Sunday, April 28, 2024

మాస్‌మూమెంట్‌గా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా ముందుకు వెళ్లుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చెప్పారు. ప్రతి ఛాలెంజ్‌కు నిర్ణీత సమయం ఉంటుంది కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతరం నిర్వహించే కార్యక్రమమని ఆయన చెప్పారు. గురవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్‌తో కలిసి ఒకేసారి ఐదువేల మొక్కలు నాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ ‌కుమర్ మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ నుంచి సామాన్యకార్యకర్తలతో పాటుగా దేశంలోని ప్రముఖులంతా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఒక మాస్ మూమెంట్‌గా ముందుకు తీసుకువెళ్లు తున్నారని చెప్పారు. గతమూడు సంవత్సరాలుగా నిరతంర ప్రక్రియగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్లుతుందని చెప్పారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పర్యావరణంపై సమాజంలో మార్పు తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు సమతూల్యమైన ప్రకృతిని అందించాలనే ఆశయం నిరంతం మందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అజయ్‌దేవగన్‌కు చెందిన ఎన్‌వై ఫౌండేషన్ తోడవడం మాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక ముందుకూడా కలిసి వచ్చే వారితో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకుపోతామని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా అజయ్‌దేవగన్ మాట్లాడుతూ నాకు మొక్కలు, పచ్చదనం అంటే చాలా ఇష్టం, సమాజం వ్యాపారీకరణతో, కాలుష్యకాసారంగా మారడం తీవ్రంగా కలచి వేస్తుందని చెప్పారు. అభివృద్ధి ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతో అవసరమన్నారు. పచ్చదనాన్ని పెంచాలనే లక్షంతో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టి నిస్వార్థంగా పనిచేస్తున్న ఎంపి సంతోష్ కుమార్‌ను, ఆయన బృందాన్ని చూస్తే గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అజయ్ దేవగన్ చెప్పారు. ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఒకే రోజు 5వేల మొక్కలు నాటాము, ఈ పారిశ్రామిక వాడను గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌గా, పచ్చదనంతో అభివృద్ధి చేస్తామని పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.
కనులపండుగగా కళాప్రదర్శనలు
దందు మల్కాపూర్ ఇండ్ట్రీయల్ పార్క్‌లో పండుగవాతావరణం నెలకొంది. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, అజయ్‌దేవగన్‌కు తెలంగాణ సంప్రదాయ కళారూపాలు స్వాగతం పలికాయి. వందలాది మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పండుగ వాతావరణం సృష్టించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఒగ్గు కళాకారులు తమకళారూపాన్ని ప్రదర్శించారు. బతుకమ్మలు, బోనా లు సందడి చేశాయి. అనంతరం కళాకారులు కూడా మొక్కలు నాటారు. ఒకే వేదికగా ఒకే సారి ఐదువేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రేమికులు, పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, మాజీ ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బాలు మున్నంగి, రాఘవ, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Ajay Devgan participate in Green India Challenge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News