Sunday, May 5, 2024

ఖేదం, మోదం

- Advertisement -
- Advertisement -

Bharatiya Janata Party got two opposite election result

 

బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల శాసన మండలి ఎన్నికలది కాగా, రెండోది రాజస్థాన్ పంచాయతీ బ్యాలట్‌కు సంబంధించినది. శాసన మండలి ఎన్నికల ఫలితాలు విద్యావంతులైన ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తాయి, పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు గ్రామీణులు, అంతగా విద్యావంతులు కాని వారు అనేది తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర శాసన మండలిలోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగింటిని శివసేన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కాంగ్రెస్‌ల పాలక కూటమి (మహావికాస్ అఘాదీ) గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయంతో సంతృప్తి చెందవలసి వచ్చింది. మిగతా ఒక్క సీటు స్వతంత్ర అభ్యర్థి కైవసమైంది. ఎన్నికలు జరిగిన ఈ ఆరింటిలో నాలుగు పట్టభద్రుల నియోజక వర్గాలు, రెండు ఉపాధ్యాయ స్థానాలు.

రెండేళ్లకోసారి జరిగే ఈ నియోజక వర్గాల ఎన్నికల్లో ఈసారి 12 లక్షల మంది పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయమున్న నాగపూర్ కేంద్రస్థానమైన పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటమి బిజెపికి అసాధారణమైన నష్టం అని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర ఫడ్నవీస్ గతంలో ఈ నియోజక వర్గం నుంచి బిజెపి తరపున ఎన్నికయ్యారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు గడ్కరీ నాగపూర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. కమలనాథుల అత్యంత పటిష్ఠ స్థానమైన నాగపూర్ వారి చేతుల్లో నుంచి జారిపోయి 55 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ కైవసం కావడం విశేషం. పుణె నుంచి ఎన్నికలు జరిగిన రెండు కౌన్సిల్ స్థానాలూ పాలక కూటమి వశమయ్యాయి. ఫడ్నవీస్ స్వయంగా ఈ నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా బిజెపికి మేలు జరగలేదు. ఈ రెండింటిలో ఒక దానిని కాంగ్రెస్, మరో దానిని ఎన్‌సిపి సొంతం చేసుకున్నాయి.

శివసేన సొంత ప్రయోజనాలకు పాకులాడకుండా పాలక కూటమిలోని మిగతా రెండు భాగస్వామ్య పక్షాల గెలుపు కోసం పని చేయడం విశేషం. శాసన మండలి ఎన్నికల్లో ఇంత పరాజయాన్ని తాము ఊహించలేదని పాలక కూటమి బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్య గమనించదగినది. ఉత్తరప్రదేశ్ శాసన మండలిలోని 11 స్థానాలకు ఈ నెల మొదట్లో జరిగిన ఎన్నికల్లోనూ బిజెపి చెప్పుకోదగిన విజయాలు సాధించలేకపోయింది. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ దానికి గట్టి పోటీ ఇచ్చింది. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలోనూ ఉపాధ్యాయ, పట్టభద్ర స్థానాలు రెండింటినీ బిజెపి నుంచి ఎస్‌పి కైవసం చేసుకుంది. ఇది యుపిలో ఎస్‌పి మళ్లీ పుంజుకుంటున్నదని రుజువు చేస్తున్నది. కీలకమైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల శాసన మండలి ఎన్నికల్లో పరాజయం భారతీయ జనతా పార్టీకి ఖేదం కలిగించగా రాజస్థాన్ పంచాయతీ సమితుల, జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ కంటే పైచేయి కావడం దానికి సంతృప్తినిచ్చింది.

ఢిల్లీలో 17 రోజులుగా సాగుతున్న సంఘటిత రైతు ఉద్యమం పార్టీ అగ్ర నాయకత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ గ్రామీణ ఎన్నికల విజయం దానికెంతో ఊరటను కలిగించింది. రైతులు తమ వైపే ఉన్నారని తాము తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వారు ఆమోదిస్తున్నారని చెప్పుకోడానికి ఉపయోగపడింది. అయితే రాజస్థాన్ ఎన్నికలు మొత్తం అన్ని జిల్లాల్లోనూ జరగలేదు. ఆ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. అందులో 21 జిల్లాల్లోనే ఈ ఎన్నికలు జరిగాయి. ఇంకా 12 జిల్లాల్లో నియోజకవర్గాల పునర్విభజన పై పేచీ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ పన్నెండింటిలో ముఖ్యమంత్రి సొంత జిల్లా జోద్‌పూర్ కూడా ఉంది. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 1852 స్థానాలు గెలుచుకోగా దానికంటే ఎక్కువగా బిజెపి 1989 సీట్లు సొంతం చేసుకున్నది. అక్కడ గత 15 ఏళ్లలో ఈ ఎన్నికల్లో పాలక పక్షానిది కింది చేయి కావడం ఇదే మొదటి సారి.

ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు, మాజీ ఉప ముఖ్యమంత్రి పైలట్‌కు మధ్య నెలకొన్న తీవ్రమైన విభేదాల ప్రభావంతో పాటు కాంగ్రెస్‌లో అన్ని స్థాయిల్లో గల అసమ్మతి దాని ఓటమికి కారణమని భావిస్తున్నారు. మహారాష్ట్ర, యుపి శాసన మండలి ఫలితాలు గాని, రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల తీర్పును గాని ఇటీవల జరిగిన బీహార్ శాసన సభ ఎన్నికల్లో వెల్లడైన అక్కడి ప్రజల అభీష్టాన్ని గాని గమనిస్తే బిజెపికి ఎదురులేని స్థితి లేదని స్పష్టపడుతుంది. దాని మతతత్వ ఎజెండాను ప్రజలు ఒక్క కంఠంతో సమర్థించడం లేదని ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రతిఫలనంగానే ఫలితాలు వస్తున్నాయని అర్థం చేసుకోవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News