Sunday, April 28, 2024

ఆర్‌ఆర్‌ఆర్ కు ఓకే

- Advertisement -
- Advertisement -

రీజనల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
‘ఔటర్’ను తలదన్నేలా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం
వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా రింగ్‌రోడ్డు

Centre approval to Regional Ring Road in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: మహానగరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలే లక్షంగా ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు, 334 కిలోమీటర్ల మేర ) త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రింగ్‌రోడ్డుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సిఎం కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2019లో ప్రారంభం కావాల్సిన రీజనల్ రింగ్‌రోడ్డు పనులు కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం వలన ఆగిపోయాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు టిఆర్‌ఎస్ ఎంపిలతో పాటు సిఎం కెసిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం జాప్యం చేయడంతో ఈ రీజనల్ రింగ్‌రోడ్డు పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం కేంద్రం దీనికి పచ్చజెండా ఊపడంతో మళ్లీ రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పనులు త్వరలో మొదలుకానున్నాయి. ఇప్పటికే 80 శాతం భూ సేకరణ సైతం పూర్తయ్యింది. త్వరలో దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టాలన్న ఆలోచనతో రాష్ట్రం ముందుకెళుతోంది. హైదరాబాద్ సహా సమీపంలో ఉన్న పట్టణాల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ను రూపొందించింది. హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ దూర పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌కు రూపకల్పన చేసింది.
హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ రేడియేషన్ పరిధిలోని…
హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ రేడియేషన్ పరిధిలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, జాతీయ రహదారులను కలుపుతూ ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ రింగ్‌రోడ్డును తలదన్నేలా ఈ నిర్మాణం ఉండాలని, దీంతోపాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు సూచించారు. ఆ దిశగానే ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తంగా మూడేళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలన్న లక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ నిర్మాణానికి అంచనా వ్యయం కింద గతంలో మొత్తం రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందులో 50 శాతం వ్యయాన్ని రాష్ట్రం ప్రభుత్వం భరించనుండగా మరో 50 శాతం అయ్యే వ్యయాన్ని కేంద్రం భరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించడంతో వాహనదారుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్డులో కూడా ఆ విధంగానే టోల్‌ఫీజును వసూలు చేయనున్నట్టుగా తెలిసింది. కంది, షాద్‌నగర్‌లో నాలుగు వరసల రహదారి నిర్మాణం జరుగుతుండగా ఈ పరిధి కూడా ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటివిడతలో 152 కి.మీ. తూప్రాన్ టు గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ టు భువనగిరి నుంచి చౌటుప్పల్, రెండోవిడతలో 182 కి.మీ చౌటుప్పల్ టు యాచారం నుంచి కడ్తాల్ టు షాద్‌నగర్ నుంచి చేవెళ్ల టు శంకర్‌పల్లి నుంచి కంది వరకు ఈ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.
17 చోట్ల రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుతూ…
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి 11 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 17 చోట్ల రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్మాణం వలన 12 పట్టణాలు, 125కు పైగా గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. వరంగల్, ముంబై, విజయవాడ, నాగపూర్, బెంగళూరు హైవేలను కలుపుతూ ఈ నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివలన వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లకుండా తమ గమ్యస్థానాలకు వెళ్లేలా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొత్తం రింగ్‌రోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.12 వేల కోట్లు కాగా అందులో భూ సేకరణకు రూ.3వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లను కేటాయించనున్నట్టుగా తెలిసింది. మొత్తం 334 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు) ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించి 6 వరుసలుగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. నగరానికి 50 నుంచి 60 కిలోమీటర్ల వ్యాసార్ధంలో మరో రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక మౌలిక వసతులు ఆరు లేన్లతో ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో దీనిని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Centre approval Regional Ring Road Around to Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News