Wednesday, May 1, 2024

ఎండలకు మించిన చికెన్ దెబ్బ!

- Advertisement -
- Advertisement -

ధరలు.. సామాన్యుడికి షాక్.. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డులు, రేట్ల మార్పుకి ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లయ్ లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా… గ్రహీత, అనుభవ కర్త వినియోగదారుడేనన్నది జగమెరిగిన సత్యమే. ఆహార అలవాట్ల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలెన్ని వల్లె వేసినా రేట్ల తగ్గింపు, సాంత్వన దుస్సాధ్యమే. ఏతావాతా సామాన్యుడి సణుగుడు సశేషం! ధరా ఘాతం… ధరలు మండుతున్నాయి. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట. ద్రవ్యోల్బణం.. డిమాండ్, సప్లయ్ వగైరాల వలలో చిక్కిన సామాన్యుడు బావురుమంటున్నాడు. కరోనా మహమ్మారి కోరల నుంచి తప్పించుకున్నామని ఇప్పుడే కోలుకొంటున్న సగటు వినియోగదారుడు ధరల సెగ నుంచి రక్షణ కోసం అర్రులు చాస్తున్నాడు. కష్ట జీవులు.. ముఖ్యంగా బడుగు వర్గాలు వారాంతంలో మాంసాహారానికి తహతహలాడుతారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎంతో కొంత తమ ఆహార అలవాట్లలో మాంసాహారానికి ప్రాధాన్యమిస్తారు.

అనూహ్యంగా ధరా ఘాతంతో ఆదివారాలు ఆహార అసంతృప్తిని మిగిల్చుతున్నాయి. ముఖ్యంగా చికెన్ ధరలు ఎగబాకాయి. అతి స్వల్ప వ్యవధిలో కిలోకు రూ.300 పైగా చేరుకున్నాయి. రకరకాల కారణాలు ఇందుకు హేతువయ్యాయి. మార్కెట్‌లో మటన్ ధరలు రమారమి రూ. 1000 కు చేరుకోవటంతో ఎక్కువ శాతం మంది చికెన్ తినేందుకు నియంత్రించుకున్నారు. కొనలేక, తినలేక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల కాలం వరకూ కిలో చికెన్ రూ. 200 ఉండటంతో చికెన్ బాట పట్టారు. అదే కూర ఇప్పుడు రూ.100 పైబడి అదనంగా పెరగటమే పేర్కొనదగినది. ఎక్కువ వాడకం ఉన్న స్కిన్‌లెస్ గత నెల వరకు రూ. 180 దాకా ఉండగా, ఇప్పుడది రూ.300 దాటేసింది. స్కిన్ చికెన్ రూ. 160 నుండి 250 కు చేరగా, లైవ్ కోడి దాదాపు రూ. 200 అయింది. ఇక ధరల మంటపై పలు విశ్లేణలున్నాయి.

గత 3 నెలల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక కోళ్ళు బరువు పెరగడం లేదని, ఎండ వేడికి చనిపోతున్నాయని పౌల్ట్రీ వర్గాలు వివరిస్తున్నాయి. ఎండ వేడికి వేసవి కాలంలో కోళ్లు చనిపోతాయని, అందుకే రైతులు… కోళ్లు బలిష్టంగా తయారు కాక మునుపే అమ్మేస్తారని దాంతో సమ్మర్‌లో చికెన్ రేట్లు తగ్గుతాయని… అయితే ఈ సీజన్‌లో చికెన్ రేట్లు అమాంతం పెరిగాయని, ఇది అనూహ్య పరిణామమని పౌల్ట్రీ నిపుణులు విశదీకరిస్తున్నారు. ఉత్పత్తి మందగించి సరఫరా తగ్గటంతో చికెన్ ధరలు పెరిగాయని వారంటున్నారు. మామూలు గా రైతులు… ఏడాదికి ఆరు బ్యాచ్‌ల బాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 4 బ్యాచులనే తీస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో బ్యాచ్ ఎదగటానికి 15 రోజులు సమయం పడుతుంది. బ్యాచ్‌కు బ్యాచ్‌కు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ప్రస్తుతం కంపెనీలు ఈ వ్యవధిని 45 రోజుల నుంచి 50 రోజులకు పెంచుకున్నట్లు వినిపిస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి మే నెల దాకా కంపెనీలు ఇలానే చేస్తాయని రైతులు చెప్పటం గమనార్హం. మరోవైపు కోళ్ల దాణా కిలో రూ. 26 నుంచి రూ.50 వరకూ చేరింది. చేపల కంటే చికెన్ వాడకం అధికంగా ఉండటం చెప్పుకోదగ్గది. మొత్తంగా చూస్తే.. కోడి మాంసం సరాసరి డిమాండ్ రోజుకు 8 నుంచి 10 లక్షల కిలోలున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది.

ఈ ఏడాది ఎండలు తీవ్రత విపరీతంగా ఉండటంతో పాటు చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలతో మే నెల చివరి వారంలో కోళ్ల మరణాలు అధికమయ్యాయని పౌల్ట్రీ నిపుణులు చెబుతున్నా రు. సముద్ర చేపల వేట నిషేధం (ఏప్రిల్ 15 జూన్ 14 దాకా) ఉండటంతో రిటైల్ మార్కెట్లు సీ ఫుడ్ లభ్యత తగ్గిపోయింది.దీంతో బాయిలర్ చికెన్ వాడకానికి ఇది హేతువైంది. చికెన్ కూరలో వాడే ఇతర పదార్థాలైన అల్లం, కూరగాయల ధరలు పెరుగుదల కూడా ఆజ్యం పోసినట్లయింది. జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు కొంత మంది ధరలు పెంచుతున్నట్లు కొందరు చెబుతున్నారు, వ్యాపారాలు చక్కగా జరగాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రకృతి విరుద్ధంగా ప్రయోగాలు చేస్తుండటం కూడా కోళ్లు చనిపోవడానికి కారణమన్న వాదన కూడా ఉంది. చికెన్ ధరతో పాటు కోడిగుడ్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. గత నెలలో పాతిక గుడ్లు 100 నుంచి 110 రూపాయలు పలకగా ఇప్పుడు ఏకంగా ఇంచుమించు రూ. 150కి చేరింది. వాస్తవానికి కరోనా కాలంలో వైరస్‌పై రకరకాల ప్రచారాలు సాగటంతో ధరలు కిలోకు రూ. 40కు కూడా పడిపోయిన దాఖలాలున్నాయి.

ఇక ఇప్పుడు జన జీవనం సాఫీగా సాగిపోతుండటంతో సకల జనులు మునుపటిలా ఆహార అలవాట్లకు మారిపోయారు. కరోనా పిమ్మట.. పౌష్టికాహారానికి ప్రాధాన్యతనివ్వాలని వైద్యులు పదేపదే సూచనలు ఇవ్వడం… తద్వారా ఇమ్యూనిటీ పెరిగేందుకు చికెన్, ఇతర మాంసకృతులు దోహదం చేస్తాయని ఆరోగ్య సూత్రాలు వెల్లువెత్తడంతో జనం యథావిధిగా ఆహార అలవాట్లకు దగ్గరయ్యారు. పైగా మటన్ ధరలు ఎక్కువవ్వడం, ధరల దండయాత్రతో చికెన్‌కే మొగ్గు చూపుతున్నారు. ఉత్పత్తి వ్యయం ఎక్కువయిందని అందుకే కొత్తగా పిల్లలను పెంచడం లేదని వ్యాపారులు ముక్తాయిస్తున్నారు.
గాలిలో తేమ శాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. కోళ్ళ ఎదుగుదల పై ఇది తీవ్ర ప్రభావం చూపింది. మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్ళపై ఆధారపడడంతో కోళ్ళు అనుకున్నంత బరువు పెరగడం లేదు. కోళ్ళ పరిశ్రమలో 80% నుండి 85% వాటా కంపెనీలదేనని, మిగిలిన 15 20 శాతమే రైతులున్నారని చెబుతున్నారు. రైతులు కోళ్ళు పెంచి కంపెనీలకు అందజేస్తుంటారు. కోళ్ళ ధరలు నిర్ణయంలో కంపెనీలదే కీలక భూమిక కావడంతో, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని కొందరు రైతులు వివరిస్తున్నారు.

చెన్నుపాటి రామారావు 9959021483

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News