Monday, April 29, 2024

పార్లమెంటులో చర్చల తీరుపై సిజెఐ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Chief Justice comments on Parliament debates

న్యూఢిల్లీ : పార్లమెంటులో చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకప్పుడు పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో చట్టాలపై లోతైన చర్చ జరగక పోవడంపై విచారం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో , ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని, ఆవేదన వెలిబుచ్చారు. చట్టాలపై ఇదివరకు నిర్మాణాత్మక చర్చలు జరగడం ద్వారా కోర్టులకు వాటిని విశ్లేషించేందుకు వీలుగా ఉండేదన్నారు. ఏ లక్షంతో ఎవరిని ఉద్దేశించి ఆయా చట్టాలను రూపొందించారో న్యాయ స్థానాలకు సులువుగా అర్థమయ్యేదన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చను అందుకు ఉదాహరణగా చెప్పారు.

75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు బార్ అండ్ బెంచ్ నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని, దానివల్ల జరిగే పరిణామాలు, శ్రామిక వర్గంపై దాని ప్రభావాన్ని చక్కగా వివరించారని ఉదహరించారు. అలాగే ఇతర చట్టాలను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంలో పూర్తి స్థాయి చర్చలు జరిగేవన్నారు. దీనివల్ల ఆయా చట్టాల లక్షం, ఎవరిని ఉద్దేశించి తయారు చేశారో స్పష్టంగా తెలిసేదని, తద్వారా వాటిని విశ్లేషించాల్సి వచ్చినప్పుడు కోర్టులకు పని సులువయ్యేదని జస్టిస్ రమణ తెలిపారు. ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంటులో కరువైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంటు చర్చల విషయంలో చాలా విచారకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, సరైన చర్చ జరగకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో చట్టాలపై గందరగోళం తలెత్తుతోందన్నారు. మేథావులు, న్యాయవాదులు సభలో లేక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ నేపధ్యంలో న్యాయనిపుణులు , సామాజిక ప్రజా జీవితంలో కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర సమర యోధుల్లో చాలా మంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్లేనని, మొదటి లోక్ సభ, రాజ్యసభలో మొత్తం న్యాయవాదులే ఉన్నారని గుర్తు చేశారు. ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏరోజూ సమ సజావుగా సాగనప్పటికీ దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News