Monday, April 29, 2024

ధర్మశాలకు వరదపోటు

- Advertisement -
- Advertisement -

Cars, buildings swept away in flash floods in Dharamshala

కూలిన భవనాలు, కొట్టుకుపోయిన కార్లు
రావొద్దంటూ పర్యాటకులకు అధికారుల హెచ్చరిక

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధుల ఆధ్యాత్మిక నగరం ధర్మశాలను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు ధర్మశాల ఎగువన ఉన్న భాగ్సునాగ్ సమీపంలోని మురిక కాలువ పొంగిపొర్లుతోంది. వరద ఉధృతికి కాలువ పక్కనున్న పాత భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు కార్లు, పలు బైకులు వరద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో వైరల్ అయింది. భాగ్సునాగ్‌లో ఓ పాఠశాల భవనం, పక్కన ఉన్న హోటళ్లు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ధర్మశాలలోని గగ్గల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ ఇంచార్జ్ గౌరవ్‌కుమార్ తెలిపారు. ధర్మశాలకు సమీపంలోని మంఝీఖోడ్‌నూ వరదలు ముంచెత్తాయి. ఇక్కడ రెండు భవనాలు వరదలో కొట్టుకుపోగా, మరికొన్ని దెబ్బతిన్నాయి.

వరదల వల్ల మండీపథాన్‌కోట్ హైవే వంతెన దెబ్బతిన్నది. రెండు వైపులా హైవేను మూసివేశారు. దాంతో,ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఠాకూర్‌కు హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల దృష్టా ధర్మశాలను సందర్శించేందుకు రావొద్దని పర్యాటకులను అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నవారు అవసరమైన ప్రభుత్వ సాయానికి టోల్‌ప్రీ నెంబర్ 1077 ద్వారా సంప్రదించాలని సూచించారు. కొందరిని సున్నిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. వాతావరణశాఖ అంచనా ప్రకారం 13,14,15 తేదీల్లోనూ ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురియనున్నాయి. దాంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News