Sunday, April 28, 2024

కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి

- Advertisement -
- Advertisement -

Heavy Rains In Tamilnadu State

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం సత్వరం నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రినిసిపల్ సెక్రటరీ ఉషారాణి పేర్కొన్నారు. శనివారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం తో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సంధర్భంగా ప్రినిసిపల్ సెక్రెటరీ మాట్లాడారు. నవంబర్ 19 వ తేదీన చిత్తూరు జిల్లా పెద్దమండ్యం లో 200 మి.మీ పైగా అతి బారీ వర్షం నమోదైందని, అనంతపురం జిల్లా నల్లచెరువులో 193 మి.మీ , నెల్లూరు లో 140.3 మి.మీ లు వర్ష పాతం నమోదు అయిందని తెలిపారు.

గతంలో ఇటువంటి అత్యధిక వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. ముఖ్యంగా నవంబర్ లో కురిసిన బారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలలో పలు రోడ్లు , చెరువులు దెబ్బతిన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలించిన కాలంలో తవ్విన చెరువులు వాటికి చేపట్టిన గొలుసు చెరువులు చాలా వరకు దెబ్బతిన్నాయని వివరించారు. కడప జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్ కు గండి పడడంతో చాలా గ్రామాలు నీట మునిగాయని దాదాపు 20 మందికి ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాయలసీమలో జరగలేదన్నారు ఈ నాలుగు జిల్లాలలో 199 మండలాలు, 1990 గ్రామాలకు బారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు.

211 గ్రామాలు, 23 పట్టణాలు ముంపుకు గురైందని, 2.31 లక్షల మంది ప్రజానీకం వరదల వలన ఇబ్బందులకు గురైయ్యారని ఉషారాణి తెలిపారు. ఈ నాలుగు జిల్లాలలో 44 మంది చనిపోయారని, 15 మంది వరదలలో మిస్సింగ్ అయ్యారని, 5740 గృహాలు దెబ్బతిందని, 98,514 గృహాలు ముంపుకు గురి కాగా ముంపు వాసులను జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు. వరద బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం వరద నష్టాలను పరిశీలించేందుకు బృందాన్ని పంపినందులకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే భారీ వర్షాలలో రాష్ట్ర పరిస్థితి లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించి హైదరాబాద్ నుండి 2 హెలీకాప్టర్ లను జిల్లాకు పంపినందులకు ధన్యవాదాలు తెలిపారు. బారీ వర్షాలలో జిల్లా కలెక్టర్ లు, జిల్లా యంత్రాంగం ప్రజలను అందించిన సేవలు ప్రశంసనీయమని, చిత్తూరు జిల్లా కలెక్టర్ రాయలచెరువు వద్ద వర్షాలు అదుపులోకి వచ్చే వరకు అక్కడే మకాం ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు జరిగే బారీ ప్రాణ నష్టాన్ని నివారించారని ప్రశంసించారు. ఈ నాలుగు జిల్లాలలో 25 టీం లు, 260 మంది ఎన్ డి ఆర్ ఎఫ్ , 300 మంది ఎస్ డి ఆర్ ఎఫ్, 54 ఫైర్ సెర్వీస్, 22 బోట్లు, రెండు హెలీకాప్టర్ల ద్వారా ప్రజలకు సత్వరం సహాయ సహకారాలు అందించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసి ఆదుకుందని, ప్రాణ నష్టం జరిగిన వ్యక్తుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశామన్నారు. 319 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ముంపుకు గురైన 79,590 మందికి ఆహారంతో కూడిన వసతి కల్పించామని, 747 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు రూ. 320 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు చేశామని అన్నారు. వ్యవసాయ శాఖలో 2.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అందులో 75 శాతం వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కడప జిల్లాలో 56,139 హెక్టార్లు, అంతపురం జిల్లాలో 28 వేల హెక్టార్లు , చిత్తూరు జిల్లాలో 12,744 హెక్టార్లలో కోతకు అందిన వచ్చిన వరి పంట నాశనమైందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4.78 లక్షల ఎకరాలలో రైతుల పంటలకు నష్టం వాటిల్లిందని తెలియజేశారు. ఈ నాలుగు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో కూడా వరి పంట దెబ్బతిందని వివరించారు. పంచాయితీ రాజ్ సెక్టార్ లో 3129 రోడ్లు, 20 భవనాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్లు, ఇరిగేషన్, భారీ, చిన్న నీటి వనరులు, ట్రాన్స్కో పోల్స్, సబ్ స్టేషన్ లు, గృహాలు తదితర శాఖలలో జరిగిన నష్టాలను వివరించి కేంద్రం నుండి ప్రత్యేక నిధులను మంజూరు చేసి ఆదుకోవాలని ఉషారాణి కోరారు.

ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరించిన పవర్ పాయింట్ ప్రెసంటేషన్ ను వివిద శాఖల తరపున హాజరైన కేంద్ర బృంద ప్రతినిధులు శాఖల వారీగా అంచనాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు. ఆదివారం వరకు చిత్తూరు , కడప, నెల్లూరు జిల్లాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను పరిశీలించి నష్టాలకు తగిన పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కేంద్ర ప్రతినిధుల బృందం అడ్వైజర్ తెలిపారు.

ఈ సమావేశంలో కేంద్ర బృందం ప్రతినిధులు కునాల్ సత్యార్ది, అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ అఫైర్స్, అభే కుమార్, డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డా. కె. మనోహరన్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కో ఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, శ్రీనివాసు బైరి, సూపరింటెండెంట్ ఇంజినీర్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, శివానీ శర్మ, డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, శ్రవణ్ కుమార్ సింగ్, ఎస్ ఈ, రీజినల్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్, రోడ్, హై వేస్, అనిల్ కుమార్ సింగ్, యూనియన్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు కమీషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్న బాబు, వ్యవసాయ శాఖ కమీషనర్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , తిరుపతి మున్సిపల్ కమీషనర్ గిరీషా, స్థానిక ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News