Sunday, April 28, 2024

రాష్ట్రాల రగడ!

- Advertisement -
- Advertisement -

Border dispute between Assam and Mizoram

 

ఒకటి బిజెపి పాలనలోని రాష్ట్రం, మరొకటి దాని మిత్రపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ ఏలుబడిలోనిది. అసోం, మిజోరంల మధ్య 50 ఏళ్లుగా గల సరిహద్దు వివాదం సోమవారం నాడు దట్టించి అంటించిన మందు పాతర మాదిరిగా పేలి సృష్టించిన ప్రాణ నష్టం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. దేశాల సరిహద్దుల మధ్య సైనిక ఘర్షణలు, యుద్ధాలు సహజమే. కాని ఒకే దేశంలోని రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అటూ ఇటూ గల పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకొని ప్రాణ నష్టానికి దారి తీయడం అమిత ఆందోళనకరమైన పరిణామం. రెండు రాష్ట్రాల ప్రజలూ, ప్రభుత్వాల సమ్మతితో అనుల్లంఘనీయమైన సరిహద్దులు ఏర్పాటు చేయడంలో వైఫల్యమే ఇటువంటి ఘర్షణలకు దారి తీస్తుంది. సోమవారం నాడు అసోం, మిజోరం సరిహద్దులలో సంభవించిన హింసాకాండలో ఎనిమిది మంది అసోం పోలీసులు మరణించినట్టు తొలి వార్తలు చెప్పాయి. మృతులు ఐదుగురేనని అసోం వైపు మరి 50 మంది గాయపడ్డారన్నది రూఢి సమాచారం. సరిహద్దులలో రెండు వైపుల గల భూమిని రెండు రాష్ట్రాల రైతులు సాగు చేసుకుంటున్నారని, అలా ఉపయోగపడుతున్న భూభాగంపై హక్కు కోసం తలెత్తిన పేచీయే చినికిచినికి గాలివాన అయిందని స్పష్టపడుతున్నది.

ఆ విధంగా ఇది కేవలం కొండలు, బండలతో నిండిన సరిహద్దుకు సంబంధించిన వివాదం కాదని రెండు వైపుల గల ప్రజలు జీవనోపాధి కోసం ఉపయోగించుకుంటున్న సాగు భూముల తగాదా అని భావించవలసి ఉంది. ఈ సరిహద్దు పేచీ పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలోనే చర్యలు ప్రారంభించింది. కిందటేడాది అక్టోబర్‌లో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు కేంద్రం ఉన్నత స్థాయి చర్చలు నిర్వహించింది. వాటి ఫలితంగా మిజోరం వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి తన పోలీసులను ఉపసంహరించుకొని అక్కడ సరిహద్దు భద్రతా దళాలను నియోగించడానికి అంగీకరించింది. కాని ఆ అంగీకారం ఆచరణలో ఆశించిన మేలు చేయలేదని ఇప్పటి ఘటనలు చెబుతున్నాయి. అసోం, మిజోరంలు తల్లిపిల్లలు వంటి రాష్ట్రాలు. ఇప్పటి మిజోరం రాష్ట్రం 50 ఏళ్ల క్రితం అసోం భూభాగమే. 1972లో దానిని విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. 1987లో రాష్ట్రం అయ్యింది. అసోంలో భాగంగా ఉన్నప్పుడు మిజోరం ప్రాంతాన్ని లూషాయి హిల్స్ అనేవారు. అదొక ప్రత్యేక జిల్లాగా ఉండేది. రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మిజోరంతో అసోంకు 165 కి.మి పొడవు సరిహద్దు ఏర్పడింది.

అయితే పర్వత ప్రాంతాలు కావడం వల్ల సరిహద్దును స్పష్టంగా నిర్వచించలేకపోయారు. అదే ఘర్షణలకు కారణమవుతున్నది. బ్రిటిష్ పాలనలో కచార్ మైదాన ప్రాంతాన్ని లుషాయి హిల్స్ నుంచి వేరు చేస్తూ 1875లో ఒక ఒప్పందం కుదిరింది. తర్వాత 1933లో లుషాయి హిల్స్, మణిపూర్‌ల మధ్య సరిహద్దు గీతను గీస్తూ మరో ఒప్పందం చోటు చేసుకున్నది. అసోంతో సరిహద్దును కూడా 1875 ఒప్పందం ప్రకారమే నిర్ణయించాలని మిజోరం ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఘర్షణలు చెలరేగక ముందు 2018 ఫిబ్రవరిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వచ్చిన అక్రమ చొరబాటుదారుల వల్లనే ఈ ఘర్షణలు జరుగుతున్నాయని మిజోరం ప్రజలు భావిస్తున్నారు. సరిహద్దుల్లో గల ఎవరికీ చెందని స్థలం (నో మాన్స్‌ల్యాండ్) లో రెండు వైపుల వారు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదంటూ గతంలో ఒక అంగీకారం కుదిరిందని దానిని ఉల్లంఘించి అక్కడ గుడిసెలు వేసుకోడం, వ్యవసాయం చేపట్టడం జరుగుతున్నందునే స్పర్ధలు అంకురించి హింసకు దారి తీస్తున్నదని బోధపడుతున్నది.

మిజోరంకు చెందిన రైతులు వేసుకున్న గుడిసెను, వ్యవసాయ క్షేత్రాన్ని అసోం పోలీసులు ధ్వంసం చేసినందునే ప్రస్తుత జగడం రగిలిందని వార్తలు చెబుతున్నాయి. అయితే మిజోరం పోలీసులు గాని, ప్రజలు గాని హద్దులు మీరి ప్రాణాంతకమైన మారణాయుధాలు ప్రయోగించడం ఎంత మాత్రం సమర్థించదగినది కాదు. ఈ హింసపై కూలంకషమైన దర్యాప్తు జరగాలి. బాధ్యులను చట్టం గట్టిగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఘర్షణకు దారి తీసిన స్థలం మ్యాపులో అసోంకు చెందినదిగానే ఉందని, అక్కడ మిజోరం ప్రజలు చిరకాలంగా సాగు చేసుకుంటున్న మాట కూడా వాస్తవమేనని పరిశీలకులు చెబుతున్నారు. పురాతన నిరాధార విశ్వాసాలను, మూఢ నమ్మకాలను, అసంతృప్త ఆధిపత్య కాంక్షను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలనే దృష్టి ప్రబలిన చోట ఇటువంటివి రగలడం ఆశ్చర్యపోవలసినది కాదు. ప్రజలను విడదీయడానికి బదులు కలపడానికి, కలిసి నడచేలా చేయడానికి తగిన జాతీయ దృక్పథం వెలిసి వర్ధిల్లవలసి ఉంది. అసోం, మిజోరం ముఖ్యమంత్రులిద్దరూ పరిష్కారం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన తక్షణమే తగిన చొరవ చూపి ఈ నిప్పును ఇంతటితో ఆపుతారని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News