Monday, May 6, 2024

నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

 

 తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
 దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించిన కేంద్రం
 ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
 దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
 తోసిపుచ్చిన దోషుల తరఫు న్యాయవాదులు

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరి అమలును నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ కేంద్రం, తిహార్ జైలు అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలలు చేసుకున్న పిటిషన్‌పై ఆదివారం హైకోర్టు ప్రత్యేక విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ సురేష్ ఖైత్ చెప్పారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. దిశ హత్యాచారం నిందితలు ఎన్‌కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ, జరిగింది దిగ్భ్రాంతికరమైనదే కానీ జనం పండగలు చేసుకున్నారన్నారు. ‘అది చాలా దుష్ట సంప్రదాయాన్ని ఇచ్చింది. ఉరి శిక్షను అమలు చేయడంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠే ప్రమాదంలో పడింది’ అని ఆయన అన్నారు. వరసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురు దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారన్నారు. నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన తీరు యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ గుప్తా అనే దోషి ఇప్పటివరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోలేదని.. కావాలనే ఆలస్యం చేస్తున్నాడని ఆయన కోర్టుకు తెలిపారు. ఉరి శిక్ష అమలులో ఎంతమాత్రం ఆలస్యం ఉండరాదని, రాష్ట్రపతి భవిష్యతుత్లో ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేస్తారేమోనని భావించడం కూడా సరికాదని ఆయన అన్నారు. అంతేకాదు, దోషులను విడివిడిగా ఉరి తీయడంలో ఢిల్లీ ప్రభుత్వానికి కానీ, తిహార్ జైలు అధికారులకు కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా ఆయన చెప్పారు. అయితే దోషుల్లో ఒకడైన ముకేష్ కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ సొలిసిటర్ జనరల్ వాదనతో ఏకీభవించలేదు. ఉమ్మడి ఉత్తర్వుతో నలుగురికీ మరణ శిక్ష విధించడం జరిగిందని, అందువల్ల విడివిడిగా ఉరి తీయడానికి వీల్లేదని న్యాయవాది వాదించారు. అంతేకాదు వారు చేసిం ది దారుణమైన నేరమే కావచ్చు కానీ రాజ్యాంగం ప్రకా రం వారికి జీవించే హక్కు ఉందని అన్నారు. మిగతా ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాది ఎకె సింగ్ కూడా ఈ వాదనతో ఏకీభవించారు. ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టు కానీ, రాజ్యాంగం కానీ ఎలాంటి కాలపరిమితిని నిర్ణయించలేదన్నారు. అందువల్ల దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలన్నీ ఉపయోగించుకునే దాకా ఉరి శిక్షను అమలు చేయరాదని ఆయన వాదించారు. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న అమలు కావలసిన ఈ ఉరిశిక్షపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని తిహార్ జైలు అధికారులు, కేంద్ర హోం శాఖ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో మరణ శిక్ష పడిన నలుగురిలో మరో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి రామ్‌పాథ్ కోవింద్ ఆదివారం తిరస్కరించారు. నిర్భయ కేసులో మరణ శిక్ష విధించిన నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సి ఉండగా, దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందన్న కారణంగా ఢిల్లీ పటియాల కోర్టు ఈ నలుగురు దోషుల ఉరిశిక్షపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. పటియాలా కోర్టు దోషుల ఉరిశిక్షపై స్టే విధించిన ఒక రోజు తర్వాత మరో దోషి అక్షయ్ ఠాకూర్ కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి నలుగురు దోషుల్లో ఒక్క ముకేశ్ విషయంలో క్షమాభిక్ష సహా న్యాయపరమైన అన్ని మార్గాలు ముగిసి పోయాయి. క్షమాభిక్ష కోసం ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ జనవరి 17న తిరస్కరించారు.

Nirbhaya case: Delhi HC Hearing on Tihar Officials Petition

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News