Monday, May 6, 2024

ఎక్కడోళ్లు అక్కడికెళ్లొచ్చు

- Advertisement -
- Advertisement -

Migrant workers

 

ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు,
టూరిస్టులు, భక్తులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
రాష్ట్రాల పరస్పర అంగీకారం అవసరం
తరలింపునకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకోవాలి
అందరికీ స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి, ఆరోగ్య పరీక్షలు
లాక్‌డౌన్ నిబంధనల్లో కేంద్రం స్వల్ప మార్పులు, లక్షలాది మందికి ఊరట

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఉన్న చోట ఉండలేక.. స్వస్థలాలకు వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్న వలస కార్మికులు, కూలీలు, టూరిస్టులు, భక్తులు, విద్యార్థులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.లాక్‌డౌన్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ వారివారి సొంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేరిట బుధవారంనాడు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ఆయా ప్రభుత్వ విభాగాలకు సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిక్కుకుపోయిన వాళ్ల తరలింపుపై ఇరు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. స్వస్థలాలకు తరలివెళ్లే వారందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని షరతు విధించారు. వారిని తరలించుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని, ఎవరైతే రాష్ట్రానికి తిరిగి వస్తున్నారో వారి పేర్లను విధిగా నమోదు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

వారిని తరలించేందుకు బస్సులను వినియోగించుకోవాలని, అవి ఒక బృందంగా వెళ్లేందుకు ప్రణాళిక రచించుకోవాలని సూచించింది. ఆ బస్సులను శానిటైజ్ చేయాలని, బస్సుల్లో కూర్చునే వ్యక్తులు భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. తరలించే మార్గాలపై ఇరు రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ చివరి ప్రదేశానికి చేరుకునే వరకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తరలించే ప్రతీ వ్యక్తికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, కరోనా లక్షణాలు లేని వ్యక్తులనే తరలించాలని కేంద్రం స్పష్టం చేసింది.

స్వస్థలాలకు చేరుకున్న తర్వాత మళ్లీ ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని హోం క్వారంటైన్ పాటించేలా స్థానిక వైద్య అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. క్వారంటైన్ అవసరం లేని వారిని ఇళ్లకే పరిమితం అయ్యేలా చూస్తూ వారికి తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని మార్గదర్శకాల్లో వివరించింది. కేంద్రం తాజా ప్రకటనతో పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కార్మికులకు, యాత్రికులకు, విద్యార్థులకు ఊరట లభించినట్టయింది.

Centre allows movement of Migrant workers, students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News