Monday, April 29, 2024

మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి

- Advertisement -
- Advertisement -

Amit-Shahs-And-Modi

ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసమర్థతే కారణమని శివసేన వ్యాఖ్యానించింది. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ చరిస్మా వల్లే బిజెపి భారీ విజయాన్ని సొంతం చేసుకోగలిగిందని, కాని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక నాయకుడి కారణంగానే గట్టి పోటీని ఎదుర్కుంటూ వరుస ఓటములను మూటగట్టుకుంటోందని బుధవారం తన సొంత పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది.

గత ఐదేళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిలో చేపడుతున్న ఆదర్శవంతమైన అభివృద్ధి కార్యక్రమాలను తాము బలపరుస్తున్నామని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపు తమకు ఆశ్చర్యకరమేమీ కాదని శివసేన పేర్కొంది. ఢిల్లీ ఎన్నికలను హోం మంత్రి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారే తప్ప ప్రధాని మోడీ కాదని శివసేన అభిప్రాయపడింది. బిజెపి పగ్గాలను జెపి నడ్డా ఇటీవలే చేపట్టారని, కాని అసలు బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని ఆ పార్టీ వ్యాఖ్యానించారు. తన పదవీకాలం పూర్తయ్యేలోగా ఒక్క ఎన్నికైనా గెలవాలని అమిత్ షా ఆశించారని, అయితే జార్ఖండ్, మహారాష్ట్రలో పరాజయం పాలయ్యారని సేన పేర్కొంది. దేశ రాజధానిలో ఆప్ జెండా ఎగురుతుండగా దేశ ఆర్థిక రాజధానిలో శివసేన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని పత్రిక పేర్కొంది.

మేము చెప్పిందే పాలన అనే విధంగా అహంకారం, నిర్లక్ష వైఖరే ఢిల్లీలో బిజెపి పరాజయానికి కారణమని శివసేన విమర్శించింది. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం అభివృద్ధిపైనే దృష్టి పెట్టగా ఏకీకరణ కోసం బిజెపి చేసిన ప్రయత్నాలను రాజధాని ప్రజలు తిప్పికొట్టారని శివసేన వ్యాఖ్యానించింది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బిజెపి గెలుచుకోగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయమని అడిగిన కేజ్రీవాల్‌లో ఓటర్లు ప్రత్నామ్నాయం చూశారని శివసేన వివరించింది.

 

Amit Shahs failure not PM Modis, Shiv Sena blames Amit Shah for the Delhi poll debacle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News