Tuesday, April 30, 2024

కర్నాటక అసెంబ్లీ ఫైట్: వరుణలో కురువృద్ధుల కుస్తీ

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కర్నాటకలోని మైసూరు జిల్లాకు చెందిన వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో బిజెపి సీనియర్ నాయకుడు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వి సోమన్నహోరాహోరీ తలపడుతున్నారు. ఇవే తన చివరి ఎన్నికలని ఇదివరకే ప్రకటించిన సిద్దరామయ్య గత ఎన్నికల్లో తన కుమారుడు యతీంద్ర పోటీ చేసి గెలిచిన వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో చివరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 10న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి స్థానం నుంచి గెలిచిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అదే స్థానంలో రెండుసార్లు ఓటమిపాలయ్యారు. అయితే బాగల్‌కోట్ జిల్లాలోని బదామిలో మూడుసార్లు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరిలో జెడిఎస్ అభ్యర్థి జిటి దేవె గౌడ చేతిలో ఓటమిపాలైనప్పటికీ బదామిలో బిజెపి అభ్యర్థి బి.శ్రీరాములుపైన 1,696 ఓట్ల ఆధిక్యతతతో గెలుపొందారు. వరుణలో బిజెపి అభ్యర్థిగా సోమన్నను నిలబెట్టామని, ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆయనను గొప్ప స్థానంలో బిజెపి కూర్చోపెడుతుందని తాను హామీ ఇస్తున్నానని ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు వాగ్దానం చేశారు.

బెంగళూరులోని గోవిందరాజ్ నగర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన 72 ఏళ్ల సోమన్న మొట్టమొదటిసారి వరుణ నుంచి పోటీ చేస్తున్నారు. సిద్దరామయ్యను ఓడించగల సత్తాగల నాయకుడిగా సోమన్న భావిస్తున్న సంఘ్ పరివార్ ఆయనపైనే ఆశలు పెట్టుకుంది. రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని, ఈసారి పోటీ చేయకూడదని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గతంలో గెలుపొందిన సోమన్న భావించినప్పటికీ వరుణ, చామరాజ్‌నగర్ స్థానాల నుంచి పోటీచేయాలని బిజెపి నాయకత్వం ఒత్తిడి తీసుకురావడంతో ఆయన కాదనలేకపోయారు. వరుణ నుంచి పోటీ చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే అడిగితే ఎలా కాదనగలనని సోమన్న చెప్పారు. గతంలో ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన 75 ఏళ్ల సిద్దరామయ్య ఈసారి వరుణలో తన గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News