Tuesday, April 30, 2024

నిరంకుశ సవరణ!

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటును ఎందుకు ఉపయోగించుకొంటున్నదో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) (నియామకం, సర్వీసు నిబంధనలు) చట్టం సవరణ బిల్లును ఆమోదింప చేసుకొన్న తీరును గమనిస్తే అర్థమవుతుంది. మొన్న రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం వీరి నియామకాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్రకు ఎటువంటి అవకాశం వుండదు. కేవలం ప్రధాని, ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేదా అతి పెద్ద ప్రతిపక్ష నేత వుండే కమిటీ సిఫారసు మేరకే వీరి నియామకాలు జరుగుతాయి. ఈ చట్ట సవరణకు ముందు కేంద్ర ప్రభుత్వం సిఫారసుపై రాష్ట్రపతి ఈ నియామకాలను జరిపేవారు. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటో అర్థం కానిది. ఇందు కోసం పాత చట్టానికి ఒక సవరణను తెచ్చారన్నదే కొత్త విషయం తప్ప ఎన్నికల కమిషనర్ల నియామక రీతిలో ఇతరత్రా వస్తున్న మార్పు అంటూ ఏమీ వుండదు. ఈ మాత్రం దానికి కొత్తగా ఎందుకు ఈ చట్ట సవరణను తీసుకు రావలసి వచ్చింది అనేది కీలకమైన ప్రశ్న. గత మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన అత్యంత ప్రజాస్వామికమైన తీర్పే ఇందుకు కారణమని బోధపడుతున్నది. ఆ తీర్పులో అప్పటి వరకు జరుగుతున్న సిఇసి, ఇసిల నియామకం తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది.

దేశంలో ఎన్నికలను ఒక స్వతంత్రమైన కమిషన్ నిర్వహించాలని రాజ్యాంగ సభ చర్చల్లో ఏకాభిప్రాయం ఏర్పడిందని జస్టిస్ కెఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆ తీర్పులో పేర్కొన్నది. ఈ కమిషన్‌కు జరుగుతున్న నియామకాల తీరు దాని స్వతంత్రతను ప్రతిబింబించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పద్ధతి రాజ్యాంగ మౌలిక విలువలను, ప్రజాస్వామ్య చైతన్యాన్ని, చట్టబద్ధతను కాలరాస్తున్నదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామక అధికారాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలో వుండడం దుష్ఫలితాలను ఇస్తుందని కూడా వ్యాఖ్యానించింది. అరుణ్ గోయెల్‌ను మెరుపు వేగంతో 24 గంటల్లో ఇసిగా నియమించిన తీరును రాజ్యాంగ ధర్మాసనం 2022 నవంబర్‌లో జరిపిన విచారణలో తూర్పారబట్టింది. గోయెల్ నియామక ఫైలును సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంటు చేసే చట్టానికి లోబడి రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని రాజ్యాంగం 324 (2) అధికరణ నిర్దేశిస్తున్నది. అయితే పార్లమెంటు అంత వరకు ఎటువంటి చట్టం చేయలేదన్న సందును వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వమే తన ఇష్టం వచ్చిన వారిని సిఇసిగా నియమిస్తూ ఒక తంతు మాదిరిగా దేశంలో ఎన్నికల నిర్వహణను జరిపిస్తూ వచ్చింది.

గత మార్చి నాటి తీర్పులో సుప్రీం కోర్టు మొదటి సారిగా దీనికి స్వస్తి చెప్పే ప్రయత్నం చేసింది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధాని, ప్రతిపక్ష నేత లేదా ప్రతిపక్షంలోని అతి పెద్ద పార్టీ నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫారసు మేరకు జరపాలని ఆ తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. అలా జరగడం వల్ల పాలక పక్ష స్వార్థానికి ఈ నియామకాల తీరు బలి కాకుండా వుంటుంది. వీలైనంత మేరకు సమర్థులైన వ్యక్తులు సిఇసిలుగా, ఇసిలుగా నియమితులై దేశంలో ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, లోపరహితంగా జరిగి ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ తీర్పుతో తీవ్ర అసంతృప్తి చెంది పార్లమెంటు చట్టం అనే దాని ముసుగులో తన స్వప్రయోజన కాండకు ఎటువంటి విఘాతం లేని రీతిలో ఈ నియామకాలు కొనసాగేటట్టు చేసుకోదలచింది. అందుకే తాజా సవరణ బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లులో సూచించిన ప్రకారం సిఫారసుల కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర వుండదు. ప్రధాని, ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేతతో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు సభ్యుల అభిప్రాయం మెజారిటీ అభిప్రాయమవుతుంది.

ప్రతిపక్ష నేతను మినహాయిస్తే మిగతా ఇద్దరు కేంద్ర పాలకులే అవుతారు. అందుచేత వారిదే పైచేయి అవుతుంది. పూర్వపు నియామక విధానంలో కేంద్రం కోరుకొన్న వారిని సిఇసిగా, ఇసిలుగా ఏ విధంగానైతే నియమించుకొంటూ వచ్చిందో సవరణ చట్టం ద్వారా ఏర్పాటయ్యే సిజెఐ రహిత కమిటీ ద్వారా కూడా కేంద్ర పాలకుల అభీష్టమే నెరవేరుతుంది. ఆ విధంగా పార్లమెంటు చేత కూడా తమ నిరంకుశత్వానికే ఆమోద ముద్ర వేయించుకోడం ఈ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశమని బోధపడుతున్నది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పార్లమెంటు ద్వారా వమ్ము చేయించిన ఘనత ఈ విధంగా ప్రధాని మోడీ ప్రభుత్వానికి దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News