Sunday, May 5, 2024

తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైంలో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Case booked against Teenmar Mallanna

బాధిత యువతి ఫిర్యాదు మేరకు క్యూన్యూస్‌లో సోదాలు

హైదరాబాద్:  తన ఫోటోను వీడియోలలో చూపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేశాడని ప్రియాంక అనే యువతి తీన్మార్ మల్లన్నపై మంగళవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యూన్యూస్ కార్యాలయంలో తనకు సంబంధించిన ఫోటోలున్నాయని, వాటితో మల్లన్న బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు క్యూన్యూస్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలలో కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ప్రియాంకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియో క్లిప్పింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా బ్లాక్మెయిల్ చేయడం కోసం అనేక మంది నుండి వ్యక్తిగత వివరాలను తీన్మార్ మల్లన్న అక్రమంగా సేకరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్నపై కేసు నమోదు…

బాధిత యువతి ప్రియంక ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని, విచారణ సమయంలో క్యూన్యూస్ సిబ్బందిని సైతం ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంకకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను స్వాధీనం చేసుకున్నామని, విచారణాంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

చిలుక ప్రవీణ్ నా స్నేహితుడు…

గతంలో క్యూన్యూస్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేసిన చిలుక ప్రవీణ్ తనకు స్నేహితుడని బాధితురాలు ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు 6 సంవత్సరాలుగా తనకు చిలుకప్రవీణ్‌తో స్నేహ సంబంధాలున్నాయని, పవిత్రమైన స్నేహంపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా తన స్నేహితుడైన ప్రవీణ్ తాను కలిసి ఒక పెళ్లివేడుకలో ఫోటోలు దిగామని, వాటిని చిలుక ప్రవీణ్ వద్ద నుంచి సేకరించిన తీన్మార్ మల్లన్న వాటిపై అసభ్యకరంగా వ్యాఖ్యాలు చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తామిద్దరం ఒక లాడ్జీలో కలుసుకున్నామంటూ లేనిపోని వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై తగు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు మీడియాకు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News