Monday, May 6, 2024

డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తన నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లను సాధిస్తేనే ధరావతు (డిపాజిట్ ) దక్కుతుంది. అయితే తొలి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 71 వేల మంది సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినట్టు ఎన్నికల కమిషన్ విశ్లేషణలో వెల్లడైంది. అయితే వీటిని కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందున్నట్టు తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 మందికి డిపాజిట్లే రాలేదు. అంటే 78 శాతం అభ్యర్థులకు ధరావతు దక్కలేదని స్పష్టమవుతోంది. 195152 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.

11వ లోక్‌సభలో రికార్డు
199192లో 86 శాతం మంది అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు. 1996లో 11 వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 12,688 మందికి చుక్కెదురైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడిన లోక్‌సభ ఎన్నికలు కూడా ఇవే కావడం గమనార్హం. 2009 లో 85 శాతం, 2014లో 84 శాతం, అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

బీఎస్పీలో ఎక్కువ
2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ వారీగా చూస్తే బీఎస్పీ అగ్రస్థానంలో నిలిచింది. 383 మంది పోటీ చేస్తే అందులో 345 మంది ధరావతు కోల్పోయారు. ఈ తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో 421 అభ్యర్థులకు గాను, 148 మంది డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. ధరావతు కోల్పోతామని ముందే తెలిసినా, తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరికొందరు మాత్రం అసలైన అభ్యర్థులకు నకలుగా (ప్రాక్సీగా) వారిని బరిలో దించుతారని పేర్కొంటున్నారు. తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 250, ఉండేది. ప్రస్తుతం అది జనరల్ అభ్యర్థులకు రూ. 25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12, 500లకు పెరిగింది. ఇలా డిపాజిట్ విలువ భారీగా పెంచినప్పటికీ అభ్యర్థుల సంఖ్యను ఇది కట్టడి చేయలేక పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News