Friday, April 26, 2024

పెగాసస్‌పై కేంద్రం మొండి వైఖరి!

- Advertisement -
- Advertisement -

Center stubborn stance on Pegasus!

 

మొన్నటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలో బహిర్గతమై వాటిని ఆద్యంతం స్తంభింప చేసిన ఇజ్రాయెలీ పెగాసస్ నిఘా ఉదంతానికి సుప్రీంకోర్టులో సైతం సరైన మోక్షం లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం దేశ ప్రజలకు తెలిసే అవకాశం బొత్తిగా లేదనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండి వైఖరే ఇందుకు కారణమని స్పష్టపడుతున్నది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ బంధువు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వంటి అనేక మంది నాయకుల నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన మహిళ వరకు దేశంలోని కీలక వ్యక్తుల స్మార్ట్ ఫోన్ల మీదికి వారి సంభాషణలను, మెసేజ్‌లను యధాతథంగా సేకరించి ఇచ్చే పెగాసస్‌ను ప్రయోగించారని వెల్లడించిన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక పై చర్చకు ప్రతిపక్షం చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంతో వర్షాకాల సమావేశాలు పూర్తిగా హరించుకుపోయాయి. ప్రభుత్వం అప్పుడే పార్లమెంటు ముఖంగా వాస్తవాలు వెల్లడించి ఉంటే సరిపోయేది. అలా జరగకపోడంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించిన దర్యాప్తును నిలిపివేసి దేశ అత్యున్నత న్యాయస్థానం తనంతట తానుగా దాని లోతులు తెలుసుకోవాలని సంకల్పించింది. వార్తల్లో వచ్చిన సమాచారమే నిజమైతే పెగాసస్ వ్యవహారం చాలా తీవ్రమైనదేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆ మధ్య వ్యాఖ్యానించారు. ఆయన అధ్యక్షతన గల ధర్మాసనమే ఇప్పుడు పెగాసస్ కేసుపై విచారణ జరిపింది. ఈ ఉదంతంపై కేంద్రం సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ సున్నితమైన ఈ వ్యవహారంలో సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయడం దేశ భద్రతకు ముప్పని వాదించారు. ఆయా సాఫ్ట్ వేర్ల వివరాలను న్యాయ స్థానానికి తెలియజేయడం వల్ల ఆ సమాచారం విద్రోహ శక్తుల చేతుల్లోకి పోతుందని అభిప్రాయపడ్డారు. తుషార్ మెహతా సూటిగా సమాధానం చెప్పడం లేదని, దేశ భద్రతకు, తామడిగిన విషయాలకు సంబంధం లేదని ధర్మాసనం వెల్లడించింది. బయటి శక్తులేవైనా దేశంలోని ప్రముఖులపై ఇటువంటి నిఘా సాధనాలను ప్రయోగించి ఉంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఆందోళనకరమైన అంశం కాబోదా? అని కూడా ప్రశ్నించింది.

కేంద్రానికి మరి కొంత వ్యవధి ఇస్తామని అప్పటికి కూడా వివరమైన అఫిడవిట్‌ను దాఖలు చేయకపోతే ఈ కేసులో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని సిజెఐ రమణ ప్రకటించారు. దేశాన్ని కుదిపేసి, పార్లమెంటును స్తంభింప చేసిన సంచలనాత్మక, అత్యాధునిక స్పై వేర్ ప్రయోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం పాటించడం అనేక అనుమానాలకు అవకాశమిస్తున్నది. అటు పార్లమెంటుకూ వాస్తవాలు చెప్పకుండా ఇటు దేశ అత్యున్నత న్యాయ స్థానానికీ అఫిడవిట్ సమర్పించకుండా ఉండే అవసరం దానికి ఏల కలిగిందనే ప్రశ్న ఉదయిస్తున్నది. వ్యక్తులపై గూఢచర్యం గురించి తాము ప్రశ్నిస్తుంటే మధ్యలో దేశ భద్రత వ్యవహారాన్ని ఎందుకు తీసుకు వస్తున్నారని సిజెఐ సూటిగా ప్రశ్నించినా కేంద్రం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. అఫిడవిట్ సమర్పించి ఉంటే ఈ వ్యవహారంపై కేంద్రం వైఖరి తెలిసి ఉండేదని అది జరగకపోడం వల్ల తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయక తప్పని పరిస్థితి తలెత్తిందని సిజెఐ అన్నారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా అది గౌరవిస్తుందనే నమ్మకం కలగడం లేదు. నిపుణులతో ఒక కమిటీని వేసి ఆయా ప్రముఖుల ఫోన్ సంభాషణలు రహస్య వినికిడికి గురయ్యాయో లేదో తేల్చే బాధ్యతను అప్పగిస్తామని దాని నివేదికను ధర్మాసనం ముందు ఉంచుతామని తుషార్ మెహతా తెలియజేశారు. ఇలా జేబులో బొమ్మలు, ముంజేతి చిలుకల చేత పలికించే పలుకులు వాస్తవాన్ని బయట పెడతాయని నమ్మే అమాయకులెవరూ ఉండరు. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత సాకుతో పెగాసస్ ఉదంతాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్న తీరు, దాని నిజాయితీని శంకించ వలసిన అవసరాన్ని కలిగిస్తున్నది. అంతర్జాతీయ శోధన నివేదికలో పేర్కొన్నట్టు ఆయా వ్యక్తుల ఫోన్లలోకి పెగాసస్ రహస్యంగా ప్రవేశించిన మాట వాస్తవమేనని భావించక తప్పని పరిస్థితి కలుగుతున్నది. తన నిఘా పరికరాన్ని ఉగ్రవాద కార్యకలాపాలను తెలుసుకోడానికి ప్రభుత్వాలకే విక్రయిస్తానని పెగాసస్ యాజమాన్యం గతంలో తెలియజేసిన మాట తెలిసిందే. అందుచేత మన కేంద్ర పాలకులే ఈ పరికరాన్ని కొనుగోలు చేసి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల మీద ప్రయోగించి ఉంటారనే అనుమానం గట్టి పడేలా అది వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. ఇది ప్రజాస్వామిక విలువల పతనాన్ని చాటుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News