Thursday, May 9, 2024

జిఎస్టీ బిల్లులకు సర్వీసు చార్జీలు రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : హోటళ్లు, రెస్టారెంట్‌లకు వెళ్లే వారికి శుభవార్త. వినియోగదారులకు సేవా పన్నును రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్వీసు చార్జీలను రద్దు చేస్తూ కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా ఇకపై ఓ హోటళ్లు, రెస్టారెంట్ గానీ సర్వీసు చార్జీలను వసూలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏ బిల్లుకు అయినా జీఎస్టీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా వస్తువులు, సేవలపై జీఎస్టి పేరిట పన్ను వేస్తున్నప్పుడు సర్వీసు చార్జీలను అసలు వసూలు చేయరాదని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా….

సర్వీసు ఛార్జీల విషయమై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలు వసూలు చేయకూడదని రెస్టారెంట్లు, హోటల్స్‌కు సూచించింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే 1915కి ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు సిసిపిఏ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు సిసిపిఏ పేర్కొంది.

మార్గదర్శకాలు ఇలా…

హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో ఆటోమేటిక్ లేదా డిఫాల్ట్ సర్వీసు ఛార్జీని వసూలు చేయడానికి వీల్లేదు. ఏ ఇతర పేరుతోనూ సర్వీసు ఛార్జీని వసూలు చేయకూడదు. సర్వీసు ఛార్జీ పేరుతో హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుడుపై ఒత్తిడి తీసుకురాకూడదు. అది వారి ఐచ్ఛికానికే వదిలేయాలి. సర్వీసు ఛార్జీల ఆధారంగా వినియోగదారులకు ప్రవేశం లేదా సేవల్లో పరిమితులు విధించకూడదు. ఎవరైనా వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీసు ఛార్జీలను విధిస్తే వెంటనే బిల్లు నుంచి తొలగించాలని కోరవచ్చు. ‘నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)కు 1915కి ఫోన్ చేయడం లేదా ఎన్‌సిహెచ్ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల కమిషన్, ఈ-దాఖిల్ పోర్టల్, సిసిపిఏకు ఈ-మెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News