Thursday, May 16, 2024

అక్రమ రేషన్‌కార్డులకు కత్తెర..

- Advertisement -
- Advertisement -

Authorities are removing illegal Ration cards in Hyderabad

వారం రోజుల నుంచి గుర్తిస్తున్న అధికారులు
20శాతం ఉన్నట్లు గతంలోనే గుర్తించిన పౌరసరఫరాల శాఖ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్డులు మంజూరు
ప్రతి నెల 15శాతం కార్డుదారులు సరుకులకు దూరం

మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో అక్రమ రేషన్‌కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు దరఖాస్తులు పరిశీలిన చేస్తుండగా ముందుగా అక్రమంగా పొందిన కార్డుల గుర్తింపు, మృతి చెందిన వారిని వివరాలు సేకరిస్తూ వెంటనే జాబితా నుంచి తీసివేస్తున్నారు. తరువాత నాలుగేళ్ల కాలంలో ఆన్‌లైన్ ద్వారా చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి జూలై రెండో వారంలోగా అర్హుల లిస్టును విడుదల చేసేందుకు సిద్దమైతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఉచితంగా రేషన్ పంపిణీ చేయడంతో కోటీశ్వరులు సరుకులు తీసుకుని బ్లాక్ మార్కెట్‌లో బియ్యం తరలించారు. ఓటిపి విధానం అమలు చేసిన తరువాత సరుకులు తీసుకునేందుకు ప్రతినెల 15శాతం మంది కార్డుదారులు దుకాణాల వద్దకు రావడంలేదని డీలర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు స్దానికంగా ఉండే ప్రజలు అక్రమంగా కార్డు తీసుకున్న వారిపై ఫిర్యాదులు రావడంతో వాటిని గుర్తించి తొలగించేందుకు ఉన్నతాధికారుల ముందు గతంలో చిట్టా పెట్టగా అనుమతి ఇస్తే కత్తెర పెడుతామని పలుమార్లు చెప్పారు.

తాజాగా అక్రమ కార్డుల జాబితాను సిద్దం చేసి తొలగించాలని సూచించడంతో ఆదిశగా ముందుకు వెళ్లుతున్నట్లు పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు మరణించివారి పేరు తొలగిస్తామని,వారి పేరుమీద కూడా రేషన్ తీసుకున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంత ఇళ్లు, వాహనాలు, ప్రభుత్వ ఉద్యోగం, ఏడాదికి రూ. 5లక్షలకు మించి బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ఆహార భద్రత కార్డులకు అర్హులుకారు. కానీ కొంతమంది కోట్లాది రూపాయల ఆస్తులున్న రేషన్ కార్డుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు రాజకీయ పైరవీలు చేసి పొందారని వారికి మంగళం పాడుతామని జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 5,80,634, రంగారెడ్డి జిల్లాలో 5,24,580, మేడ్చల్ లో 4,94,842 కార్డులున్నాయి. వీటిలో 20శాతానికి పైగా కార్డుదారులు ధనవంతులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోని వారి కార్డు కట్ చేస్తామని, తరువాత ఇప్పటివరకు తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలించి, అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News