Friday, April 26, 2024

ఎపి పాలనా రాజధాని విశాఖ

- Advertisement -
- Advertisement -

ఎపి శాసన రాజధానిగా అమరావతి
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం
న్యాయ రాజధానిగా కర్నూలు, సిఆర్‌డిఎ రద్దు 

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో సిఆర్‌డిఎ 2014 రద్దు, వికేంద్రీకర-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్ తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం విదితమే. రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఎఎస్ జిఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ 2019 డిసెంబర్ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. తదుపరి న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ ఇదో గొప్ప పరిణామని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఎపికి వస్తానంటూ ట్వీట్ చేశారు.

AP Governor Approval to 3 Capital bill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News