Friday, April 26, 2024

నింగి దాటిన జ్ఞానశిఖరం!

- Advertisement -
- Advertisement -

Stephen hawking inspiring story in telugu

 

‘అర్థమయ్యేట్లు చెప్పాలంటే అసలు దేవుడు అనే వాడు లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. నేను ప్రగాఢంగా విశ్వసించేదేమంటే, స్వర్గ నరకాలు లేవు. మరణానంతర జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వ రహస్యాల్ని తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే”! అని అంత బలంగా చెప్పిన డాక్టర్ స్టీఫెన్ హాకింగ్‌కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలా మందికి తెలి సి ఉండకపోవచ్చు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు. “నా శరీరం నిస్సత్వువగా కుర్చీలో కూలబడి పోవచ్చు. కానీ, నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది” అని, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త హాకింగ్. 1942 జనవరి 8న ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్ ముప్పయ్యేళ్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. హాకింగ్ తల్లి ఇసబెల్ హాకింగ్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు. అందువల్ల స్టీఫెన్‌కు చిన్నప్పటి నుండి ప్రగతిశీల భావాలు అబ్బాయి. తండ్రి ఫ్రాంక్ మెడికల్ డాక్టర్, పరిశోధకుడు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌లో పారసైటాలజీ విభాగానికి అధిపతి.

ఆయన తరచూ ఆఫ్రికా వెళ్లి అక్కడ పరిశోధనల్లో నిమగ్నమవుతూ ఉండేవారు. అందుకే స్టీఫెన్ తల్లితోనే ఎక్కువ కాలంగడిపాడు. ఆమె ఉన్నత విద్యనభ్యసించిన మహిళ. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో రాజకీయ, ఆర్థిక, తాత్తిక శాస్త్రాలు అభ్యసించి, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండేది. స్టీఫెన్‌కు ఫిలిప్పా, మేరి అనే ఇద్దరు చెల్లాయిలతో పాటు, తన తలిదండ్రులు దత్తత తీసుకున్న సోదరుడు ఎడ్వర్డ్ ఉండేవాడు. తన పదమూడవ యేట హాకింగ్, బెర్ట్రాండ్ రస్సెల్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. విద్యార్థి దశలో పరిచయమైన జేన్ వైల్డ్ అనే అమ్మాయితో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మోటార్ న్యూరోసిస్ వ్యాధి సోకింది. నేచురల్ సెన్సెస్‌లో బి.ఎ (ఆనర్స్) డిగ్రీ ప్రథమ శ్రేణిలో సాధించాడు. ఫైనల్ ఇయర్‌లో ఉండగా స్టీఫెన్ కళ్లు తిరిగి మెట్ల మీదపడిపోయాడు. మూతి వంకర పోసాగింది. క్రిస్ట్‌మస్ సెలవుల్లో ఇంటికి వెళ్లినపుడు కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి గమనించి వైద్యం చేయించడం ప్రారంభించారు.

అప్పడది ఎఎల్‌యస్ అని తేలింది. అంటే ఏమియోట్రోఫిక్ లేటరల్ స్లిరోసిస్ అనే వ్యాధి (AMYOTROPHIC LATERAL SCLEROSIS) దానిలో గెహరిగ్స్ వ్యాధి (LOU GEHRIC’S DISEASE) అని కూడా అంటారు. ఇది ఒక మోటార్ న్యూరాన్ వ్యాధి (MOTOR NEURON DISEASE). 1963లో బయటపడినప్పుడు ఆయన కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు చెప్పారు. అంటే ఆయన తన 23వ యేట చనిపోవాల్సంది. కాని ఇప్పుడాయన వయసు 76. బ్లాక్ హోల్స్‌పై పరిశీలనలు చేస్తున్న సమయంలోనే 1965లో గాన్ విల్లి కైస్ కాలేజీ వారి ఫెలోషిప్ దొరికింది. దాంతో అప్లయిడ్ మాథమెటిక్స్ థియరటికల్ ఫిజిక్స్ కాస్మొలజీలో పిహెచ్‌డి తీసుకున్న స్టీఫెన్, మొదట్లో క్లచస్ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు. పని చేసే యూనివర్శిటీ డిపార్టుమెంట్‌కు దగ్గర్లో ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. మరోవైపు భార్య జేన్ వైల్డ్ కూడా పిహెచ్‌డి ప్రొగ్రాంలో చేరింది. మరోవైపు పిల్లల సంరక్షణ. కొడుకు రాబర్ట్ (1967), కూతురు లూసీ (1970), మరో బిడ్డ టిమోతి (1979) పుట్టారు.

హాకింగ్ తన శారీరక లోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు. విధిరాత, దైవం వంటి వాటిని నమ్మేవారు కాదు కాబట్టి వాస్తవ స్థితి ఎదుర్కోవడానికే సిద్ధపడేవారు. తన అంగవైకల్యానికి సానుభూతి ప్రకటిస్తూ సహాయపడడానికి వచ్చే వారిని వారించేవారు. ఆయన తనను మొదట సైంటిస్ట్‌గా గుర్తించాలనుకునే వారు. తరువాత పాపులర్ సైన్స్ రచయితగా, ఆ తరువాత కొన్ని ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, కోర్కెలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునేవారు. ‘ ఆయనది గొప్ప ధ్యేయమని’ కొందరంటే ‘ పిచ్చి పట్టుదల’ అని మరి కొందరనే వారు. ఈ రెండు అభిప్రాయాలూ విన్న ఆయన భార్య జేన్ హాకింగ్, రెండింటినీ ఒప్పుకునేది. ‘ ఆ రెండూ కలిసికట్టుగా పని చేస్తున్నాయేమో” నని అనేది. లేదా ఒకటి తర్వాత ఒకటి పని చేస్తున్నాయేమో”నని అనేది.

వెర్నర్ ఇస్రయిల్ అనే భౌతిక శాస్త్రవేత్త ‘మోజట్ కంపోజింగ్ సింఫనీ’ (MOZAT composing Symponey) తెచ్చి స్టీఫెన్ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ల సరిహద్దుల మీద సెర్న్ (cern)ను సందర్శించినపుడు ఆయనకు నిమోనియా పట్టుకుంది. తీవ్ర అస్వస్థత ఎదుర్కొవాల్సి వచ్చింది. ‘లైఫ్ సపోర్ట్’ తీసియ్యొచ్చా అని కూడా ఆయన భార్య జేన్ హాకింగ్‌ను అడిగారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా ట్రాఖియోటొమి (Tracheotomy) వచ్చింది. దానితో ఇరవై నాలుగు గంటలు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. నర్సింగ్ హోమ్ ఖర్చు తాము భరిస్తామని నేషనల్ హెల్త్ సర్వీస్ ముందు కొచ్చి ఆయనకు అండగా నిలిచింది. కాని ఆయన భార్య ఒప్పుకోలేదు. ఆయన ఇంటి దగ్గరే ఉండాలని కోరుకుంది. ఆ దశలో అమెరికన్ ఫౌండేషన్ ముందు కొచ్చి ఖర్చు భరించింది. మూడు షిఫ్ట్‌లలో నర్సుల్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

అలా నియమించబడ్డ వారిలో ఎలెన్ మాసన్ అనే నర్సు కూడా ఉంది. ఈమె భర్త డేవిడ్ ఒక కంప్యూటర్ ఇంజినీర్. ఆయన ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్ హాకింగ్ వీల్ ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని వల్ల స్టీఫెన్ హాకింగ్ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది. స్పెల్లింగ్ కార్డ్ మీద అక్షరాల్ని ఎన్నిక చేసుకోవడానికి తొలుత ఆయన కనుబొమలు కదిలించేవారు. తరువాత 1986లో ‘ఈక్వలైజర్’ అనే కంప్యూటర్ ప్రోగ్రాం అందుబాటులో కొచ్చింది. వర్డ్ ప్లస్ (words plus) సిఇఒ అయిన వార్టర్ వోల్టోస్ తాను రూపొందించిన సాఫ్ట్‌వేర్ తెచ్చి అమర్చాడు. దానివల్ల 2500-3000 వరకు అక్షరాలు, పదాలు, వాడుక మాటలు అన్నీ ఒక చిన్న మీట నొక్కితే అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటాయి.

నిమిషానికి పదిహేను పదాలు టైపు చేయగల సామర్థం ఆ సాఫ్ట్‌వేర్‌కి ఉండడం వల్ల ఆయన ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు అన్ని తయారవుతూ ఉండేవి. ఉపన్యసించాల్సిన చోట ఆ విషయాల్ని ముందుగానే స్పీచ్ సింథిసైజర్ (speech synthesizer)కు పంపి సిద్ధంగా ఉంచుకోవడం వల్ల అక్కడ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉండేది. స్టీఫెన్ హాకింగ్ కేవలం మనిషి ఆత్మ విశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త. మేధావి. ఆయనను కాపాడుకోవడానికి కుటుంబమే కాదు సమాజమే కదిలి వచ్చింది. మనిషి కోసం మనుషులు కదిలివచ్చినట్టయ్యింది. అంతటి దయనీయమైన స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి తలవలేదు. ముడపులు కట్టలేదు. క్రీస్తు భజనలు చేయలేదు. పైగా “జరుగుతున్న వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదని” అనారు. మనిషి చేస్తున్న ఆవిష్కరణలు, సాధిస్తున్న విజయాలు లేని దేవుడి ఖాతాలో వేస్తూ బతికే పలాయనవాదులున్నంత కాలం మార్పురాదు. ఈ విషయం చెప్పడానికే స్టీఫెన్ హాకింగ్ శారీరక బలహీనత గూర్చి, ఆయన అచంచల ఆత్మ విశ్వాసం గూర్చి ఇక్కడ వివరించడం జరుగుతోంది. 2005లో ఆయన తన పరికరం (device) వాడడానికి చెంప కండరాలు కదిలించేవాడు. నిమిషానికి అది ఒక పదం మాత్రమే తీసుకునేది.

అది ఇబ్బందిగా అనిపించడం వల్ల, ఇన్‌టెల్ పరిశోధకుల సహకారంతో మరో విధానం అందుబాటులో కొచ్చింది. అది అతని మెదడులోని విషయాల్ని (Brain pattern) ముఖ కవళికల్ని అనువదించే చెప్పేది. అది కూడా అంత ఉపయోగకరంగా లేకపోవడం వల్ల లండన్‌లోని షిఫ్ట్ కీ (Shift Key) కంపెనీ ముందు కొచ్చింది. అంతకు ముందు స్టీఫెన్ హాకింగ్ రాసిన పరిశోధనా పత్రాల్లోని పదాల్ని, వాక్యాల్ని, విషయాల్ని, తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తు పెట్టుకుని టైప్ చేసేది ఈ పద్ధతి మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్‌లలో కూడా చూస్తున్నాం. మనం టెక్ట్ టైప్ చేసేప్పుడు తరచుగా వాడే పదాల్ని అది గుర్తు చేస్తుంటుంది.

2009 నాటికి ఆయన తన వీల్ ఛైర్‌ని నడుపుకోలేని స్థితి వచ్చింది. తర్వాత మెడ, గదుమ భాగాలు కదిలిస్తే దాన్ని అనుసరించి కుర్చీ కదిలే విధంగా ఏర్పాటు చేశారు. అయితే అది ఆయనకు పని చేయలేదు. అలా చేయడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులొచ్చాయి. మళ్లీ హాస్పిటల్లో కూడా చేరాల్పి వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన మానవ జాతి గురించే ఆలోచించారు. “రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా ధ్వంసమవుతున్న ఈ సమాజంలో మానవ జాతి మరో వందేళ్లు కొనసాగెదెట్లా? అని బెంగ పెట్టుకున్నారు. యవ్వన దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్ హాకింగ్, జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. నిస్పత్తువగా మారిన తన శరీరంతో తాను పోరాడుతూ, జ్ఞాన కాంక్ష కోసం పోరాడుతూ, ప్రపంచ మానవాళి మూఢత్వంతో పోరాడుతూ… డెబ్బయ్యారేళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞాన శిఖరంగా నిలబడడం ఆయన ప్రత్యేకత! దెబ్బ తాకితేనో, జ్వరం వస్తేనో దేవుడికి ముడుపులు కట్టి మొక్కుకునే మూఢ జనం హాకింగ్ జీవితం గూర్చి ఏమైనా నేర్చుకోగలరా? మంచి కుటుంబ నేపథ్యం, మంచి ఆర్థిక స్తోమత, మంచి ఆర్యోగంతో మంచి జీవితం అనుభవిస్తూ కూడా పక్కవాడికి కాదు గదా తమకు తామే పనికిరాని వాళ్లు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వారితో పోలిస్తే హాకింగ్ జీవితం ఎంతో ఉన్నతమైంది.

అర్థవంతమైంది కూడా! చేతులు లేక కాలితో సంతకం చేసే వారిని చూస్తేనో, కాళ్లు లేక చేతుల మీద నడిచే వారిని చేస్తేనో జనం జాలిగా చూస్తారు. వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటారు. మరి స్టీఫెన్ హాకింగ్ పరిస్థితి ఏమిటి? మెదడు ఒక్కటి తప్ప మిగతా శరీరమంతా కుప్పగూలి ఉన్నారు కదా? అయినా ఆయన ధ్యేయాన్ని క్షణ కాలమైనా మరువ లేదు కదా? విశ్వ విజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలందిస్తూ వచ్చారు కదా? మృత్యువు అంచు మీద శ్వాసిస్తూ కూడా, మనిషి విజయ పరంపర గూర్చి మాత్రమే ఆలోచించారు డా. స్టీఫెన్ హాకింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్భలులైన మిలియన్‌ల జనం కంటే కూడా హాకింగ్ దృఢ సంకల్పుడు. మానసిక బలశాలి. ఆయన ఆకాశమే హద్దు అనుకోలేదు. ఆ ఆకాశాన్ని ఇంకొంచెం పైకి ఎదగమని .. విసరకనే సవాల్ విసిరారు.

డా. దేవరాజు
మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News