Monday, May 6, 2024

సాగు చట్టాలను మళ్లీ తీసుకు వచ్చే ఉద్దేశం లేదు

- Advertisement -
- Advertisement -
Centre will not bring back farm laws Says Tomar
నేను అలా అనలేదు, కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోంది
కేంద్రమంత్రి తోమర్ యూటర్న్

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ తీసుకున్నారు. సాగు చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తీసుకు వస్తామని శనివారం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన ఆయన 24 గంటల్లోనే మళ్లీ మాట మార్చారు. రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకు వచ్చే ఉద్దేశం తమకు లేదన్నారు.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను గందరగోళంలో పడేస్తోందని, ఈ గందరగోళంలో రైతులు ఇరుక్కోవద్దని హెచ్చరించారు. ‘ రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకు వచ్చే ఉద్దేశం మాకు లేదు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. రైతులెవరూ ఈ గందరగోళంలో ఇరుక్కోవద్దు’ అని తోమర్ ఒక ప్రకటనలో అన్నారు.

రైతుల శ్రేయస్సు దృష్టానే ప్రధాని మోడీ సాగు చట్టాలను రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తోమర్ సాగు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకు వస్తుందని ప్రచారం సాగుతోంది. విపక్షాలు సైతం కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డాయి. పలు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి ప్రభుత్వం తిరిగి వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో తోమర్ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తను అలా చెప్పలేదని, ప్రభుత్వం ఈ చట్టాలను తిరిగి తీసుకు రాదని స్పష్టం చేశారు.‘ మూడు సాగు చట్టాలను తీసుకువస్తామని నేను చెప్పలేదు.

కేంద్రం మంచి చట్టాలను రూపొందించింది. కానీ కొన్ని కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. అయితే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని మాత్రమే చెప్పాను’ అని తోమర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దే చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. ఏడాదిన్నర పాటు సుదీర్ఘంగా కొన సాగిన రైతుల ఆందోళనలకు దిగివచ్చిన కేంద్రప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పారు. తమ డిమాండ్లను ఆమోదించడంతో రైతులు ఆందోళనకు తాత్కాలిక ముగింపు పలికి ఇళ్లకు వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News