Wednesday, May 1, 2024

బాధ్యతాయుత స్వీడన్ ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

Sweden is corruption-free Ethical Responsible Democracy

 

స్వీడన్ అవినీతి రహిత, నైతిక విలువల, బాధ్యతాయుత ప్రజాస్వామ్యం. పారదర్శక సమాజం. స్వీడిష్ ప్రజలు జాతీయతకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అంతర్జాతీయతనూ సమానంగా గౌరవిస్తారు. 42 ఏళ్ల ఫ్రెడ్రిక్ ఎరిక్ ఫెడర్లీ స్వీడన్ రాజకీయవాది. ఐరోపా ఉదారవాద ప్రజాస్వామ్యవాదుల కూటమిలో భాగస్వామి అయిన సెంటర్ పార్టీ సభ్యుడు. సెంటర్ పార్టీ ప్రస్తుత స్వీడన్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. ఫెడర్లీ ఒరెబ్రొ యూనివర్శిటీలో రాజకీయ, న్యాయ శాస్త్రాలు చదివారు.

నార్ట్లెడ్జ్ టిడ్నింగ్ వార్తా పత్రికలో రాజకీయ సంపాదకునిగా పని చేశారు. 1997, ‘98లలో స్వీడన్ సైన్యంలో బాధ్యతలు నిర్వహించారు. 1998లో సోడర్మన్లాండ్ రాష్ట్రం, వాస్త్మన్లాండ్ జిల్లా కుంగ్సోర్ మునిసిపాలిటి కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయారు. సెంటర్ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. 2002 నుండి 2007 వరకు యూత్ లీగ్ అధ్యక్షులు. 2006 నుండి 2014 వరకు స్వీడన్ పార్లమెంటు సభ్యుడు. స్వీడన్ నుండి ఐరోపా పార్లమెంటు సభ్యునిగా 01.07.2014న తొలిసారి, 2019లో రెండోసారి ఎన్నికై కొనసాగుతున్నారు. 2019 జులై నుండి ఐరోపా పార్లమెంటులో రెన్యు యూరోప్ గ్రూప్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

స్వీడన్‌లో పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రతల కమిటీ, మత్స్య కమిటి, రవాణాలో పశు సంరక్షణ కమిటీ, స్విట్జర్లండ్- నార్వేల సత్సంబంధాల సహకార ప్రతినిధివర్గం, యూరోపియన్- యూనియన్ ఐస్లాండ్‌ల సంయుక్త పార్లమెంటరీ కమిటీ, ఐరోపా ఆర్థిక అంశాల సంయుక్త పార్లమెంటరీ కమిటీల సభ్యుడు. పరిశ్రమలు, పరిశోధనలు, ఇంధనాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కమిటీలలో, చైనా సంబంధాల ప్రతినిధి వర్గంలో ప్రత్యామ్నాయ సభ్యుడు. ఇటీవల హంగరీలో మధ్యలింగ వ్యక్తుల హక్కుల ఉల్లంఘనపై చట్టాన్ని ప్రతిపాదించారు. చిన్న, మధ్య తరహా వాణిజ్యాలకు మద్దతుగా తాత్కాలిక సహాయ పథకం, వాతావరణ మార్పుకు అనుకూలంగా పథకాలను రూపొందించడంలో యూరోపియన్ -యూనియన్ వ్యూహాలను తయారు చేశారు.

స్వీడన్ వ్యభిచార చట్టాల ప్రకారం లైంగిక సుఖాలు అందించడానికి శరీర వినియోగాన్ని అమ్మడం నేరం కాదు. ఆ సుఖాలను కొనడం నేరం. ఈ నేరానికి 6 నెలల శిక్ష పడుతుంది. 01.07.2011 నుండి ఈ శిక్షను ఏడాదికి పెంచాలని స్వీడన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. చర్చలో ఈ నిర్ణయానికి అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక సభ్యుడు ఫెడర్లీ. తన పార్టీ ఒత్తిడికి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. డబ్బు చెల్లించి లైంగిక సుఖాలను కొన్న మహిళను ఆమె ఆమోదం లేకుండా తాకడం, ఆమెతో శృంగారంలో పాల్గొనడం స్వీడన్ చట్టాల ప్రకారం నేరం. అమెరికా రహస్య సైనిక కుట్రలను బయటపెట్టిన వికిలీక్స్ వీరుడు జూలియన్ అసాంజే (యూలియన్ అసానే) మీద మోపిన నేరం ఇదే. ఈ అసంబద్ధ నేరాలలో శిక్షను పెంచడం అసమంజసమని ఫెడర్లీ అభిప్రాయం.

2007లో మిత్రుడు పెసిన్స్కితో కలిసి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లో ఒక సలాడ్ బార్ ప్రారంభించారు ఫెడర్లీ. అయితే త్వరలోనే దివాలా తీశారు. బార్ భవన యజమాని అంగీకరించిన సౌకర్యాలను ఏర్పాటు లేదని అద్దె చెల్లించడం మానేశారు. కాని ఫెడర్లీ అధికార దర్పం చూపలేదు. తర్వాత భాగస్వాములు ఇద్దరూ ఆ యజమానికి 3 లక్షల క్రోనార్లు (స్వీడన్ కరెన్సీ క్రోనార్ – దాదాపు రూ. 24 లక్షలు) చెల్లిస్తామని స్టాక్ హోమ్ జిల్లా కోర్టులో ఒప్పందం చేసుకున్నారు. నష్టపోయినా న్యాయానికి కట్టుబడ్డారు. 2014లో ఫెడర్లీ దూరపు బంధువుకు బాలికల అత్యాచారం కేసులో సుదీర్ఘ జైలు శిక్ష విధించారు. ఈ విషయం కొన్ని రోజుల క్రితమే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఫెడర్లీకి 2020 జూన్‌లో ఈ విషయం తెలిసిందని ఆ ఉత్తరం తెలిపింది. స్వీడిష్ టెలివిజన్, రేడియోలు స్వయంప్రతిపత్తి సంస్థలు. ఈ సంస్థల నిర్వహణకు ప్రతి పౌరుని ఆదాయం నుండి నెలకు 100 క్రోనార్లు (దాదాపు రూ.800లు) తప్పనిసరి పన్నుగా వసూలు చేస్తారు. ఆ డబ్బును ఈ సంస్థలకు నేరుగా చెల్లిస్తారు. ఇవి, ప్రభుత్వంతో సంబంధం, వాణిజ్య ప్రకటనలు లేకుండా, ప్రజలకు బాధ్యత వహించి పని చేస్తాయి.

ఫెడర్లీ వివరాలను సేకరించి బహిర్గతం చేయడంలో టెలివిజన్, రేడియోలు క్రియాశీలకంగా పని చేశాయి. ఫెడర్లీ బయట తిరగలేనని, పత్రికలను ఎదుర్కొనలేనని ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనారోగ్య సెలవుపై ఉన్నానని పార్టీకి తెలిపారు. బంధువు శిక్ష విషయాన్ని ఫెడర్లీ దాచాడని, తమ ప్రతినిధిగా, తమ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించాడని, తన విశ్వాసాన్ని కోల్పోయాడని స్వీడన్ ప్రజలు గొడవ చేశారు. ఈ విషయం పార్టీకి తెలియదని పార్టీ నాయకురాలు అన్నీ లోఫ్ తెలిపారు. ఫెడర్లీపై తగు చర్య తీసుకోడానికి పార్టీ సమాయత్తమవుతోంది. చర్య ప్రకటిస్తామని చెప్పింది. ఫెడర్లీ కోసం వెదుకుతోంది. స్వీడిష్ మితవాద ప్రతిపక్షానికి అనవసర గోలకు అవకాశమే లేదు.

ఫెడర్లీ బంధువు అత్యాచారం- శిక్ష విషయాన్ని మీడియా నిష్పక్షపాతంగా ప్రచారం చేసింది. ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలు సకారాత్మకంగా స్పందించాయి. బంధువు శిక్ష విషయం ముందు తెలిసి ఉంటే ఫెడర్లీని పార్టీ తరఫున అధికారాలకు, పదవులకు పార్టీ ప్రతిపాదించేది కాదు. అభాండ అభియోగి వెంటనే సిగ్గుపడ్డారు. నిరూపణల మాటెత్తకుండా, దోషిలా, పదవుల నుండి తప్పుకోడానికి సిద్ధపడ్డారు. ఎవరి బాధ్యతలు వారు స్వతహాగా, చక్కగా, నిర్వర్తించారు. ఇదీ స్వీడన్ రాజకీయ పార్టీల, నాయకుల నైతికత. మీడియా, ప్రజల అవగాహన, చైతన్యం. ప్రజాస్వామ్య విలువలను పాటించే తీరు. బాధ్యతాయుత స్వీడిష్ ప్రజాస్వామ్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News