Saturday, May 4, 2024

భారత్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

పంత్, గిల్, సిరాజ్‌లకు చోటు, రాహుల్‌కు నిరాశే, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేటి నుంచి బాక్సింగ్ డే టెస్టు

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమయ్యే రెండో టెస్టు టీమిండియా భారీ ఆశలతో సిద్ధమైంది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. ఇది కూడా జట్టుకు ప్రతికూలంగా మారే అంశమే. ఇక ఈ మ్యాచ్ కోసం జట్టులో భారీ మార్పులు చేశారు.

తెలుగుతేజం, యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లకు తుది జట్టులో చోటు లభించింది. వీరికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కానుంది. మరోవైపు వృద్ధిమాన్ సాహా స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు లభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు. మరో తెలుగుతేజం హనుమ విహారి తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 10 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌పై పట్టుబిగించాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది.

శుభ్‌మన్‌కు ఛాన్స్

ఊహించినట్టే ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులో స్థానం లభించింది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన పృథ్వీషా స్థానంలో గిల్ జట్టులోకి వచ్చాడు. గిల్‌కు ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో గిల్ మెరుగైన ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే అతనికి తొలి జట్టులో మాత్రం చోటు లభించలేదు. కానీ పృథ్వీషా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో అతనికి బదులు బాక్సింగ్ డే టెస్టులో గిల్‌కు స్థానం దక్కింది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

ఇద్దరిపైనే ఆశలు

ఇక ఈ మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ భారమంతా సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలపైనే ఉందని చెప్పక తప్పదు. కోహ్లి అందుబాటులో లేని సమయంలో వీరిద్దరి బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్ అజింక్య రహానెకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. ఇటు సారధ్య బాధ్యతలతో పాటు బ్యాటింగ్ భారాన్ని కూడా అతను మోయాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇలాంటి స్థితిలో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత రహానెపై ఉంది. మరోవైపు మిస్టర్ డిపెండబుల్ పుజారా కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతని రాణింపుపైనే జట్టు భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడినా రెండో ఇన్నింగ్స్‌లో పుజారా విఫలమయ్యాడు. కానీ కీలకమైన ఈ మ్యాచ్‌లో అతనిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పుజారా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

పంత్‌కు పరీక్ష

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మెరుగైన బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇందులో విఫలమైతే రానున్న రోజుల్లో జాతీయ జట్టులో చోటు సంపాదించడం అసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో పంత్ ఉన్నాడు. సాధన మ్యాచుల్లో మెరుగ్గా రాణించడం పంత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.

హనుమ విహారి కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైన ఉంది. తొలి మ్యాచ్‌లో విహారి పెద్దగా రాణించలేక పోయాడు. ఈసారి విఫలమైతే అతనికి కూడా కష్టాలు తప్పక పోవచ్చు. ఇక గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా ఈ టెస్టు పరీక్షగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్షంతో జడేజా ఉన్నాడు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించే సత్తా కలిగిన జడేజా జట్టుకు చాలా కీలకంగా మారాడు. అతని రాణింపుపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు.

సిరాజ్ అరంగేట్రం

తెలుగుతేజం, స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ బాక్సిండ్‌డే మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. గాయపడిన షమి స్థానంలో సిరాజ్‌కు తుది జట్టులో చోటులో లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో సిరాజ్ ఉన్నాడు. ఐపిఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచుల్లో సిరాజ్ సత్తా చాటాడు. దీంతో టెస్టుల్లోనూ అలాంటి జోరునే కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లతో కలిసి సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోపనున్నాడు. ఇక అశ్విన్, జడేజాల రూపంలో భారత్‌కు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉండనే ఉన్నారు.

సమరోత్సాహంతో

మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన కంగారూలు జోరుమీదున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను శాసించే స్థితికి చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తోంది. ఇంకా తుది జట్టును ప్రకటించక పోయినా ఈసారి కూడా అదే టీమ్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ త్రయం కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురు తొలి టెస్టులో అసాధారణ బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను శాసించారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కనబరచాలనే లక్షంతో కనిపిస్తున్నారు. బర్న్, వేడ్, లబూషేన్, పైన్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈసారి కూడా కంగారూలు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News