Friday, April 26, 2024

ఇంటి ముందు పార్కింగ్‌కూ ఫీజు

- Advertisement -
- Advertisement -

Bengaluru gets new parking policy

వాణిజ్య ప్రాంతాల్లో ఆపితే మరింత మోత
స్కూలు బస్సులు, సిటీ బస్సులకూ తప్పని బాదుడు
బెంగళూరు పార్కింగ్ పాలసీకి కర్నాటక సర్కార్ ఆమోదం

బెంగళూరు: బెంగళూరులో ఇకముందు ఇంటిముందు కారు పార్కు చేసినా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరు మహానగరం కోసం డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ (డియుఎల్‌టి) రూపొందించిన పార్కింగ్ పాలసీ 2.0కు ఎట్టకేలకు కర్నాటక పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. దీంతో రాబోయే రోజు ల్లో నగరంలో రోడ్‌సైడ్ పార్కింగ్ ఫీజు తడిసి మోపెడంత కానుంది. డియుఎల్‌టి రెండేళ్ల క్రితం రూపొందించిన ఈ పార్కింగ్ విధానం ఎన్నో మార్పులు, చేర్పుల తర్వాత చివరికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం పొందింది. త్వరలో ఈ విధానం అమలులోకి రానుంది. దీని ప్రకారం వాణిజ్య ప్రాంతాలు, నివాస ప్రాంతాలతో సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వాహనాలకు పే అండ్ పార్కింగ్ విధానం కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం ఒక వ్యక్తి తన ఇంటి ముందు వాహనం పార్క్ చేయాలన్నా వార్షిక అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

చిన్న కార్లకయితే వెయ్యి రూపాయలు, మీడియం కార్లకు రూ. 3,000, ఎస్‌యువి లాంటి పెద్ద కార్లకు రూ.4,000 వార్షిక ఫీజుగా డియుఎల్‌టి నిర్ణయించింది. ఇక రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్లకు రూ.5,000 ఫీజును డియుఎల్‌టి నిర్ణయించింది, గృహాల యజమానులు ఈ పర్మిట్లను ఏడాదికి, లేదా మూడు నెలలకోసారి చొప్పున కొనుగోలు చేయవచ్చు. కాగా వాణిజ్య ప్రాంతాల్లో కమర్షియల్ పార్కింగ్ ఫీజు ప్రాంతాన్ని బట్టి 1.5నుంచి 3 రెట్లు ఎక్కువ ఉంటుందని ఈ కొత్త విధానంలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే వీధుల్లో గంటకు మించి పార్కింగ్ చేసే వాహనాలకు పార్కింగ్ ఫీజును పెంచాలని ఆ పాలసీ సిఫార్సు చేసింది. అయితే సైకిళ్ల కోసం నిర్ణయించిన ప్రదేశాల్లో పార్కు చేసే సైకిళ్లకు మాత్రం ఎలాంటి ఫీజూ ఉండదు.

స్కూలు బస్సులు, నిర్మాణ సంస్థల వాహనాలు, సిటీ సర్వీస్ బస్సులు, క్యాబ్ కార్లు, రవాణా వాహనాలు నిలిపేందుకు ఆ సంస్థలనుంచి బల్క్ పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. అంతేకాదు, షేరింగ్ పద్ధతిలో నడిచే వాహనాలు, డెలివరీ ఏజంట్లు లాంటి వారికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. ముందుగా ముసాయిదా ప్రణాళికలను రూపొందించి బృహత్ బెంగళూరు నగర పాలిక( బిబిఎంపి), బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను సంప్రదించిన తర్వాత ఈ విధానానికి తుది రూపం ఇస్తారు.

Bengaluru gets new parking policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News