న్యూఢిల్లీ: సర్కారు తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల సంఘాల నాయకుల మధ్య ఏడో విడత చర్చలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 37 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళన చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన రైతుల ఆత్మశాంతి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం వ్యవసాయ చట్టాల్లో రైతుల అభ్యంతరాలపై చర్చలు ప్రారంభించారు.