Friday, April 26, 2024

నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Counterfeit Currency Gangs

 

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్‌టాప్, ప్రింటర్, పేపర్‌బండిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మెహిదిపట్నం, హెరిటేజ్ సూపర్ మార్కెట్ ప్రాంతానికి చెందిన బివి శివ సందీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎండి అక్బర్ పాషా ప్రైవేట్ ఉద్యోగి. మహ్మద్ మోయిన్ మెడికల్ ఉద్యోగం, ఎండి రాజుద్దిన్ మిల్క్ సప్లయర్‌గా పనిచేస్తున్నారు.

నలుగురు కలిసి నకిలీ కరెన్సీ రూ.2000, రూ.500 తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8.5లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక ఒరిజినల్ నోటుకు రెండు నకిలీ నోట్లు ఇస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు నలుగురు నిందితులు నకిలీ కరెన్సీని తయారు చేసి మాయమాటలు చెప్పి కట్టబెడుతున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్‌ఐ శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, నరేందర్ నిందితులను అరెస్టు చేశారు.

నార్త్ జోన్‌లో…
నకిలీ కరెన్సీని జగదీష్ మార్కెట్, అబిడ్స్‌లో చెలామణి చేస్తున్న ఆరుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మైనర్ బాలురు కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.9,27,000నకిలీ కరెన్సీ , కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే పెపర్, ఒరిజినల్ కరెన్సీ రూ.10,500, ఆరు మొబైల్ ఫోన్లు, స్కానర్లు, పేపర్ కటింగ్ మిషన్లు, ప్లాస్టర్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. సంఘారెడ్డి జిల్లా, భువనేశ్వర్ నగర్‌కు చెందిన ఇషాక్ బిన్ సలేహ్ స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు, బండారి గౌతమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎండి సోహైల్ అలీ గార్మెంట్స్ సేల్స్ వ్యాపారం, ఎండి గౌసుద్దిన్ ప్రైవేట్ ఉద్యోగం, అబ్రార్ ఖాన్, సయిద్ ఖాసిఫ్ బహదూర్ విద్యార్థి, ముగ్గురు మైనర్లు కలిసి నకిలీ కరెన్సీని ముద్రించి మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఇషాక్ బిన్ సలేహ్ పదోతరగతి వరకు చదువుకున్నాడు, భండారీ గౌతమ్ కంప్యూటర్స్‌లో డిప్లొమా చేశాడు.

ఇద్దరు కలిసి నకిలీ నోట్లను తయారు చేసేందుకు శిక్షణ పొందారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. 100,200 నోట్లను తయారు చేసి చెలామణి చేస్తున్నారు. వీరు జగదీష్ మార్కెట్‌లో చెలామణి చేస్తుండడంతో పోలీసులు పట్టుకుని విచారించగా ముఠా నాయకుల విషయం బయటపడింది. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్, శ్రీకాంత్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

Arrest of Counterfeit Currency Gangs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News