Monday, April 29, 2024

మూడో టెస్టులో పట్టు బిగించిన ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

Australia 103/2 at stumps on Day 3 against India

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు పట్టుబిగించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు 197 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకోవడం టీమిండియాకు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో రోజు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ మూడో రోజు మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో విఫలం కావడంతో మ్యాచ్‌లో పట్టు కోల్పోయింది. ఇక నాలుగో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను సాధ్యమైనంత త్వరగా కుప్పకూల్చితే తప్ప టీమిండియా ఈ మ్యాచ్‌లో మళ్లీ పుంజుకోవడం కష్టమే. మరోవైపు 96/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ అజింక్య రహానె నిరాశ పరిచాడు. రెండో టెస్టులో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచిన రహానె ఈసారి మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయాడు. 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక తర్వాత వచ్చిన హనుమ విహారి కూడా విఫలమయ్యాడు. 4 పరుగులు మాత్రమే చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.
పుజారా ఒంటరి పోరాటం
ఒకవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా పోరాటం కొనసాగించాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ 4 ఫోర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో పుజారాతో కలిసి ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. కీలక సమయంలో గాయానికి గురికావడంతో పంత్ ఏకాగ్రత కోల్పోయాడు. దీంతో వికెట్‌ను పారేసుకున్నాడు. ఆ వెంటనే పుజారా కూడా వెనుదిరిగాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా 176 బంతుల్లో ఐదు ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. ఆ తర్వాత భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. అశ్విన్ (10) పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టయిలెండర్లు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 100.4 ఓవర్లలో 244 పరుగుల వద్దే ముగిసింది. దీంతో ఆస్ట్రేలియాకు 94 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక కంగారూ బౌలర్లలో కమిన్స్ నాలుగు, హాజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. మరో ముగ్గురు రనౌటయ్యారు.
ఎదురుదెబ్బ తగిలినా..
తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన యువ ఓపెనర్ పుకోస్కి ఈసారి నిరాశ పరిచాడు. 10 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసిన వార్నర్ ఈసారి కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 16 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 36 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను లబూషేన్, స్మిత్ తమపై వేసుకున్నారు. ఈసారి కూడా ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ శతకంతో కదం తొక్కిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రాణించాడు. 29 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక లబూషేన్ తన జోరును ఈసారి కూడా కొనసాగించాడు. ధాటిగా ఆడిన లబూషేన్ ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 2 వికెట్లకు 103 పరుగులకు చేరింది.

Australia 103/2 at stumps on Day 3 against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News