Monday, April 29, 2024

విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు

- Advertisement -
- Advertisement -

Inter exams

 

ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు,
స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు
ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రాంచంద్రన్ విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు మంగళవారం నుంచి ప్రముఖ మానసిక నిపుణులు, స్టూడెంట్ కౌన్సిలర్ డాక్టర్ అనితను 7337225803 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే కళాశాలల్లో నియమించిన స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా స్టూడెంట్ కౌన్సిలర్లు దిశానిర్ధేశం చేసేలా వారికి మానసిక నిపుణులతో శిక్షణ ఇప్పించామని చెప్పారు.

విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 -24600110లో సంప్రదించవచ్చని లేదా helpdesk_ie@telangana.gov.inకు ఈమెయిన్ పంపించవచ్చని తెలిపారు. సోమవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు బుధవారం(మార్చి 4) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి బస్టాప్‌లలో కూడా హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇంటర్ పరీక్షలకు ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఉదయం9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి విద్యార్థులతోపాటు ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా అనుమతించమని తెలిపారు.ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

అందుబాటులో సెంటర్ లొకేషన్ యాప్
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్ లొకేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పెషల్ సిఎస్ వెల్లడించారు. విద్యార్థులు తమ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ద్వారా సెంటర్ లొకేటర్ యాప్ TSBIE m- servicesను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని పేర్కొన్నారు. యాప్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. పరీక్షా కేంద్రం ఫొటోతోపాటు ఆ కేంద్రానికి వెళ్లే మ్యాప్ వస్తుందన్నారు. విద్యార్థుల ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది..?, ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు అనే వివరాలు కూడా వస్తాయి. అలాగే పరీక్ష కేంద్రానికి ఏ రూట్‌లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఇంటర్ హాల్ టికెట్లు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, విద్యార్థులు నేరుగా తమ వెబ్‌సైట్ www. tsbie.cgg.gov.in నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని స్పెషల్ సిఎస్ చిత్రారాచంద్రన్ తెలిపారు. ఇలా ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని చెప్పారు.

నేలమీద పరీక్షలు రాయిస్తే కఠిన చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఏ పరీక్షా కేంద్రాలలో అయినా విద్యార్థులను నేలపై కూర్చుని పరీక్షలు రాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ సారి ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రివియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్– బిఐజిఆర్‌ఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పెషల్ సిఎస్ తెలిపారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

ఫిర్యాదు చేయడానికి విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని, విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్‌కు టోకెన్ నెంబర్‌తో ఎస్‌ఎంఎస్ వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారికి, ఉన్నతాధికారులకు సమాచారం వెళుతుందని చెప్పారు. విద్యార్థుల ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చని. విద్యార్థుల ఫిర్యాదులను నిర్ధిష్ట కాలపరిమితితో రెండు మూడు రోజుల్లో పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Inter exams from tomorrow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News