Monday, May 6, 2024

బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది

- Advertisement -
- Advertisement -

BJP is abusing central investigative agencies

రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది
దీనిపై కలిసికట్టుగా పోరాడాలి
ప్రతిపక్ష నేతలకు మమత లేఖ

కోల్‌కతా: ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి అధికార బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు, బిజెపియేతర సిఎంలకు మమత లేఖ రాశారు. విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బిజెపి ప్రత్యక్షంగా దాడులు చేస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చే వారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బిజెపి అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ నెల 27వ తేదీన రాసిన ఈ లేఖను మంగళవారం ఉదయం మీడియాకు విడుదల చేశారు. మమత లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉండడం గమనార్హం. ఇటీవలి కాలంలో మమత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే రాజకీయ ప్రత్యర్థులను లక్షంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు ఏజన్సీలు రంగంలోకి దిగుతాయంటూ మమత విమర్శలు గుప్పించారు. ఈ దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేంద్ర ఏజన్సీలను దుర్వినియోగం చేయాలనే బిజెపిదురుద్దేశాన్ని మనమందరం కలిసికట్టుగా ప్రతిఘటించాలని మమత ఆ లేఖలో కోరారు.

మమతది పూటకో మాట: కాంగ్రెస్

అయితే మమత లేఖపై బిజెపి మండిపడింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలన్న తృణమూల్ ఆశలు అడియాసలు కావడం వల్లే మమత ఇప్పుడు ఈ లేఖ రాశారని పశ్చిమ బెంగాల్ బిజెపి అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 2014, 2019లలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం మనమంతా చూశామన్నారు. గోవా, త్రిపుర ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న తర్వాత ఆ పార్టీ గుణపాఠం నేర్చుకుంటుందని తామంతా ఆశించామని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. ఈ సారి కూడా జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించాలన్న ఆ పార్టీ ఆశలు ఫలించవని భట్టాచార్య అన్నారు. కాగా మమత ఒక్క మాటపై నిలబడరని కాంగ్రెస్ ఎంపి, బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధిర్ రంజన్ మండిపడ్డారు. ఒక సారి బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తారని, మరోసారి బిజెపి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని అంటారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News