Friday, April 26, 2024

అందరి దృష్టి బెంగాల్ పైనే !

- Advertisement -
- Advertisement -

All eyes are mainly on West Bengal Elections

 

ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరుగవలసిన ఎన్నికల షెడ్యూల్‌ను మార్చ్ 7న ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా ప్రకటించిన రోజులలోనే అంతకన్నా పది రోజుల ముందుగానే కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకటించిన తీరు చూస్తుంటే అందరి దృష్టి ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పైననే ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

ఈ ఎన్నికలు ఒక విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మాత్రమే కాకుండా ప్రధానప్రతిపక్ష హోదా పొందలేక పోయిన కాంగ్రెస్ కు కూడా ప్రతిష్టాకరమైనవే. ఎందుకంటె ఒక్క బెంగాల్ లో తప్ప అన్ని రాష్ట్రాలలో అధికారం కోసం కాంగ్రెస్ పోరాడుతున్నది. కాంగ్రెస్ కు కాలం కలసి వస్తే తమిళనాడులో తప్ప కేరళ, అస్సాం, పుదుచ్చేరి లలో ఆ పార్టీ వ్యక్తులే ముఖ్యమంత్రులు అవుతారు. మరోవంక, ఒక్క బెంగాల్‌లో తప్ప బిజెపి ప్రధానంగా కాంగ్రెస్ ను కట్టడి చేయడం పైననే దృష్టి సారిస్తుంది.

కాంగ్రెస్ రెండు, మూడు రాష్ట్రాలలో అధికార పక్షం కాగలిగితే ఆ పార్టీకి నైతికంగా ఎంతో ఊపు ఇచ్చిన్నట్లు అవుతుంది. అప్పుడు బిజెపి అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఆ పార్టీని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది. కేవలం అస్సాంలో మాత్రమే రెండు పార్టీలు నేరుగా అధికారంకోసం పోరాడుతున్నాయి. అస్సాం తర్వాత బిజెపి అధికారంకోసం పోరాడుతున్నది పశ్చిమ బెంగాల్ లో మాత్రమే. అక్కడ ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పోరాడుతున్నది. కాంగ్రెస్ మూడో స్థానంలో మాత్రమే ఉంది. ఇక దక్షిణాదిన మూడు రాష్ట్రాలలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే బిజెపి ఎత్తుగడలు వేస్తున్నది. పుదుచ్చేరిలో మిత్రపక్షాలను గెలిపించే ప్రయత్నంలో మాత్రమే ఉంది.

తమిళనాడులో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకొనేతాటట్లు చేయడం బిజెపికి చాలా అవసరం. డీఎంకే అధికారంలోకి వస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు దక్షిణాదిన కొంత ఊపిరి పోసిన్నట్లు అవుతుంది. కేరళలో బిజెపి ఎంతగా హడావుడి చేసినా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సిపిఎం నేతృత్వం వహిస్తున్న కూటముల మధ్యనే ఉంటుంది. కేరళ చరిత్రలో తొలిసారి గత ఎన్నికలలో ఒక సీట్ గెల్చుకున్న బిజెపి ఇప్పుడు ఆ సంఖ్యను రెండు, మూడింతలు చేసుకొనే ప్రయత్నంలో మాత్రమే ఉంటుంది. సైద్ధాంతికంగా కాంగ్రెస్ కన్నా సిపిఎం ప్రధాన శత్రుపక్షం అయినా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిలదొక్కుకోకుండా చేయడం కోసం ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడమే బిజెపికి ప్రధమ ప్రాధాన్యతగా మారే అవకాశం లేకపోలేదు. అస్సాంలో తరుణ్ గొగోయ్ మరణం తర్వాత కాంగ్రెస్ కు బలమైన నాయకుడు లేరు.

కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకనే అక్కడ బిజెపిని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత తేలిక కాకపోవచ్చు. ఫలితాలు ఏ విధంగా ఉన్నా జాతీయ రాజకీయాలపై ఈ రాష్ట్రం చెప్పుకోదగిన ప్రభావం చూపే అవకాశం లేదు. ఇప్పుడు దేశ ప్రజల అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైననే కేంద్రీకృతం అవుతున్నది. ఐదేళ్ల క్రితం కేవలం మూడు సీట్లు మాత్రమే గెల్చుకున్న బిజెపి ఇప్పుడు అధికారం తమదే అనే ధీమాతో ఉండడం, 200 సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉండడం ఒక విధంగా విస్మయకార పరిణామమే. ఐదేళ్ల క్రితం బిజెపి ఇటువంటి బలం సమకూర్చుకొంటుందని ఎవ్వరు ఉహించిఉండరు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో మొత్తం 42 సీట్లు ఉంటె 18 సీట్లు గెల్చుకోవడం ద్వారా బిజెపి అధికారంలో ఉన్న మమతా బెనర్జీకు పెద్ద షాక్ కలిగించారు.

ఇక ఆమె అధికారానికి రోజులు దగ్గర పడ్డాయనే సంకేతాలు ఇచ్చారు. అప్పటి నుండి బిజెపి విశ్రాంతి లేకుండా బెంగాల్ లో తమ ఉనికి చాటుకోవడానికి, బలం పెంచుకోవడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా బెంగాల్ లో ఎనిమిది దశలలో ఎన్నికల నిర్వహణకు కమీషన్ నిర్ణయించడం పలు విమర్శలకు కూడా కారణం అవుతున్నది. బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోందని మమతా ఆరోపించారు. “ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈ నిర్ణయమా? వారి ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? బెంగాల్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చే ముందే అసోం, తమిళనాడు ప్రచారాన్ని ముగించుకోవచ్చన్న భావనా? అలా కుదరదు. ఈ ఐడియా బీజేపీకి కలిసిరాదు. అలా కానివ్వం.” అంటూ మమత తీవ్రంగా విమర్శించారు. మరోవంక మమతా శిబిరం కూడా వరుసగా ఎదురు దెబ్బలు తింటూ వస్తున్నది.

కీలకమైన పలువురు నేతలు ఆమె నుండి విడిపోయి బీజేపీలో చేరారు. గతంలో నగర ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో సహితం ఉనికి చాటుకొంటున్నది. మమతాను ఎదిరించగల సత్తా తమకు మాత్రమే ఉన్నదనే సంకేతం ఇవ్వడంలో విజయం సాధించడంతో కాంగ్రెస్, సిపిఎం మద్దతు దారులు క్షేత్రస్థాయిలో బిజెపిలో చేరడమే ఆ పార్టీ విజయరహస్యం అని చెప్పవచ్చు. అధికారం తమదే అని చెబుతున్నప్పటికీ బెంగాల్ లో బిజెపికి అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు సొంతగా లేరు. కేవలం ఫిరాయింపుదారులతో బలం పెంచుకోవడం సాధ్యం కాదని 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అనుభవం స్పష్టం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైసిపి నుండి ఫిరాయింపులను ప్రోత్సహించి 23 మంది ఎమ్యెల్యేలను చేర్చుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

అయితే ప్రజలు ఆ 23 మందిని 2019 ఎన్నికలలో తిరస్కరించారు. ఇదొక్క విధంగా ఫిరాయింపుదారులతో బలం పెంచుకోవాలని చూసే వారికి గుణపాఠం కావాలి. అయితే బెంగాల్ లో ఇప్పుడు బిజెపి కేవలం అటువంటి వారిపైననే ఆధారపడుతుంది. ఈ పరిస్థితులు బీజేపీలో కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న, అందుకోసం వ్యక్తిగతంగా ఎన్నో తయాలు చేసిన పార్టీ నేతలు ఇప్పుడు తమను పక్కకు నెట్టివేస్తున్నారనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నేతలు ఎన్నికల సమయంలో మౌనంగా ఉంటె మొత్తం పార్టీ యంత్రాంగం కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. అందుకనే ఒక దశలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ ఇన్ ఛార్జ్ కైలాష్ వర్గీస్ ఇక ౠఫిరాయింపులకు స్వస్తి పలుకుతున్నాం’ అని ప్రకటించారు కూడా. అయితే ఆ మాటపై నిలబడలేదు అనుకోండి.

నేడు బెంగాల్ లో బిజెపి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాత, కొత్త తరం వారిని ఏ విధంగా కలసి పనిచేసేటట్లు చేయడం అని. మరోవంక, బిజెపి నేతలు ఎవ్వరు ప్రజా ఉద్యమాల నుండి వచ్చినవారు కారు. అత్యధికులు వ్యాపార వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. ఆర్ధిక లావాదేవీలే చాలామందికి బిజెపి ఆకర్షణీయంగా మారింది. మరోవంక మమతా బెనర్జీ వీధి పోరాటాల లో ఆరితేరిన వారు. తమకు ఎదురులేదనుకొంటూ 34 ఏళ్లపా టు ఏకఛత్రాధిపత్యం వహించిన వామపక్షాలనే మట్టికరిపించారు. వీధిపోరాటాలలో ఆమెను బిజెపి ఏ విధంగా ఎదుర్కొంటుంది? అనే అంశంపై ఎన్నికల ఫలితాలు ఆధార పడగలవు. ఆమె పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొనడం, గతంలో కాంగ్రెస్, వామపక్షుల ప్రభుత్వాలు అనుసరించిన నిరంకుశ విధానాలనే ఆమె అనుసరిస్తూ ఉండడం కారణంగా ప్రజలలో కొంత వ్యతిరేకత పేరుకు పోవడం స్పష్టంగా కనిపిస్తున్నది.

కానీ ఒక నాయకురాలిగా ప్రజాభిమానంలో ఆమెతో పోటీ పడగల నేతలు ఎవ్వరు నేడు బెంగాల్ లో లేరన్నది వాస్తవం. ఆమె ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఆమెపై వ్యక్తిగతంగా రాలేదు. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అవినీతి పరుడిగా బిజెపి చిత్రీకరిస్తున్న ఇప్పటి వరకు ఒక్క నిర్ధుష్టమైన ఆరోపణ కూడా చేయలేక పోయారు. బొగ్గు మాఫియాతో సంబంధం ఉన్నదంటూ సిబిఐ వారు అతని భార్యను ఇంటికి వెళ్లి ప్రశ్నించినా ఎన్నికల ముందు ఇటువంటి సంఘటనలు ఒక విధంగా సానుభూతికి దారితీసే అవకాశం లేకపోలేదు.

మరోవంక డ్రగ్స్ కేసులో బిజెపి యువమోర్చ నాయకురాలు పమేలా గోస్వామి అరెస్ట్ కావడంపై రాజకీయ రంగు పూసే ప్రయత్నాలు ఫలించలేదు. స్వయంగా ఆమె తండ్రినే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు వెల్లడైనది. పైగా, అమిత్ షాకు సన్నిహితుడైన కీలక నేత రాకేష్ సింగ్ పేరు ఇందులో రావడం ఒక విధంగా బిజెపి నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడవేసింది. ఈ ఎన్నికలను బెంగాల్ కుమార్తె’కు, ౠబయటి వారికి’ మధ్య జరుగుతున్న పోరాటంగా మమతా చిత్రీకరిస్తున్నది. స్వతంత్ర ఉద్యమంలో విశేషంగా పనిచేసిన బెంగాల్ సెంటిమెంట్ ఆమెకు ఏమేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

రవీంద్ర నాథ్ టాగోర్ వలే గడ్డం పెంచుకోవడం, నేతాజీ జయంతిని ౠపరాక్రమ దివస్’గా ప్రకటించడం, ౠజై శ్రీరామ్’ నినాదాలను ప్రతిధ్వనింప చేయడం ద్వారా బెంగాల్ ప్రజలలో అటువంటి సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. బెంగాల్ ప్రజల సెంటిమెంట్ గురించి బిజెపి నాయకత్వానికి ఏమాత్రం అవగాహన ఉన్నదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నడో నేతాజీని ౠదేశ్ నాయక్’ అని రవీంద్రనాథ్ టాగోర్ అభివర్ణించారు. అప్పటినుండి నేతాజీ జయంతిని బెంగా ల్ ప్రజలు ౠదేశ్ నాయక్ దివస్’ గా జరుపుకొంటున్నారు. ఇప్పుడు బిజెపి వచ్చి ౠపరాక్రమ దివస్’ అని పిలుస్తున్నారు.

అదే విధంగా దేశం అంతా ౠజైశ్రీరామ్’ అని నినాదాలు ఇస్తుంటే, శ్రీరాముడు, సీత లను కలుపుతూ ౠజైసీరాం’ అంటూ నినాదాలు ఇవ్వడం బెంగాల్ ప్రజల అలవాటు. ఇవ్వన్నీ చూస్తుంటే బెంగాల్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించడానికి బిజెపి విఫలయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా బెంగాల్ రాజకీయాలలో నూతన వరవడి ఈ ఎన్నికలు దారితీయనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News