Saturday, May 4, 2024

కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు

- Advertisement -
- Advertisement -

పండుగల సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మరో మూడు నెలలు చాలా జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే సురక్షిం
రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు చాలా పెరిగింది
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

Alert for corona virus

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, మరో మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. పండుగలు, విందులు, షాపింగ్ సమయంలో భౌతికదూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలని సూచించారు. సోమవారం డిహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2.01 కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని వెల్లడించారు. 38 శాతం మందికి రెండో డోసు ఇచ్చామని తెలిపారు. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని స్పష్టం చేశారు. మొదటి డోసు తీసుకుని రెండవ డోసు తీసుకోని వారు రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది వరకు ఉన్నారని, వారికి గుర్తించి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

మొదటి డోసు తీసుకున్న వారికి గడువు ముగిసినా రెండవ డోసు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు, మొదటి డోసు తీసుకుని రెండవ డోసు తీసుకోని వారు స్వఛ్చందంగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించాలంటే ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖతోపాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తే చాలా వరకు కొవిడ్‌ను జయించగలుగుతామని పేర్కొన్నారు. కొవిడ్‌తో మరణించిన వారికి కేంద్ర రూ.50 వేల పరిహారం ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు మార్గదర్శకాలు రాలేదని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది

గత 3 నెలల నుంచి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని డీహెచ్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల కరోనా తీవ్రతను అడ్డుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,800 మాత్రమే కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పీడియాట్రిక్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాదాపు కరోనా ముందు పరిస్థితులు కనిపించడంతో పాటు.. సాధారణ జీవనంలోకి వస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనా సోకని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.కరోనా ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై ఉంటుందని చెప్పారు.

మానసిక ఆరోగ్యంపై కూడా కరోనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కొవిడ్ సోకి తగ్గిన తర్వాత కొంతకాలం పాటు పోస్టు కొవిడ్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారని తెలిపారు. ఎక్కువగా యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ఇటీవల 17 ఏళ్ల యువతి కరోనా మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలలు పండుగల సీజన్ కావడం వల్ల ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు చాలా పెరిగిందని అన్నారు. 33 జిల్లాల్లో ఆర్‌టిపిసిఆర్ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కొవిడ్ రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇన్‌ఫెక్టివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కరోనా మరణాలు అతితక్కువగానే నమోదవుతున్నాయని వెల్లడించారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కొంతకాలం పాటు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తండా ఉండాలని పేర్కొన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని లేదా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్ కాదని తేలాకే మిగిలిన వ్యాధులకు చికిత్స తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా వైరల్ ఫీవర్లు వెలుగుచూస్తుండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయరని చెప్పారు. మలేరియా కేసులు ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనే నమోదవుతున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధులకు చికిత్స అందించేందకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News