Tuesday, April 30, 2024

సెమీస్‌లో ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

Australia

 

ఉత్కంఠ పోరులో కివీస్ ఓటమి

మెల్‌బోర్న్: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో కివీస్ సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సర్వం ఒడ్డి పోరాడాయి. అయితే చివరి వరకు ఒత్తిడిని తట్టుకుని నిలబడిన ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయంతో సెమీస్ రేసులో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లు కీలక సమయంలో పొదుపుగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు.
సమష్టిగా పోరాడినా
లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ ముందుకు సాగింది. ఓపెనర్ రాఛెల్ ప్రిస్ట్ మూడు ఫోర్లతో 17 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ సోఫి డివైన్ సమన్వయంతో బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డివైన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించింది. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా డివైన్ కుదురుగా ఆడింది. స్టార్ బ్యాట్స్‌విమన్ సుజి బేట్స్ మాత్రం జట్టుకు అండగా నిలువలేక పోయింది. 14 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డివైన్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు సాధించింది. ధాటిగా ఆడిన మాడి గ్రీన్ రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో వేగంగా 28 పరుగులు చేసింది. ఇక, కాటె మార్టిన్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచినా కివీస్‌ను గెలిపించలేక పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్టిన్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 37 పరుగులు చేసింది. మిగతావారు విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా, మెఘాన్ షుట్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఆదుకున్న మూని
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్ బెథ్ మూని ఆదుకుంది. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మూని స్కోరును పరిగెత్తించింది. సమన్వయంతో ఆడిన మూని ఆస్ట్రేలియాకు గౌరవప్రద స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూని 50 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 60 పరుగులు సాధించింది. కెప్టాన్ మెగ్ లానింగ్ (21), అష్లే గార్డనర్ (20), ఎలిసె పెరీ (21), హెయిన్స్ 19 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. దీంతో ఆస్ట్రేలియా మెరుగైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.

Australia reached semi-finals of Women T20 World Cup
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News