కలిశారు. షిండే నాయకత్వం లోని అందరం కలిసి పనిచేస్తామని కార్పొరేటర్లు ప్రకటించారు. దీంతో ఉద్ధవ్ థాక్రే వర్గంలో కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, థాక్రే పక్షాన నిలబడిన 12 మంది ఎమ్‌ఎల్‌ఎలు కూడా షిండే శిబిరానికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

శివసేన కార్పొరేటర్ల తిరుగుబాటుతో ఉద్దవ్ థాక్రే థాణే మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు కోల్పోయారు. మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( బిఎంసి)తరువాత థాణే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్ఠాత్మక నగరపాలక సంస్థ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే 2017లో శివసేన తరఫున ఠాణే మున్సిపల్ కార్పొరేటర్లుగా ఎన్నికైన వీరి పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. అయితే ఈ మున్పిపల్ ఎన్నికలు ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సి ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశం పై సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. ఈ సమయం లోనే ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News